సాక్షి ప్రతినిధి, కడప: అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. తాజాగా మద్యం షాపుల ఏర్పాటు విషయంలో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా కడప నగరంలోని బిల్టప్ సమీపంలో మద్యంషాపు ఏర్పాటుపై కడప, కమలాపురం ఎమ్మెల్యేల వర్గీయులు పరస్పర ఫిర్యాదులు హాట్ టాఫిక్‌గా మారాయి.
కడపలో టీడీపీ కార్యకర్తలు మినహా మరెవ్వరూ మద్యం టెండర్లు వేయరాదంటూ ముందస్తు బెదిరింపులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో చూద్దామని కొంతమంది సాహసం చేసి దరఖాస్తులు వేశారు. మరికొంతమంది పొరుగున ఉన్న అధికారపార్టీ నేతల మద్దతుతో పాల్గొన్నారు. టెండర్లు ప్రక్రియ ముగియగానే మద్యం షాపులు లభించిన వారందరూ వచ్చి మాట్లాడాలని కడప ముఖ్యనేత కబురు పెట్టారు. మెజార్టీ లాటరీ విజేతలు సంప్రదింపులు చేపట్టారు. తమ వర్గీయుల భాగస్వామ్యం తప్పనిసరి అంటూ కలిసినవారికి సదరు నేత హుకుం జారీ చేశారు. దీనికి కొందరు అంగీకరించారు, మరికొందరు తిరస్కరించారు. ఇలాంటి పరిస్థితుల్లో బిల్టప్ సమీపంలో లాటరీ విజేతలు రెండు షాపులు ఏర్పాటు చేశారు. రెడ్డి, మౌర్య వైన్స్ పేరుతో వెలిశాయి. ఈ రెండింటిలో ఒకటి కడప, మరొకటి కమలాపురం ఎమ్మెల్యేల మద్దతుదారులవి. అప్పటికే అక్కడ గోసుల బార్‌అండ్‌రెస్టారెంట్ ఒకటి ఉండిపోయింది.
ఒకటి ఎత్తివేయాలని..
ఒకటే చోట మూడు మద్యం దుకాణాలు ఉండడంతో అక్కడి నుంచి ఒకటి ఎత్తేయిస్తే వ్యాపారం సవ్యంగా ఉంటుందనే ఆలోచన ఓ వర్గం వారిలో మెదిలింది. అంతే వెంటనే బడి, గుడి నిబంధనలను తెరపైకి తెచ్చి ఫిర్యాదు చేశారు. ఆమేరకు ముందుగా ఏర్పాటు చేసుకున్న స్థలం నుంచి మౌర్య వైన్స్ తరలించాల్సి వచ్చింది. గోసుల బార్ స్కూల్ ఏర్పాటు కంటే ముందుగా అక్కడ నిర్వహిస్తుండడంతో దానికి ఆ నిబంధన వర్తించలేదు. ఇక మౌర్య వైన్స్ కాస్త దూరంలో ఉన్న ఓ భవనంలో ఏర్పాటు చేసుకునేందుకు శ్రీకారం చట్టారు. ఈ వైన్‌షాపును అక్కడి నుంచి కూడా లేకుండా చేయాలని కడప ఎమ్మెల్యే వర్గీయులు వ్యూహం పన్నారు.
భవనానికి అనుమతులు లేవంటూ..
అధికార పార్టీ ఎమ్మెల్యే చిటికేస్తే కార్పొరేషన్ అధికారులు పరుగులు పెడుతున్నారు. గత కొన్ని ఘటనలు అందుకు దర్పంగా నిలుస్తున్నాయి. తాజాగా మౌర్య వైన్స్ ఏర్పాటు చేస్తున్న భవనానికి నిర్మాణ అనుమతులు లేవంటూ కార్పొరేషన్ యంత్రాంగం అడ్డు తగిలింది. భవన యజమానికి నోటిసులు పంపి, ఎందుకు కూల్చకూడదో తెల్పాలంటూ అక్కడికి వెళ్లారు.
అధికారులను నిర్భందించిన ‘పుత్తా’
విషయం తెలుసుకున్న టీడీపీ నేత.. కమలాపు రం ఎమ్మెల్యే పుత్తా చైతన్య తండ్రి పుత్తా నరసింహారెడ్డి వెంటనే సదరు అధికారులకు ఫోన్ చేసి పక్కనే ఉన్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాల్సిందిగా పిలిచారు. అక్కడికి వెళ్లిన అధికారులకు పట్టపగలు చుక్కలు చూపించారు. ‘ఆ భవనానికి నిర్మాణ అనుమతులున్నాయి. ఒకవేళ లేకపోయినా 40ఏళ్లు క్రితం నిర్మించారు, ఇంతకాలం ఏమి చేస్తున్నారు? ఇప్పుడెందుకు వచ్చారు? మిమ్మల్ని పంపించిన వారి ని ఇక్కడికి పిలచండి? అప్పటి వరకూ మీరు ఇక్కడే ఉండండం’టూ నిర్భంధించారు. ఏమి చేయాలో పాలుపోక ఆ వచ్చిన అధికారులు అక్కడే ఉండిపోయారు. ఉన్నతాధికారులు అటువైపు కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దాదాపు 2గంటలు పాటు కార్పొరేషన్ యంత్రాంగం స్థానికంగా ఉన్న పుత్తా కార్యాలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఈలోపు భవన యజమాని నిర్మాణ అనుమతులు తీసుకురావడంతో మరింత స్థాయిలో బూతులు తినాల్సివచ్చింది.
వ్యవహారం బెడిసికొట్టడడంతో....
కార్పొరేషన్ అధికారుల వ్యవహారం బెడిసి కొట్టడంతో కడప ఎమ్మెల్యే వర్గీయులు మరో వ్యూహం పన్నారు. ఈమారు ఆభవనంలో అద్దెకు నివాసం ఉన్నవారితో ఇక్కడ మద్యం షాపు ఏర్పాటు చేయవద్దంటూ ఫిర్యాదు చేయించారు. దీంతో కోపోద్రిక్తులైన కమలాపురం ఎమ్మెల్యే వర్గీయులు ఫిర్యాదుదారుడికి తగిన రీతిలో బుద్ధి చెప్పినట్లు సమాచారం. వెంటనే ఆ ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఈ ముసుగులో వ్యవహారం ఎందుకు ప్రత్యక్షంగా తెరపైకి రండి.. తేల్చుకుందా’మంటూ కమలాపురం ఎమ్మెల్యే వర్గీయులు సవాల్ విసరడం కొసమెరుపు.
బాబోయ్.. మందుబాబులు
మందుబాబులు చెలరేగుతున్నారు. పట్టపగలు నడిరోడ్లపైనే విచ్చలవిడిగా మద్యం తాగుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ .. డివైడర్ల పక్కన, కూల్‌డ్రింక్ షాపుల్లో బహిరంగంగా తాగుతున్నారు. వెరసి రహదారుల్లో ప్రయాణించే మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడపలో ముందే పది బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఆపై 23 మద్యంషాలు కొత్తగా వచ్చాయి. వ్యాపారం అనువుగా ఉన్న ప్రాంతాలల్లో యజమానులు మద్యంషాపులు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో అక్కడడక్కడ బార్లు ఉండడంతో మందుబాబుల వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఆటంకాలు లేవు. ప్రస్తుతం కడపలో డివైడర్లు చెంతన, రోడ్డు పక్కలో, కూల్‌డ్రింక్ షాపులల్లో తిష్టవేసి మందు తాగుతుండడంతో ప్రజానీకం ఇబ్బందిపడుతోంది.
పరస్పర ఒప్పందం కుదిరితేనే...
మద్యం షాపుల చెంతలో తాగేందుకు అనుమతులుంటే మందుబాబులు అక్కడే తాగేసి వెళ్తుండేవారు. ఎటూ విచ్చలవిడిగా మద్యం విక్రయాలకు ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పర్మిట్ రూమ్‌కు అనుమతి ఇవ్వడం శ్రేయస్కరమని పలువురు వివరిస్తున్నారు. అప్పటివరకూ బహిరంగ మద్యం తాగుడును కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రధానంగా జిల్లా కేంద్రమైన కడప, ప్రొద్దుటూరు లాంటి పట్టణాలల్లో ఈబెడద ఎక్కువగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment