హనుమనుగుత్తిలో అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే ఆది, సురేష్ నాయుడు వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు
– గతంలో ఆమోదించిన పనులు చేయాలన్న ఎమ్మెల్యే ఆది వర్గం
– వాయిదా వేయాలని పట్టుబట్టిన సురేష్ నాయుడు వర్గం
– అత్యవసర సమావేశంలో పైచేయి సాధించిన సురేష్ నాయుడు వర్గం
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండల పరిధిలోని హనుమనగుత్తి గ్రామ పంచాయతీలో టీడీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల విషయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు వర్గానికి, ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి వర్గానికి మధ్య విభేదాలు పొడసూపాయి. గతంలో ఆమోదించిన పనులను వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే ఆది వర్గం కోరగా, ఆ పనులు నిలుపుదల చేసి ఉన్న గ్రామ పంచాయతీ నిధులు రూ.20 లక్షలను ఉపాధికి కేటాయించాలని సురేష్ నాయుడు వర్గం కోరింది. దీంతో అత్యవసర సమావేశం నిర్వహించాలని సురేష్ వర్గానికి చెందిన 6 మంది వార్డు మెంబర్లు సర్పంచ్ రామలక్షుమ్మకు విన్నవించుకున్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో డీఎల్‌పీవో అపూర్వ సుందరి, సర్పంచ్ రామలక్షుమ్మ, ఈవోపీఆర్డీ శివకుమారిల సమక్షంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సురేష్ నాయుడు వర్గీయుల మాటే నెగ్గింది.
హనుమనగుత్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీఎల్‌పీవో అపూర్వసుందరి మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించి 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.9.73 లక్షలు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.71 లక్షలు, జనరల్ ఫండ్ రూ.13.56 లక్షలు ఉన్నాయన్నారు. జనరల్ ఫండ్‌లో 20 శాతం పరిపాలన విభాగానికి కేటాయించినట్లు తెలిపారు. సుమారు రూ.20 లక్షలు నిధులను ఉపాధి హామీ పథకానికి ఇవ్వాలని, గత నెల 28వ తేదీన ఆమోదం తెలిపిన 15 పనులను మూడు నెలల పాటు వాయిదా వేయాలని, మే నెల 25వ తేదీన ఆమోదించిన 2 పనులను రెండు నెలలు పాటు వాయిదా వేయాలని 6 మంది వార్డు మెంబర్లు కోరినట్లు తెలిపారు. అలాగే మరో ముగ్గురు వార్డుమెంబర్లు మాత్రం గతంలో ఆమోదించిన పనులు వెంటనే చేపట్టాలని, ఉపాధికి నిధులను మళ్లించకూడదని కోరినట్లు తెలిపారు. ఒక వార్డు మెంబర్ ఓబుళమ్మ వృద్ధురాలు కావడంతో తటస్థంగా ఉన్నారని దీంతో మెజార్టీ వార్డు మెంబర్ల ఆమోదం మేరకు పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నట్లు ఆమె తెలిపారు.
దేశంలో విభేదాలు బట్టబయలు
Published Mon, Sep 12 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
Advertisement
Advertisement