mla aadi
-
దేశంలో విభేదాలు బట్టబయలు
హనుమనుగుత్తిలో అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే ఆది, సురేష్ నాయుడు వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు – గతంలో ఆమోదించిన పనులు చేయాలన్న ఎమ్మెల్యే ఆది వర్గం – వాయిదా వేయాలని పట్టుబట్టిన సురేష్ నాయుడు వర్గం – అత్యవసర సమావేశంలో పైచేయి సాధించిన సురేష్ నాయుడు వర్గం ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండల పరిధిలోని హనుమనగుత్తి గ్రామ పంచాయతీలో టీడీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల విషయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు వర్గానికి, ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి వర్గానికి మధ్య విభేదాలు పొడసూపాయి. గతంలో ఆమోదించిన పనులను వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే ఆది వర్గం కోరగా, ఆ పనులు నిలుపుదల చేసి ఉన్న గ్రామ పంచాయతీ నిధులు రూ.20 లక్షలను ఉపాధికి కేటాయించాలని సురేష్ నాయుడు వర్గం కోరింది. దీంతో అత్యవసర సమావేశం నిర్వహించాలని సురేష్ వర్గానికి చెందిన 6 మంది వార్డు మెంబర్లు సర్పంచ్ రామలక్షుమ్మకు విన్నవించుకున్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో డీఎల్పీవో అపూర్వ సుందరి, సర్పంచ్ రామలక్షుమ్మ, ఈవోపీఆర్డీ శివకుమారిల సమక్షంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సురేష్ నాయుడు వర్గీయుల మాటే నెగ్గింది. హనుమనగుత్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీఎల్పీవో అపూర్వసుందరి మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించి 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.9.73 లక్షలు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.71 లక్షలు, జనరల్ ఫండ్ రూ.13.56 లక్షలు ఉన్నాయన్నారు. జనరల్ ఫండ్‌లో 20 శాతం పరిపాలన విభాగానికి కేటాయించినట్లు తెలిపారు. సుమారు రూ.20 లక్షలు నిధులను ఉపాధి హామీ పథకానికి ఇవ్వాలని, గత నెల 28వ తేదీన ఆమోదం తెలిపిన 15 పనులను మూడు నెలల పాటు వాయిదా వేయాలని, మే నెల 25వ తేదీన ఆమోదించిన 2 పనులను రెండు నెలలు పాటు వాయిదా వేయాలని 6 మంది వార్డు మెంబర్లు కోరినట్లు తెలిపారు. అలాగే మరో ముగ్గురు వార్డుమెంబర్లు మాత్రం గతంలో ఆమోదించిన పనులు వెంటనే చేపట్టాలని, ఉపాధికి నిధులను మళ్లించకూడదని కోరినట్లు తెలిపారు. ఒక వార్డు మెంబర్ ఓబుళమ్మ వృద్ధురాలు కావడంతో తటస్థంగా ఉన్నారని దీంతో మెజార్టీ వార్డు మెంబర్ల ఆమోదం మేరకు పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నట్లు ఆమె తెలిపారు. -
ఎమ్మెల్యే ఆది అనుచరుల వీరంగం
కడప అర్బన్: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు మంగళవారం రాత్రి కడప నగరంలోని హరిత హోటల్ ఆవరణలో ఓ వ్యక్తిని రివాల్వర్‌తో బెదిరించి వీరంగం సృష్టించారు. అంతేకాకుండా బాధితుడిని భయబ్రాంతులకు గురిచేసి హత్యాయత్నం కూడా చేశారు. ఈ సంఘటనపై బాధితుడు రేకం నారాయణ మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాను ఓ వ్యక్తికి రూ.14 లక్షలు అప్పుగా ఉన్న విషయం వాస్తవమేనని, తన అవసరానికి తీసుకుని నెలనెలా వడ్డీ చెల్లిస్తున్నానని తెలిపారు. అయినప్పటికీ తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. తాను రామాపురం మండలం కొత్తపల్లెకి చెందిన వాడినని, కొన్నేళ్లుగా కడపలోని చెమ్ముమియాపేటలో ఉంటున్నానని తెలిపారు. మంగళవారం తాను రామాపురంలోని శ్రీమన్నానారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యాసంస్థల వద్ద ఉంటే కొందరు వచ్చి తనను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని కడపకు తీసుకు వచ్చారని తెలిపారు. దారి పొడవునా ఇష్టమొచ్చినట్లు కొట్టారని, రివాల్వర్‌ను మెడపై పెట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనంలో తనను తీసుకొచ్చిన తర్వాత నగరంలోని హరిత హోటల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వద్దకు తీసుకొచ్చి వదిలేశారని తెలిపారు. హరితలో ఎమ్మెల్యే ఆది అనుచరుల హల్చల్ కడపలోని హరిత హోటల్ ఆవరణంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు బహిరంగంగా రేకం నారాయణను ఇష్టమొచ్చినట్లు తిడుతూ కొట్టే ప్రయత్నం చేసినట్లుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నారాయణను ఎవరో బలవంతంగా వాహనంలో తీసుకెళ్లారని బంధువులు రామాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కడపకు తీసుకొచ్చారని తెలుసుకుని సంఘటనా స్థలానికి రామాపురం ఎస్ఐ జీవన్‌రెడ్డి తన సిబ్బందితో వచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఏం చేస్తారోనని రేకం నారాయణ, అతని బంధువులు భయంభయంగా బిక్కుబిక్కుమంటూ హరిత హోటల్ ఆవరణంలో గడిపారు. దాదాపు గంటపాటు వారి మధ్య తర్జనభర్జనలు జరిగాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకుంది. వారిని చూసిన ఎమ్మెల్యే, అతని అనుచరులు హడావుడిగా హోటల్ లోపలికి వెళ్లిపోయారు. అనంతరం ఎస్ఐ జీవన్‌రెడ్డి రేకం నారాయణను తన వెంట ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా ఎస్పీ బంగ్లా ఎదురుగా ఉన్న హరిత హోటల్ ఆవరణంలోనే జరగడం గమనార్హం. కాగా ఈ ఘటనపై కాల్‌మనీ కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని పోలీసులకు నారాయణ విజ్ఞప్తి చేశారు.