సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిషన్ కాకతీయ కింద కొత్త చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిషన్ కాకతీయ నాలుగో దశలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 26 కొత్త చెరువులు తవ్వాలని నిర్ణయించింది. వాటికి సంబంధించి స్టేజ్–1 అనుమతిని మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.92 కోట్ల నిధులను మంజూరు చేసింది. భూసేకరణ తదితర చట్టపరమైన పనులను పూర్తి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు.
భూసేకరణ తదితర పనులు పూర్తయ్యాక చెరువుల నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం చిన్న నీటిపారుదల చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించింది. ఈ ప్రతిపాదనలకు స్టేజ్–1 కింద విడుదల చేసిన నిధుల వినియోగపత్రాలను కూడా జత చేయాలని స్పష్టం చేసింది. మంజూరైన 26 కొత్త చెరువుల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఐదు, బోథ్ నియోజకవర్గంలో 10, ఖానాపూర్ నియోజకవర్గంలో ఆరు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆరు చెరువులు ఉన్నాయి. ఈ 26 కొత్త చెరువుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులకు, మూడు జిల్లాల కలెక్టర్లకు, ఇంజనీర్లకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
కొత్త చెరువులు ఇదే తొలిసారి
మిషన్ కాకతీయలో కొత్త చెరువుల నిర్మాణానికి అనుమతిని మంజూరు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మిషన్ కాకతీయ కింద ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన మూడు దశల పనుల్లోనూ అద్భుతమైన పురోగతి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 2,747 చెరువులకుగాను మూడు దశల్లో కలిపి 1,275 చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. మిగతా 1,472 చెరువులకుగాను నాలుగో దశలో 378 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దీంతోపాటు 41 కొత్త చెరువులు, 3 ఆనకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయి. ఇందులో తొలుత 26 కొత్త చెరువుల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం లభించింది. మిగతా చెరువులకు త్వరలోనే అనుమతి లభించనుంది. ఈ చెరువుల కింద మొత్తంగా 25 వేల ఎకరాల మేర ఆయకట్టు కొత్తగా సాగులోనికి రానుంది. ఇక జిల్లాలో మూడు దశల్లో చేపట్టిన మిషన్ కాకతీయ, జపాన్ ఆర్థిక సహకారంతో చేపట్టిన చెరువుల నిర్మాణంతో ఇప్పటివరకు 59,840 ఎకరాలు కొత్తగా సాగులోకి రాగా.. మరో 1.30 లక్షల ఎకరాలు స్థిరీకరించినట్లు చిన్న నీటిపారుదల సీఈ శ్యాంసుందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment