వర్షాకాలమైనా.. తీరని దాహం.. వీడని కష్టాల తంటా..!
సిద్ధిపేట్: అంగట్లో అన్నీ ఉన్నా...అల్లుడు నోట్లో శని ఉందన్న చందంగా తయారైంది అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామ పరిధిలోని చౌటకుంటతండా పరిస్థితి. ఓ వైపు దంచికొడుతున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతుంటే తండాలో తాగడానికి గుక్కెడు నీరు కరువైంది.
తండాలో దాదాపుగా 83 పైగా కుటుంబాలు ఉన్నాయి. 310వరకు జనాభా ఉంది. ఇక్కడ వ్యవసాయం చేసుకుని జీవించే వారు.. పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ జవాన్లు సైతం ఉన్నారు. అయితే దాదాపు 20రోజులుగా తాగునీరు సరఫరా నిలిచింది. గ్రామపంచాయతీ ద్వారా సరఫరా చేసే బోరు మోటార్ పాడైంది. మరమ్మతులు చేయించాలని పలుమార్లు తండావాసులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని తండావాసులు చెబుతున్నారు.
అలాగే నెలరోజులుగా మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం బంద్ అయ్యాయని తెలిపారు. తండాలో ఉన్న సోలార్ పాడై మూడునెలల గడుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. నీటి కోసం వర్షాల్లో కిలో మీటరు మేర పొలాల వద్దకు పరుగులు తీస్తున్నామని కన్నీటి పర్యతమవుతున్నారు.
మోటార్ రిపేర్ చేయిస్తాం..
చౌటకుంటతండాలో బోరు మోటార్ పాడైంది వాస్తవమే. రిపేర్ చేయిద్దామంటే వారంరోజులుగా వానలు దంచికొడుతు న్నాయి. మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించడంలేదు. గత పాలకులు బోరుబావిని వాగులో తవ్వించారు. దీంతో వానాకాలం వస్తే తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. – అన్నాడీ దినేష్రెడ్డి, సర్పంచ్, కుందనవానపల్లి