missing kids
-
అమెజాన్ అడవుల్లో అద్భుతం
బొగొటా: దక్షిణ అమెరికాలోని కొలంబియాలో దట్టమైన అమెజాన్ అడవుల్లో ఒక అద్భుతం జరిగింది. విమాన ప్రమాదంలో చిక్కుకొని అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ఏకంగా 40 రోజుల తర్వాత మృత్యుంజయులుగా బయటపడ్డారు. విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడమే ఒక అద్భుతమైతే, క్రూరమృగాలు తిరిగే అడవుల్లో 40 రోజులు ప్రాణాలతో ఉండడం మరో అద్భుతం. దట్టమైన అటవీ ప్రాంతంలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సైనికులు వారిని క్షేమంగా వెనక్కి తీసుకువచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పౌష్టికాహార లోపంతో బాగా బలహీనపడిపోవడంతో పాటుగా ఆ చిన్నారుల శరీరంపై పురుగు పుట్రా చేసిన కాట్లు ఉన్నాయి. ఒకే తల్లి బిడ్డలైన నలుగురు చిన్నారుల్లో 13, 9. 4 ఏళ్లతో పాటుగా ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు. చరిత్రలో నిలిచిపోతారు : అధ్యక్షుడు పెట్రో అడవుల్లో కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు క్షేమంగా వెనక్కి తిరిగి రావడంతో దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో మృత్యుంజయులు అన్న మాటకి వీరంతా ఉదాహరణగా నిలుస్తున్నారని అన్నారు. వీరు ప్రాణాలతో ఉండడం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇదొక మేజికల్ డే అని సైనికులు చేసిన కృషిని అభినందించారు. అసలేం జరిగింది? అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలో అరారాక్యూరా నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి గత నెల మే 1న ఒక సింగిల్ ఇంజిన్ విమానం బయల్దేరింది. నలుగురు చిన్నారులు, వారి తల్లి, ఒక గైడ్, ఒక పైలెట్‌తో విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తి ఇంజిన్ విఫలం కావడంతో దట్టమైన కీకారణ్యంలో కుప్పకూలిపోయింది. విమానం రాడార్ నుంచి అదృశ్యం కావడంతో అధికారులు వారిని కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఆపరేషన్ హోప్ పేరుతో సహాయ చర్యలు మొదలు పెట్టారు. విమాన ప్రమాదం జరిగిన రెండు వారాల అనంతరం మే 16న అధికారులు విమాన శకలాలను గుర్తించగలిగారు. అక్కడ పైలెట్, గైడ్, చిన్నారుల తల్లి మృతదేహాలు మాత్రమే లభించడంతో పిల్లలు నలుగురు సజీవంగా ఉన్నారని నిర్ణారణకి వచ్చారు. పిల్లలు క్షేమంగానే ఉన్నారనడానికి సైనికుల గాలింపుల్లో పాలసీసా, సగం తిని పారేసిన పండు, జడకు కట్టుకునే రిబ్బన్ వంటివి దొరకడంతో సహాయ చర్యలు మరింత ముమ్మరం చేశారు. పిల్లల అడుగు జాడలు కూడా చాలా చోట్ల కనిపించాయి. వాటి ఆధారంగా దాదాపుగా 150 మంది సైనికులతో పాటుగా జాగిలాల సాయంతో దట్టమైన అడవుల్లో గాలించారు. అడవుల్లో ఉండే గిరిజన తెగలు వారికి సహకారం అందించారు. మొత్తానికి ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత అధికారులు ఆ పిల్లల జాడ కనిపెట్టగలిగారు. హెలికాప్టర్లో రాజధాని బొగొటాలో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎలా మనుగడ సాగించారు? అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇన్నాళ్లూ పులులు, పాములు ఇతర క్రూరమృగాల మధ్య ఎలా మనుగడ సాగించారో వివరాలు తెలియాల్సి ఉంది.ఆ పిల్లలు హ్యూటోటో అనే స్థానిక తెగకు చెందినవారు. పుట్టినప్పట్నుంచి అటవీ ప్రాంతాల్లోనే వారు నివాసం ఉంటున్నారు. అడవుల్లో చెట్లకు కాసే ఏ పళ్లు తినాలో , క్రూర మృగాల బారిన పడకుండా ఎలా తమని తాము కాపాడుకోవాలో కొంతవరకు వారికి అవగాహన ఉంది. అందుకే కీకారణ్యంలో తప్పిపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సహాయ కార్యక్రమాల్లో భాగంగా హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహార పొట్లాలు బహుశా పిల్లలను కాపాడి ఉంటాయని సైనికాధికారులు భావిస్తున్నారు. పిల్లలు క్షేమంగా తిరిగిరావడంతో వారి బామ్మ ఫాతిమా వాలెన్సియా ఆనందానికి హద్దులే లేవు. పిల్లల తల్లి పనిలో ఉన్నప్పుడు పెద్దమ్మాయి మిగిలిన చిన్నారుల ఆలనాపాలనా చూసేదని, అదే ఇప్పుడు అడవుల్లో వాళ్లు ఇన్నాళ్లూ గడపడానికి ఉపయోగపడిందని చెప్పారు. -
‘ఆపరేషన్ స్మైల్’ ఐదో దఫా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తప్పిపోయిన చిన్నారులు, బాల కార్మిక వ్యవస్థలో నిర్బంధంగా పనిచేస్తున్న మైనర్లు, వ్యభిచార కూపాల్లో బాల్యాన్ని బంధీగా చేయబడ్డ బాలికలను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్ ఐదో దఫా కార్యక్రమం సోమవారం ప్రారంభమైం ది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్, మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సుమతి, మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి ప్రారంభించారు. 22 వేల మంది రెస్క్యూ.. గత 4 దఫాల ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 22 వేల మంది చిన్నారులను పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు రెస్క్యూ చేశాయి. వీరిలో 60% మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, మిగతా వారి ని స్టేట్ హోమ్స్‌కు తరలించి విద్య, వసతి కల్పిస్తున్నారు. ఈసారీ అదే రీతిలో పారిశ్రామిక వాడల్లో బాల కార్మికులుగా ఉన్న వారిని గుర్తించడం, బెగ్గింగ్ మాఫియా కింద భిక్షాటనలో నలిగిపోతున్న చిన్నారులను రెస్క్యూ చేయడం, వ్యభిచారంలో మగ్గుతున్న మైనర్లను బయటపడేసేందుకు కృషి చేయనున్నట్టు ఐజీ స్వాతి లక్రా తెలిపారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 174 మంది అధికారులను ప్రత్యేకంగా ఆపరేషన్ స్మైల్ కోసం రంగంలోకి దించుతున్నామని చెప్పారు. వీరందరికి సోమవారం అవగాహన, రెస్క్యూ ఆపరేషన్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఫేసియల్ రికగ్నైజేషన్.. రెస్క్యూ సందర్భంగా గుర్తించిన చిన్నారులు, మైనర్లు వారి వారి వివరాలు చెప్పేందుకు భయపడటం లేదా తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడతారని, ఇలాంటి సందర్భంలో రాష్ట్ర పోలీస్ శాఖ రూపొం దించిన ‘దర్పన్’ ఫేసియల్ రికగ్నైజేషన్ యాప్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని శిక్షణలో అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా అదృశ్యమైన వారి వివరాల డేటా బేస్ అందుబాటులో ఉంటుం దని, చిన్నారుల ఫొటోలను సరిపోల్చి అడ్రస్, ఇతర వివరాలు గుర్తించనున్నట్లు చెప్పారు. దీని వల్ల ఆయా ప్రాంతాల్లోని పోలీసులను అలర్ట్ చేసి తల్లిదం డ్రులకు పిల్లలను అందజేయడం సులభంగా ఉం టుందని శిక్షణలో ఉన్నతాధికారులు సూచించారు. నెల రోజులపాటు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం కొనసాగుతుందని, ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్ శాఖకు తెలిపేందుకు ప్రజలు ముందుకు రావాలని సీఐడీ ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. -
పోలీసులకు నిద్రలేకుండా చేసిన బాహుబలి 2
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘బాహుబలి 2’ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. సరిహద్దులతో సంబంధం లేకుండా రికార్డుల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రరాజం బుధవారం రాత్రంతా జైపూర్ పోలీసులకు నిద్రలేకుండా చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. శక్తినగర్ ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు తప్పిపోయినట్టు బుధవారం సాయంత్రం జోత్వారా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. 8 నుంచి 13 ఏళ్ల వయసున్న ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు సోదరులు, వారి స్నేహితుడు ఉన్నాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నగరాన్ని జల్లెడ పట్టారు. ‘నగరంలో చాలా చోట్ల గాలించాం. ఇన్ఫార్మర్ల సహాయం తీసుకున్నాం. రాత్రంతా పెట్రోలింగ్ వాహనాలతో సిటీ అంతా తిరిగామ’ని జోత్వారా ఎస్ఐ గురుదత్ సైనీ తెలిపారు. గురువారం తెల్లవారుజామున చిన్నారుల ఆచూకీ తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జోత్వారాలోని ఓ ఆలయం వద్ద చిన్నారులను కనుగొన్నారు. తర్వాత చిన్నారుల చెప్పిన మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు. బాహుబలి 2 సినిమా చూడడానికి వెళ్లి తప్పిపోయామని చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. ‘సమీపంలో ఉన్న ధియేటర్లో బాహుబలి 2 సినిమాకు చూడటానికి వెళ్లమని చెప్పారు. టిక్కెట్లు దొరక్కపోవడంతో వాళ్లు సినిమా చూడలేకపోయారు. ఆలస్యంగా వెళితే ఇంట్లో తిడతారన్న భయంతో తిరుగు పయనమయ్యారు. కంగారులో దారి తప్పిపోయామని’ చిన్నారులు చెప్పినట్టు జోత్వారా పోలీసు అసిస్టెంట్ కమిషనర్ ఆస్ మహ్మద్ తెలిపారు. ముగ్గురు చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు చెప్పారు. చిన్నారులు సురక్షితంగా ఉన్నారని, వారిని తమ ఇళ్లలో దించామని స్టేషన్ హౌస్ అధికారి వెల్లడించారు. ‘రాత్రంతా నిద్ర లేదు. ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల’ని ఆయన చెప్పడం గమనార్హం. -
చిన్నారుల ఆచూకీ కోసం ’అపరేషన్ స్మైల్’