ఉమాదేవికి దక్కని టికెట్‌.. ఆమెకే ఇన్‌చార్జ్‌ పదవి.. | - | Sakshi
Sakshi News home page

ఉమాదేవికి దక్కని టికెట్‌.. ఆమెకే ఇన్‌చార్జ్‌ పదవి..

Published Sat, Sep 9 2023 1:38 AM | Last Updated on Sat, Sep 9 2023 2:56 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌చార్జిగా శుక్రవారం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌ శ్రీనివాసులరెడ్డి సతీమణీ ఆర్‌ మాధవి పేరు ఖరారు చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియామకపు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా కేంద్రమైన కడప టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కమారుగా బట్టబయలయ్యాయి. ఇన్‌చార్జిగా నియమిస్తారని ఎంతోకాలంగా ఆశలు పెట్టుకున్న కార్పొరేటర్‌ ఉమాదేవి కుటుంబం భగ్గుమంటోంది. స్థానికులకు అవకాశం కల్పించమని కోరినా ఫలితం లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. స్థానికుల సత్తా ఏమిటో స్థానికేతరులకు చూపించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు.

కడప నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు ఆ పార్టీ అభ్యర్థి ఎస్‌బీ అంజద్‌బాషా ఘన విజయం సాధించారు. 1999 ఎన్నికల తర్వాత టీడీపీ కడప గడపలో వరుసగా ఓటమి చవిచూసింది. 2004 నుంచి కాంగ్రెస్‌, తర్వాత వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ విజయదుంధుబి మోగిస్తోంది. మరోమారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అభ్యర్థిత్వంపై ఆ పార్టీ ఏకై క కార్పొరేటర్‌ జి ఉమాదేవి కుటుంబం ఆశలు పెంచుకుంది. ఆమేరకు టీడీపీ నుంచి సిగ్నల్స్‌ రావడంతో గ్రౌండ్‌ వర్క్‌పై గత కొంతకాలంగా పథక రచన చేపట్టారు.

ఓటింగ్‌ ఎలా అనుకూలంగా పెంచుకోవాలనే దిశగా ముమ్మర యత్నాలు చేశారు. క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా మంతనాలు నిర్వహిస్తూ పలువురు క్రియాశీలక వ్యక్తుల మద్దతు కోరుతూ చాపకింద నీరులా ఉమాదేవి మామ ఆలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. అంతలోనే టీడీపీ ఇన్‌చార్జిగా ఆర్‌ మాధవిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఆచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఊహించని పరిణామంతో లక్ష్మీరెడ్డి కుటుంబం కినుక వహించింది. ఆయన మద్దతుదారులు ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో చూపించాలని బాహాటంగా ఆరోపణలు సంధిస్తున్నట్లు సమాచారం.

స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని కోరినా...
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును పలుమారు కలిసి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కడప టీడీపీ నేతలు అభ్యర్థించారు. స్థానికులను పరిగణలోకి తీసుకుని టికెట్‌ ఆశిస్తున్న అమీర్‌బాబు, జి ఉమాదేవి ఎవరికై నా టికెట్‌ కేటాయించాలని, మేమంతా కలిసికట్టుగా టీడీపీ విజయం కోసం కృషి చేస్తామని టీడీపీ నేత లక్ష్మీరెడ్డి చెప్పినట్లు సమాచారం. సామాజిక వర్గ సమీకరణ నేపథ్యంలో మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే అమీర్‌బాబును పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.

బలిజలు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే దుర్గాప్రసాద్‌ లేదా హరిప్రసాద్‌లను పరిశీలించాలని, రెడ్డికి టికెట్‌ కేటాయించాల్సి వస్తే తమ కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోవాలని లేదంటే గోవర్ధన్‌రెడ్డికి కట్టబెట్టినా తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం. అలా కాకుండా ఆర్‌ శ్రీనివాసులరెడ్డికి కట్టబెడితే పార్టీకి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటీకీ టీడీపీ అధిష్టానం వాసు కుటుంబానికి ఇన్‌చార్జి బాధ్యతలను కట్టబెట్టింది. అధిష్టానం నిర్ణయంతో కడప గడపలోని తెలుగుతమ్ముళ్లు రగిలిపోతున్నారు.

వ్యూహాత్మక అడుగులు వేసిన వాసు...
కడపలో ఆలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డి కుటుంబాన్ని కట్టడి చేసేందుకు పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌ శ్రీనివాసులరెడ్డి వ్యూహాత్మక అడుగులు వేశారని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించేందుకు కుప్పం వెళ్తూ కడప ఎయిర్‌పోర్టు నుంచి ఆలంఖాన్‌పల్లె మీదుగా కడపలోకి ప్రవేశించాల్సి ఉండగా, ఆ కార్యక్రమాన్ని తెరవెనుక మంత్రాంగం నిర్వహించి అడ్డుకున్నారు.

రింగ్‌రోడ్డు వెంబడి దేవుని కడప, పెద్దదర్గా దర్శించేలా ప్రణాళిక రూపొందించారు. తర్వాత చంద్రబాబు జోన్‌–6 ప్రాంతీయ సదస్సు నిర్వహణ కార్యక్రమం ఎయిర్‌పోర్టు సమీపంలో లక్ష్మీరెడ్డి స్థలంలో ఏర్పాటు చేయాలని భావించినా, ఆ కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు. లక్ష్మీరెడ్డి కుటుంబం టీడీపీలో ఫోకస్‌ కాకుండా వ్యూహాత్మకంగా శ్రీనివాసులరెడ్డి అడ్డుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈనేపథంలో కడప తెలుగుతమ్ముళ్లు ఇన్‌చార్జి ఆర్‌ మాధవికి ఏమాత్రం సహకరిస్తారో వేచి చూడాల్సిందే.!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement