అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమన్న ఆది
పార్లమెంటుకు పోటీ చేస్తానని చెప్పుకొచ్చిన వైనం
కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యుల్ని శాంతింపజేసే ఎత్తుగడ
అనుకున్నట్లుగా సక్సెస్ అయిన జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి
నేడు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల సమావేశం
సాక్షి ప్రతినిధి, కడప: మాటల గారడీతో నేతల్ని బురిడీ కొట్టించే ఎత్తుగడల్లో ఆయన దిట్ట. కలిసివస్తే తన ప్రతిభ.. లేదంటే ఎదుటోళ్ల తప్పుగా వర్ణించే నేర్పరితనం ఆయనది. అనుకున్నట్లుగా అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అన్న కుటుంబానికి నాడు–నేడు ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేశారని సోదరులంతా పసిగట్టారు. అవకాశవాదానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన చతురత ప్రదర్శించారు. ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఆది మైండ్ గేమ్‌తో అటు అబ్బాయ్.. ఇటు సోదరులను శాంతింపజేశారు. ఈ నాటకానికి కథ, స్క్రీన్ ప్లే మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కాగా, తారా గణం ఆయన కుటుంబ సభ్యులు కావడం విశేషం.
► జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయాలకు నాలుగున్నరేళ్లుగా మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దూరంగా ఉన్నారు. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటం చేసిన దాఖలాలే లేవు. తనకు అధికారం అండ లేకపోతే, రాజకీయ మనుగడ కష్టమని భావించి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతోనే బీజేపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఉనికి చాటుకునే చర్యలు మినహా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష పోరాటం చేసింది లేదు. తెలుగుదేశం పార్టీకి దిక్కు దిశా లేని సమయంలో మాజీ జెడ్పీటీసీ భూపేష్‌రెడ్డి రంగప్రవేశం చేశారు. టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టి ఆ మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించారు. అనుచరులను చేరదీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలని తలచిన నేపథ్యంలో తనను కాదని టికెట్ తెచ్చుకోగలరా? అంటూ ఆదినారాయణరెడ్డి సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అనుకున్నట్లుగా టీడీపీ టికెట్ భూపేష్‌కు దక్కకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి దక్కేలా తెరవెనుక పావులు కదిపి సక్సెస్ అయ్యా రని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు
తన సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌కు టీడీపీ టికెట్ దక్కకుండా బీజేపీకి దక్కేలా ఆదినారాయణరెడ్డి చేపట్టిన పైరవీలను పసిగట్టిన కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారని సమాచారం. అందుకు కారణం 2004లో వర్గ రాజకీయాలను కొనసాగిస్తూ వచ్చిన నారాయణరెడ్డికి సీటు లేకుండా అడ్డుతగిలిన వైనం, తాజాగా భూపేష్‌కు ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా వ్యవహరించిన తీరుతో దేవగుడి సోదరులంతా ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డికి వ్యతిరేకంగా పయనించేందుకు అందరూ సిద్ధమయ్యారు.
ఈ విషయాన్ని పసిగట్టిన ఆయన బీజేపీ అభ్యర్థిత్వం దక్కినా స్వగ్రామంలో అడుగు పెట్టకుండా ఉండిపోయారు. ఈలోపు భూపేష్‌కు టీడీపీ ఎంపీ టికెట్ దక్కింది. ఆ వెనువెంటనే జమ్మలమడుగు చేరుకున్న ఆది తాను ఎంపీకి, మావాడు భూపేష్ ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తాం. అదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం, పరిశీలనలో ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగానే అటు అబ్బాయ్.. ఇటు సోదరులు శాంతించినట్లు సమాచారం. ఆది మైండ్ గేమ్‌కు మొత్తం కుటుంబం ఫ్లాట్ అయినట్లు తెలుస్తోంది.
నేడు ఉమ్మడిగా సమావేశం..
బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి ఇరువురు శుక్రవారం జమ్మలమడుగులో ఉమ్మడిగా కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జనసేన కార్యకర్తలు సైతం హాజరుకానున్నారు. ఇప్పటి వరకూ బాబాయ్...అబ్బాయ్ ఎవరికి వారు రాజకీయాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇకపై ఉమ్మడిగా రానున్నారు. వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న జమ్మలమడుగులో అవకాశవాద రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఇందుకు దేవగుడి కుటుంబమే ప్రధాన కారణమైంది. ఇలాంటి రాజకీయాలకు ఓటర్లు చెక్ పెట్టాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment