missing kid
-
అదృశ్యమైన బాలుడు అనీష్ మృతి
హైదరాబాద్: రాజేంద్రనగర్లో అదృశ్యమైన బాలుడు అనీష్ మృతి చెందాడు. ఆ బాలుడు మృతదేహం చెరువులో లభించింది. ఇంటి వెనుకాలే ఉన్న చెరువులో బాలుడి మృతిదేహం లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి అనీష్ కనిపించకపోవడంతో వెతకటం ప్రారంభించారు. కాగా, ఈ రోజు శవమై చెరువులో కనిపించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక బొమ్మ కొనివ్వని కారణంగా మారం చేశాడని, అదే క్రమంలో బయటకు వెళ్లిన తమ చిన్నారి అనీష్ ఇలా శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది. -
చిన్నారి కిడ్నాపర్ల కోసం పోలీసు వేట షురూ
నల్లకుంట: ఈ నెల 6వ తేదీన న్యూనల్లకుంటలో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అయితే, చిన్నారిని అపహరించిన వారి జాడ కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. అపహరించుకుపోయిన చిన్నారి కె.మమత(5) శనివారం సాయంత్రం ఏఎస్రావ్ నగర్లో స్థానిక యువకుడొకరు కుషాయిగూడ పోలీసులు సమాచారమందించాడు. రాత్రి 11.15 గంటలకు మమత తల్లిదండ్రులు కె.నారాయణ, మంజుల చెంతకు చేరింది. అపహరణపై అనుమానాలు... కిడ్నాప్ వ్యవహారంలో ఇద్దరు మహిళలు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు మమతకు నీటుగా కటింగ్ చేయించారు. అదే విధంగా నెయిల్ పాలిష్ వేసి, కాళ్లకు పట్ట గొలుసులు, కొత్త దుస్తులు తొడిగించారు. ఇదంతా చూస్తుంటే వారు ఆమెను ఎవరికైనా అమ్మకానికి పెట్టారనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అపహరణలో బంధువులు, తెలిసిన వారి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. వీడియో పుటేజీల ఆధారంగా చిన్నారిని అపహరించుకుపోయిన మహిళల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాప్ కు గురైన పాప ఆచూకీ లభ్యం
హైదరాబాద్:నగరంలో కలకలం సృష్టించిన చిన్నారి మమత ఆచూకీ శనివారం లభించింది. ఆ పాప కుషాయిగూడలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా పాప ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. శుక్రవారం నల్లకుంటలో ఓ వీధిలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు మాయమాటలు చెప్పిన ఓ గుర్తు తెలియని మహిళ వారిని అపహరించింది. అయితే మార్గ మద్యంలో ఇద్దరు చిన్నారులను వదిలేసినప్పటికీ చిన్నారి మమతను మాత్రం తన వెంట తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు తమ గాలింపును తీవ్రతరం చేసి పాప ఆచూకీని కనుగొన్నారు. -
నల్లకుంటలో చిన్నారి అపహరణ
హైదరాబాద్: వీధిలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు మాయమాటలు చెప్పిన ఓ గుర్తు తెలియని మహిళ వారిని అపహరించింది. అయితే మార్గ మద్యంలో ఇద్దరు చిన్నారులను వదిలేసినప్పటికీ ఓ చిన్నారిని మాత్రం తన వెంట తీసుకెళ్లింది. ఈ సంఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు... న్యూ నల్లకుంటకు చెందిన నారాయణ, మంజుల దంపతుల పిల్లలు నవీన్(9), మమత (5) మరో చిన్నారి అంకిత(9)తో కలిసి ఆడుకుంటుండగా ఓ గుర్తు తెలియని మహిళ వారికి మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని వెళ్లింది. ఆటో తార్నాక చేరిన తర్వాత ఇద్దర్ని వదిలివేసి మమత అనే చిన్నారిని తీసుకుని పరారయ్యంది. చిన్నారి అపహరణ గురించి మిగతా ఇద్దరు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తండ్రి వారిని ఇంటికి తీసుకోచ్చాడు. అయితే బాలుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.