ఓనమాలు.. ఒట్టిమాటే..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఓనమాలు దిద్దాల్సిన చేతులు పార, పలుగు పడుతున్నాయి. చాలా మంది పిల్లలు హోటళ్లు, పరిశ్రమల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. జిల్లాలో డీఆర్డీఏ, మోప్మా సమన్వయంతో జిల్లాలో బడిబయట పిల్లలపై సర్వే నిర్వహించింది. డీఆర్డీఏ లెక్కల ప్రకారం 1062 మంది బడిబయట ఉన్నారని తేలింది. మోప్మా ఆధ్వర్యంలో చేస్తున్న సర్వే లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా 500పైనే ఉంటారన్నది అంచనా.
ఇదీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వే లెక్కల ప్రకారం మాత్రమే. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, కాగజ్నగర్, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో చదువులకు దూరంగా ఉన్న పిల్లల లెక్కలు తేలాల్సి ఉంది. రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) ద్వారా ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా, దీనిపై క్షేత్రస్థాయి అధికారులు అంతగా పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా బడిబయట పిల్లల సంఖ్య పెరుగుతోంది.
దహెగాం, ఉట్నూరు, దహెగాం, కౌటాలలో అత్యధికం
బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలనేది విద్యాహక్కు చట్టం నిబంధన. ఇందుకోసం ఆర్వీఎం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు స్కూల్గ్రాంట్స్ నుంచి రూ.500, ప్రాథమికోన్నత పాఠశాలలు రూ.750 ఖర్చు చేసే వీలుంది. వీటిపై పర్యవేక్షణ ఆర్వీఎం అధికారులకు ఉంటుంది. ప్రత్యేకించి విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యార్థులను బడిలో చేర్పించటం, హెచ్ఎంలు ఉపాధ్యాయులను సమన్వయం చేసుకొని ప్రచారం చేయించాలి.
ప్రత్యేకంగా అంగన్వాడీల్లో ఉన్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పాఠశాలల్లో చేర్పించేలా ప్రయత్నించాలి. అయితే ఇది ఏటా మొక్కుబడిగా మారగా, ఏడు మున్సిపాలిటీలు మినహాయించి గుర్తించిన 34 మండలాల్లో 1,062 మంది బడిబయట ఉన్నారు. ఇందులో అత్యధికంగా దహెగాం మండలంలో 138, కెరమెరిలో 128, ఉట్నూరులో 124, కౌటాలలో 102 మంది బాల బాలికలు చదువులకు దూరంగా ఉన్నారు.
మొక్కుబడిగా విద్యాచట్టం అమలు
ఆర్వీఎం లెక్కల ప్రకారం గతేడాది 4,856 మందిని గుర్తించిన అధికారులు, అందులో 2,556 మంది 14 ఏళ్ల పైబడిన వారిగా తేల్చారు. 1,232 మందిని బడుల్లో చేర్పించినట్లు చెప్తుండగా ఇటీవల చేసిన సర్వేలో 34 మండలాల్లో 1,062 మంది బడిబయటే ఉన్నట్లు తేలింది. అధికారులు బడిఈడు పిల్లలు రోడ్ల వెంబడి తిరిగినా అంతగా శ్రద్ధ చూపడం లేదు. గతంలో గుర్తించన పిల్లలు పలువురు పాఠశాలలకే వెళ్లలేదు. ఇదిలా వుంటే ఆర్వీఎం, బాలకార్మిక నిర్మూలన వ్యవస్థ, కార్మిక శాఖలు సంయుక్తంగా కలిసి పనిచేయాల్సి ఉండగా.. ఇవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యానికి అంతగా ప్రయోజనం లేకుండా పోతుంది.