mission kaktiya
-
రాష్ట్ర వ్యవసాయ పథకాలు ఆదర్శం
హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని జాతీయ వర్షాధారిత ప్రాంత అథారిటీ (నేషనల్ రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ) సీఈఓ డాక్టర్ అశోక్‌దళ్వాయ్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 4వ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ‘రిమాండేటింగ్ అగ్రికల్చర్ ఫర్ ఇండియా అండ్ ఇట్స్ ఫార్మర్స్’అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. చెరువుల మరమ్మతులతో భూగర్భ జలాల పెంపుకోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం దేశంలోని అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. రైతులకు పెట్టు బడి కోసం ఎకరాకు రూ.4వేలు ఇచ్చే రైతుబంధు పథకంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న కార్యక్రమాలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు. వ్యవసాయరంగంలో ఎదురయ్యే సవాళ్లకు ఆధునికశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలే సరైన పరిష్కారాన్ని చూపగలవన్నారు. ఉద్యాన పంటల ఉత్పత్తిలో మిగతా దేశాలతో పొలిస్తే మనం అగ్రగామిగా ఉన్నప్పటికీ రైతుల ఆదాయం పెరగకపోవడం అందరినీ నిరుత్సాహపరుస్తోందన్నారు. సంప్రదాయ పరిష్కారాలు అవసరం: సీఎస్ జోషి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి మాట్లాడుతూ.. భారత వ్యవసాయ రంగానికి సంప్రదాయ పరిష్కారాలు అవసరమన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి సాగు ఖర్చులు తగ్గించి, ఉత్పాదకత పెంపుపై దృష్టి నిలపాలన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో 30.29 లక్షల మంది రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టడం, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబీకులకు అందించే పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంపు, 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ అందించడం, కోటి ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టులను చేపట్టామన్నారు. పంటల పెట్టుబడి కోసం ప్రతీ సీజన్లో ఎకరాకు రూ.4 వేల వంతున 49.4 లక్షల మంది రైతులకు రూ.5011 కోట్లు అందించామన్నారు. రైతులను పంటమార్పిడి వైపు శాస్త్రవేత్తలు ప్రోత్సహించాలని సూచించారు. యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా ఏడుగురు ఆదర్శ రైతులకు ఉత్తమ రైతు అవార్డులను అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, వ్యవసాయ శాస్త్రవేత్తలకు అవార్డులు అందజేశారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు బంగారు పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రచురించిన పలు పుస్తకాలు, సంచికలను విడుదల చేశారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కె.కోటేశ్వరరావు, పీజీ స్టడీస్ డీన్ మీనాకుమారి పాల్గొన్నారు. -
‘మిషన్’ కింద కొత్త చెరువుల తవ్వకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిషన్ కాకతీయ కింద కొత్త చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిషన్ కాకతీయ నాలుగో దశలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 26 కొత్త చెరువులు తవ్వాలని నిర్ణయించింది. వాటికి సంబంధించి స్టేజ్–1 అనుమతిని మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.92 కోట్ల నిధులను మంజూరు చేసింది. భూసేకరణ తదితర చట్టపరమైన పనులను పూర్తి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. భూసేకరణ తదితర పనులు పూర్తయ్యాక చెరువుల నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం చిన్న నీటిపారుదల చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించింది. ఈ ప్రతిపాదనలకు స్టేజ్–1 కింద విడుదల చేసిన నిధుల వినియోగపత్రాలను కూడా జత చేయాలని స్పష్టం చేసింది. మంజూరైన 26 కొత్త చెరువుల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఐదు, బోథ్ నియోజకవర్గంలో 10, ఖానాపూర్ నియోజకవర్గంలో ఆరు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆరు చెరువులు ఉన్నాయి. ఈ 26 కొత్త చెరువుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులకు, మూడు జిల్లాల కలెక్టర్లకు, ఇంజనీర్లకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. కొత్త చెరువులు ఇదే తొలిసారి మిషన్ కాకతీయలో కొత్త చెరువుల నిర్మాణానికి అనుమతిని మంజూరు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మిషన్ కాకతీయ కింద ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన మూడు దశల పనుల్లోనూ అద్భుతమైన పురోగతి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 2,747 చెరువులకుగాను మూడు దశల్లో కలిపి 1,275 చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. మిగతా 1,472 చెరువులకుగాను నాలుగో దశలో 378 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు 41 కొత్త చెరువులు, 3 ఆనకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయి. ఇందులో తొలుత 26 కొత్త చెరువుల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం లభించింది. మిగతా చెరువులకు త్వరలోనే అనుమతి లభించనుంది. ఈ చెరువుల కింద మొత్తంగా 25 వేల ఎకరాల మేర ఆయకట్టు కొత్తగా సాగులోనికి రానుంది. ఇక జిల్లాలో మూడు దశల్లో చేపట్టిన మిషన్ కాకతీయ, జపాన్ ఆర్థిక సహకారంతో చేపట్టిన చెరువుల నిర్మాణంతో ఇప్పటివరకు 59,840 ఎకరాలు కొత్తగా సాగులోకి రాగా.. మరో 1.30 లక్షల ఎకరాలు స్థిరీకరించినట్లు చిన్న నీటిపారుదల సీఈ శ్యాంసుందర్ తెలిపారు. -
మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించాలి
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనుల నాణ్యతలో రాజీపడేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల మొత్తం కార్యక్రమానికి మచ్చ వస్తుందని పేర్కొన్నారు. శనివారం జలసౌధలో జిల్లాలు, మండలాల వారీగా మిషన్ కాకతీయ 1, 2, 3 దశల్లో నడుస్తున్న పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26న మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు. తొలివిడత పనులను ఈ నెలాఖరులోగా 100 శాతం పూర్తి చేయాలని చెప్పారు. మంజూరై ప్రారంభించిన పనుల్లో ఇంకా కొన్ని చోట్ల పనులు పూర్తి కాకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రెండో విడత చేపట్టిన పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలన్నారు. మూడో దశలో చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఆయా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. నాలుగో విడత చేపట్టనున్న పనులను గుర్తించి ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా సిద్ధం చేసి పంపించాలన్నారు. లోపాల్లేకుండా సంబంధిత చెరువుల పునరుద్ధరణకు నిజంగా అవసరమైన వాటికే అంచనాలు రూపొందించాలని సూచించారు. మిషన్ కాకతీయ కింద చేపట్టాల్సిన పనుల ఎంపిక, అంచనాలు రూపొందించడం, నిర్మాణ పనులు, కొలతల నమోదు, బిల్లుల మంజూరు తదితర అన్ని విషయాల్లోనూ కిందిస్థాయి జేఈ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దేశ విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్న మిషన్ కాకతీయ పనుల్లో చిన్న చిన్న పొరపాట్లు, అవకతవకల్లేకుండా చూడాలని కోరారు. నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సీఈ, ఎస్ఈలు క్షేత్రస్థాయికి వెళ్లి పనులను నిరంతరం పరిశీలించాలని, నిర్మాణ పనులపై నాణ్యతా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. -
‘కాకతీయ’ మట్టి కాలేజీకి!
పెద్దపల్లి ఎమ్మెల్యేకు కలిసొచ్చిన మిషన్ కాకతీయ సుమారు 4,500 ట్రిప్పుల మట్టి తరలింపు సీఎం పేషీకి ఫిర్యాదు పెద్దపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహాయజ్ఞంగా తలపెట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమ లక్ష్యం పక్కదారి పడుతోంది. టెండర్ల ప్రక్రి య మొదలు మట్టిని తరలించేవరకు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తోందనే దానికి పెద్దపల్లి నియోజకవర్గమే నిదర్శనం. ఈ నియోజకవర్గ పరిధిలో మిషన్ కాకతీయ కాంట్రాక్టు పనులన్నీ దాదాపుగా తన అనుచరులు, బంధువులకే దక్కేలా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పనిలో పనిగా చెరువు మట్టిని సైతం వదల్లేదు. చెరువు మట్టిని పొలాల్లోకే తరలించాలని రైతులకు పిలుపునిచ్చి, అందుకు భిన్నంగా తన సొంత ప్రయోజనాలకు వాడుకోవడం చర్చనీయాంశమైంది. పెద్దపల్లిలోని ట్రినిటీ కళాశాల మైదానాన్ని చదును చేసుకునేందుకు రెండు చెరువుల నుంచి 4 వేల 500 ట్రిప్పుల మట్టిని తరలించినట్లు తెలుస్తోంది. బందంపల్లి చెరువు నుంచి 200 ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఏకంగా 4 వేల ట్రిప్పుల మట్టి మొరం తరలించారు. కాసులపల్లి చెరువు నుంచి 500 ట్రిప్పులకు పైగా మట్టిని కాలేజీకి తరలించారు. చెరువు మట్టి రైతులకు అవసరం లేనప్పుడు, సదరు చెరువు మట్టి పొలాలకు పనికి రాదని భావిస్తేనే ఇతరత్రా అవసరాలకు వినియోగించాలి. అందుకు గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం. ఆ మట్టిని సైతం క్యూబిక్ మీటర్‌కు రూ.60 చొప్పు న రుసుం చెల్లించి తీసుకెళ్లాలి. ఈ 4 వేల ట్రిప్పుల మట్టికి ఎలాంటి రుసుం ప్రభుత్వానికి చెల్లించలేదని పేర్కొంటూ టీడీపీ నాయకులు ఉప్పు రాజు, ఎడె ల్లి శంకర్, సీపీఐ నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్, తాండ్ర సదానందం, సీపీఎం నాయకుడు రమేశ్ తదితరులు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. పొలాల్లోకి తరలించాల్సిన సారవంతమైన భూమిని సొంత కాలేజీకి ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. అధికారులపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు ఎమ్మెల్యేనుంచి జరిమానా వసూలు చేయాలని డిమాండ్ చేశారు.