కడప అర్బన్ : వైఎస్సార్‌సీపీ నేత శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడు టీడీపీ నేత పాలెంపల్లె సుబ్బారెడ్డిగా పోలీసుల దర్యాప్తులో తేల్చారు. ఏ3 నిందితుడు ల్యాబ్ శ్రీనుతో నిర్వహించిన రహస్య ఒప్పందం మేరకు హత్య ప్రణాళిక రచించినట్లు తేటతెల్లమైంది. ప్రధాన నిందితుల రిమాండ్ అనంతరం ఫోన్ కాల్స్, వాట్సా్‌ప్ చాటింగ్, గూగుల్ టేకౌట్ పరిశీలన దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు కీలక సమాచారం లభించింది.
సుబ్బారెడ్డి కోసం గాలిస్తుండగా అప్పటికే తన మొబైల్ ఫోన్ ఇంట్లో పడేసి, హైదరాబాద్‌కు వెళ్లినట్లు పోలీసులు పసిగట్టారు. వివిధ ప్రాంతాల్లో గాలించిన పోలీసులు టీడీపీ నేత సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు ల్యాబ్ శ్రీను టీడీపీ నేత సుబ్బారెడ్డితో చేసుకున్న ఒప్పందం వ్యవహారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హతుడు...నిందితులు ఒకనాటి మిత్రులే..
హత్యకు గురైన సి శ్రీనివాసులరెడ్డి, ప్రధాన నిందితులు ప్రతాప్‌రెడ్డి, పాలెంపల్లె సుబ్బారెడ్డి వీరంతా ఒకనాటి మిత్రులే. 2019 ఎన్నికల్లో వీరంతా తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశారు. అప్పటికే కడపలో కొన్ని వివాదాస్పద వ్యవహారాల్లోనూ ముగ్గురు ఉన్నారు. సుబ్బారెడ్డి, శ్రీనివాసులరెడ్డి మధ్య విభేదాలు తలెత్తడంతో 2020లో విడిపోయా రు. ఆ తర్వాత శ్రీనివాసుల రెడ్డితో సన్ని హి తంగా ఉన్న ప్రతాప్ రెడ్డి కూడా అతనితో విభేదాలు వచ్చి విడిపోయాడు. ఈ క్రమంలో ప్రతాప్ రెడ్డి, ల్యాబ్ శ్రీను పాలెంపల్లె సుబ్బారెడ్డితో హత్య విషయమై మంతనాలు నిర్వహించారు.
దీనికి సుబ్బారెడ్డి ప్రోత్సాహం ఇవ్వడంతో శ్రీనివాసులరెడ్డి హత్యకు ప్రణాళిక రచించి అంతమొందించారు. కాగా ఇదే విషయమై ల్యాబ్ శ్రీను వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘శ్రీనువాసులరెడ్డి మాకు మోసం చేశాడు, డబ్బులు ఇవ్వలేదు, శ్రీనువాసులరెడ్డిని హత్య చేయాలనుకుంటున్నాం’ అంటూ ఇంటికి వెళ్లి చెప్పి నట్లుగా ల్యాబ్ శ్రీను వివరించారు. ‘రూ.30 లక్షలు ఇస్తా.. కోర్టు వ్యవహారం చూసుకుంటా’నని సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు ల్యాబ్ శ్రీను అందులో వెల్లడించడం గమనార్హం.
పాలెంపల్లె సుబ్బారెడ్డి అరెస్టు – కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ వెల్లడి
కడప అర్బన్ : కడప నగరంలోని సంధ్యా సర్కిల్ వద్ద జూన్ 23న ఉదయం చిన్న నాగిరెడ్డి గారి శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడైన పాలెంపల్లి సుబ్బారెడ్డి అలియాస్ రాజు సుబ్బారెడ్డి (42)ని అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ వెల్లడించారు. ఈనెల 5న బుధవారం సాయంత్రం ఇర్కాన్ సర్కిల్ వద్ద అరెస్టు చేసినట్లు వివరించారు. గురువారం సాయంత్రం డీఎస్‌పీ మీడియాతో మాట్లాడారు. గత నెల హత్యకు గురైన చిన్ననాగిరెడ్డిగారి శ్రీనివాసులరెడ్డి ప్రస్తుతం అరెస్టు చేసిన పాలెంపల్లి సుబ్బారెడ్డి ఇద్దరూ 2020 సంవత్సరం వరకూ సన్నిహితంగా ఉంటూ కలిసి వ్యాపారాలు చేసుకునేవారు. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు.
పరస్పర దాడులు చేసుకునే స్థితికి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో శ్రీనివాసులరెడ్డికి సన్నిహితులుగా ఉన్న ప్రతాప్‌రెడ్డి, ల్యాబ్ శ్రీనివాసులు సైతం విడిపోయారు. దీంతో శ్రీనివాసులరెడ్డిని హత్య చేసేందుకు ల్యాబ్ శ్రీను సుబ్బారెడ్డితో చర్చలు నిర్వహించారు. హత్య చేసేందుకు నిందితులకు సుబ్బారెడ్డి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు రూ. 30 లక్షలు డబ్బులు ఇవ్వడంతో పాటు కోర్టు వ్యవహారాలు చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. హత్య కేసులో ఇదివరకే అరెస్టు అయిన ఏ3 నిందితుడు మేరువ శ్రీనివాసులు అలియాస్ ల్యాబ్ శ్రీను హత్యకు కొన్ని రోజుల ముందు సుబ్బారెడ్డి ఇంటిలో కూర్చుని హత్యకు కుట్ర చేసినట్లు తమ విచారణలో వెల్లడైంది.
హత్య చేసిన తర్వాత ఏ3 అయిన ల్యాబ్ శ్రీను పాలెంపల్లి సుబ్బారెడ్డికి ‘హత్య చేశాం..అతను చనిపోయాడు..’అంటూ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. గూగుల్ టేక్ అవుట్ ద్వారా సాంకేతిక ఆధారాలను పరిశీలించి చూడగా సుబ్బారెడ్డి ప్రమేయం స్పష్టమైందని డీఎస్పీ తెలిపారు. నిందితుడు సుబ్బారెడ్డి తన సెల్ ఫోన్‌లోని వాట్సాప్ మెసేజ్‌లను డిలీట్ చేసారు. వాటిని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా మని డీఎస్పీ వివరించారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన సుబ్బారెడ్డి పై 12 కేసులు నమోదై ఉన్నాయి. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు, రెండు ఆత్మహత్య కు ప్రేరేపించిన కేసులతో పాటు ఎస్.సి.,ఎస్.టి అట్రాసిటీ కేసులోనూ నిందితుడుగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment