చిక్కడపల్లి (హైదరాబాద్): వైమానిక దళంలో పనిచేసి రిటైరయ్యాక, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న టి.శివారెడ్డి అనే వ్యక్తి శుక్రవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఆయన భార్యతో విభేదాల నేపథ్యంలోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానిక ప్రజలు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లాకు చెందిన టి.శివారెడ్డి (44) గతంలో వైమానిక దళంలో పనిచేసి, రిటైరయ్యారు.
కొంతకాలం నుంచి బాగ్‌లింగంపల్లిలోని మానస ఎన్‌క్లేవ్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. భార్య రమాదేవితో విభేదాల నేపథ్యంలో 2017లోనే విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల కడపకు వెళ్లిన శివారెడ్డి.. శుక్రవారం ఉదయం 6గంటల సమయంలో బాగ్‌లింగంపల్లి నివాసానికి వచ్చారు. ఆయన సోదరి మహేశ్వరి ఉదయం తొమ్మిది గంటల నుంచి పలుమార్లు శివారెడ్డికి ఫోన్ చేశారు.
ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి.. కవాడిగూడకు చెందిన తన స్నేహితురాలు లక్ష్మీభవానికి ఫోన్ చేసి, తన సోదరుడికి ఇంటికి వెళ్లాలని కోరారు. లక్ష్మీభవాని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన తల్లితో కలసి శివారెడ్డి నివాసం వద్దకు వచ్చారు. తలుపు లోపలికి గడియ పెట్టి ఉండటంతో ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా స్పందన రాలేదు.
దీంతో వారికి అనుమానం వచ్చి.. వాచ్‌మన్ సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే శివారెడ్డి తుపాకీతో కాల్చుకుని, మంచంపై పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ ఎన్.సంజయ్‌కుమార్, క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే శివారెడ్డి కొంతకాలం నుంచి అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని బంధువులు చెప్తున్నారు. వీటికితోడు భార్యతో గొడవలతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment