ఎమ్మెల్యే ఆది అనుచరుల వీరంగం
కడప అర్బన్:
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు మంగళవారం రాత్రి కడప నగరంలోని హరిత హోటల్ ఆవరణలో ఓ వ్యక్తిని రివాల్వర్‌తో బెదిరించి వీరంగం సృష్టించారు. అంతేకాకుండా బాధితుడిని భయబ్రాంతులకు గురిచేసి హత్యాయత్నం కూడా చేశారు. ఈ సంఘటనపై బాధితుడు రేకం నారాయణ మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాను ఓ వ్యక్తికి రూ.14 లక్షలు అప్పుగా ఉన్న విషయం వాస్తవమేనని, తన అవసరానికి తీసుకుని నెలనెలా వడ్డీ చెల్లిస్తున్నానని తెలిపారు. అయినప్పటికీ తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. తాను రామాపురం మండలం కొత్తపల్లెకి చెందిన వాడినని, కొన్నేళ్లుగా కడపలోని చెమ్ముమియాపేటలో ఉంటున్నానని తెలిపారు. మంగళవారం తాను రామాపురంలోని శ్రీమన్నానారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యాసంస్థల వద్ద ఉంటే కొందరు వచ్చి తనను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని కడపకు తీసుకు వచ్చారని తెలిపారు. దారి పొడవునా ఇష్టమొచ్చినట్లు కొట్టారని, రివాల్వర్‌ను మెడపై పెట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనంలో తనను తీసుకొచ్చిన తర్వాత నగరంలోని హరిత హోటల్‌లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వద్దకు
తీసుకొచ్చి వదిలేశారని తెలిపారు.
హరితలో ఎమ్మెల్యే ఆది అనుచరుల హల్‌చల్
కడపలోని హరిత హోటల్ ఆవరణంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు బహిరంగంగా రేకం నారాయణను ఇష్టమొచ్చినట్లు తిడుతూ కొట్టే ప్రయత్నం చేసినట్లుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నారాయణను ఎవరో బలవంతంగా వాహనంలో తీసుకెళ్లారని బంధువులు రామాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కడపకు తీసుకొచ్చారని తెలుసుకుని సంఘటనా స్థలానికి రామాపురం ఎస్‌ఐ జీవన్‌రెడ్డి తన సిబ్బందితో వచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఏం చేస్తారోనని రేకం నారాయణ, అతని బంధువులు భయంభయంగా బిక్కుబిక్కుమంటూ హరిత హోటల్ ఆవరణంలో గడిపారు. దాదాపు గంటపాటు వారి మధ్య తర్జనభర్జనలు జరిగాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకుంది. వారిని చూసిన ఎమ్మెల్యే, అతని అనుచరులు హడావుడిగా హోటల్ లోపలికి వెళ్లిపోయారు. అనంతరం ఎస్‌ఐ జీవన్‌రెడ్డి రేకం నారాయణను తన వెంట ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా ఎస్పీ బంగ్లా ఎదురుగా ఉన్న హరిత హోటల్ ఆవరణంలోనే జరగడం గమనార్హం. కాగా ఈ ఘటనపై కాల్‌మనీ కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని పోలీసులకు నారాయణ విజ్ఞప్తి చేశారు.