'ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది'
చెన్నై: నెల రోజుల కిందట గల్లంతైన తీర రక్షకదళ గస్తీ విమానం శకలాల ఆనవాళ్లు దొరికాయన్న వార్తలపై కో పైలెట్ సుభాష్ సురేష్ తల్లి పద్మా సురేష్ స్పందించారు. తమ కుమారుడి క్షేమ సమాచారంపై ఆమె ఆందోళన చెందుతున్నారు. 'జూన్ 8 నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఎపుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని గాభరాగా ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదని' పద్మా సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విమానం ఆనవాళ్లు లభించాయని వార్త విన్నప్పటినుంచీ మరింత కంగారుగా, భయంగా ఉందన్నారు. వాట్పాప్ గ్రూప్ సందేశాల ద్వారా, మీడియా ద్వారా మాత్రమే ఈ వార్త తమకు తెలిసిందనీ, అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం లేదని ఆమె అన్నారు.
అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తదుపరి సమాచారం కోసం వేచి చూడాలని కోస్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారని, సుభాష్ బంధువు వెంకటేష్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని మరో సిబ్బంది సోనీ బంధువు తెలిపారు.
కాగా తమిళనాడు సముద్ర తీర ప్రాంతం చిదంబరం-కడలూరు మధ్య జలాల్లో డార్నియర్ గస్తీ విమానం శకలాలతో పాటు దాని ఫ్లయిట్ డాటా రికార్డర్‌ను 950 మీటర్ల అడుగున గుర్తించినట్లు రక్షణశాఖ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సితన్షు కర్ ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. రిలయన్స్ సంస్థకు చెందిన ఒలింపిక్ అనే నౌక వీటిని గుర్తించింది.
జూన్ 8న ముగ్గురు డిప్యూటీ కమాండెంట్లతో వెళ్లిన ఈ విమానం విధుల తర్వాత తిరిగొస్తుండగా చెన్నై తీరంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. దీనికోసం 33 రోజులుగా గాలింపు చర్యలు విస్తృత కొనసాగుతున్నాయి. ఈ విమానంలో డిప్యూటీ కమాండెంట్ (పైలట్) విద్యాసాగర్, డిప్యూటీ కమాండెంట్ (కో పైలట్) సుభాష్ సురేష్, నావిగేటర్ ఎంకె సోనీ ఉన్నారు. ఈ తరహా ప్రమాదాల్లో ఇది రెండోది. గత మార్చిలో గోవాలో జరిగిన ఎయిర్ క్రాప్ట్ కూలిపోయిన ప్రమాదంలో ఇద్దరు నేవీ అధికారులు మరణించారు.