సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనుల నాణ్యతలో రాజీపడేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల మొత్తం కార్యక్రమానికి మచ్చ వస్తుందని పేర్కొన్నారు. శనివారం జలసౌధలో జిల్లాలు, మండలాల వారీగా మిషన్ కాకతీయ 1, 2, 3 దశల్లో నడుస్తున్న పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26న మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు.
తొలివిడత పనులను ఈ నెలాఖరులోగా 100 శాతం పూర్తి చేయాలని చెప్పారు. మంజూరై ప్రారంభించిన పనుల్లో ఇంకా కొన్ని చోట్ల పనులు పూర్తి కాకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రెండో విడత చేపట్టిన పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలన్నారు. మూడో దశలో చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఆయా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
నాలుగో విడత చేపట్టనున్న పనులను గుర్తించి ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా సిద్ధం చేసి పంపించాలన్నారు. లోపాల్లేకుండా సంబంధిత చెరువుల పునరుద్ధరణకు నిజంగా అవసరమైన వాటికే అంచనాలు రూపొందించాలని సూచించారు. మిషన్ కాకతీయ కింద చేపట్టాల్సిన పనుల ఎంపిక, అంచనాలు రూపొందించడం, నిర్మాణ పనులు, కొలతల నమోదు, బిల్లుల మంజూరు తదితర అన్ని విషయాల్లోనూ కిందిస్థాయి జేఈ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
దేశ విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్న మిషన్ కాకతీయ పనుల్లో చిన్న చిన్న పొరపాట్లు, అవకతవకల్లేకుండా చూడాలని కోరారు. నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సీఈ, ఎస్‌ఈలు క్షేత్రస్థాయికి వెళ్లి పనులను నిరంతరం పరిశీలించాలని, నిర్మాణ పనులపై నాణ్యతా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment