స్టేజీపైనే సీఎం సురేష్‌కు షాకిచ్చిన నారా లోకేశ్‌.. ప్రవీణ్‌కు టికెట్‌ పక్కానా? | - | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ టికెట్‌ ప్రవీణ్‌కే నారా లోకేశ్‌..?

Published Thu, Jul 6 2023 11:10 AM | Last Updated on Thu, Jul 6 2023 11:10 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీలో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. పోట్లదుర్తికి చెందిన సీఎం సురేష్‌నాయుడు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీనన్‌ ప్రారంభోత్సవ సందర్భంగా మరోమారు తెరపైకి వచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీకి చేరువ అయ్యేందుకు జిమ్మిక్కులతో అనూహ్య ఎత్తుగడలు వేస్తున్నారని ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మండిపడుతున్నట్లు సమాచారం. అయిష్టాంగానే ప్రారంభోత్సవానికి హాజరైనా బహిరంగ సభకు దూరంగా ఉండిపోయారు.

బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ సోదరుడు సీఎం సురేష్‌ ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ టికెట్‌పై కన్నేశారు. ఈనేపథ్యంలో అన్న క్యాంటీన్‌ పేరిట వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా అనేక మంది నాయకులను ఆహ్వానించారు. కాగా, మండలి విపక్షనేత యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి మినహా ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులెవ్వరూ హాజరు కాలేదు.

అందుకు కారణం కూడా టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి.. అతన్ని ప్రోత్సహిస్తున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌ శ్రీనివాసులరెడ్డిలే ప్రధాన కారుకులుగా పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇటీవల పాదయాత్రలో భాగంగా ప్రొద్దుటూరుకు వచ్చిన నారా లోకేశ్‌ పార్టీ టికెట్‌ ప్రవీణ్‌కే అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామాన్ని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు తెరవెనుక మంత్రాంగాలు నిర్వహించి, సీఎం సురేష్‌ను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.

పోట్లదుర్తి బ్రదర్స్‌పై ఫిర్యాదు....
టీడీపీ అధికారంలో ఉండగా పోట్లదుర్తి బ్రదర్స్‌కు అగ్రపీఠం దక్కింది. అధికారానికి దూరం కాగానే సీఎం రమేష్‌ బీజేపీ పంచన చేరారు. పోట్లదుర్తి గ్రామస్థాయి నాయకులకు ఉన్నతస్థాయి పదవులు కట్టబెట్టారు. ఆయన సోదరుడు సీఎం సురేష్‌ కూడా నాలుగేళ్లుగా పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రొద్దుటూరులో ఎవ్వరూ లేని సమయంలో పార్టీ కోసం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పనిచేశారు. ఇబ్బందులు పడ్డారు, నారా లోకేష్‌ సైతం అభ్యర్థిగా ఇండికేషన్‌ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్న క్యాంటీన్‌ అంటూ గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారని పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌ శ్రీనివాసులరెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు మండలి విపక్షనేత యనమల రామకృష్ణుడుకి ఫిర్యాదు చేసినట్లు సమచారం. ఇదే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కూడా వివరించడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం. కాగా యనమలతో మీ పెద్దరికం కోసం ప్రారంభోత్సవానికి హాజరయ్యామని, బహిరంగ సభలో పాల్గోనలేమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఆమేరకు వారిద్దరు బహిరంగ సభ వేదికపై కన్పించకపోవడం విశేషం.

అన్న క్యాంటీన్‌ ప్రారంభం
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక కొర్రపాడు రోడ్డులోని పీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో టీడీపీ నాయకుడు సీఎం సురేష్‌నాయుడు తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌, మొబైల్‌ క్యాంటీన్‌ను బుధవారం మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సీఎం సురేష్‌నాయుడు తన సొంత నిధులతో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మూసివేయించారన్నారు. పేదల పక్షాల నిలబడినట్లు జగన్‌ నటిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గద్దె దిగడం, జగన్‌ జైలుకు వెళ్లడమూ ఖాయమన్నారు. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి, సీఎం సురేష్‌నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, ప్రొద్దుటూరు నియోజవకర్గ ఇన్‌చార్జి టీడీపీ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, మైదుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఆసం రఘురామిరెడ్డి, వీఎస్‌ ముక్తియార్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement