సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం జెండా మోసిన నియోజకవర్గ ఇన్‌చార్జిలకు అధిష్టానం మొండిచేయి చూపనుందా? సర్వేల పేరుతో పక్కన పెడుతున్నారా? అనూహ్యంగా ఆయా మాజీ నేతలను తెరపైకి తెస్తున్నారా.. అంటే..రాజకీయ విశ్లేషకులు ఔనని సమాధానమిస్తున్నారు. ఆ మేరకే జిల్లాలో మూడు నియోజకవర్గాలల్లో ప్రధానంగా మార్పులు చేర్పులు చేయాలనే దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా మైదుకూరు నియోజకవర్గం ఒక్కటి. ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డిని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం.
2014, 19 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్ మైదుకూరు నుంచి తలపడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. వరుసగా ఓటమి మూటగట్టుకున్న సుధాకర్‌యాదవ్ మరోమారు 2024లో పోటీలో తలపడి అదృష్టం పరీక్షించుకోవాలని తలచారు. కాగా టీడీపీ అధిష్టానం చేయించుకున్న సర్వేలు పుట్టాకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. మైదుకూరులో టీడీపీ పట్ల అంతంత మాత్రమే ఆదరణ లభించగా, వ్యక్తిగత సర్వేల్లో పుట్టా సుధాకర్ బాగా వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో పుట్టా స్థానంలో మాజీ ఎమ్మెల్యే డీఎల్‌ను తీసుకొస్తే పోటీ ఇవ్వగలమనే అంచనాకు టీడీపీ అధినేత వచ్చినట్లు తెలుస్తోంది. ఆమేరకు సమాలోచనలో పడినట్లు సమాచారం.
డీఎల్‌తో చర్చించేందుకు సన్నాహాలు....
టీడీపీ నిర్వహించిన సర్వేల ఆధారంగా మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డితో చర్చించేందుకు ఆ పార్టీ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతలను హైదరాబాద్ పార్టీ కార్యాలయం కేంద్రంగా ఇద్దరు నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ముందుగా ఆ ఇద్దరు నేతలు మైదుకూరుపై కూలంకషంగా చర్చించిన తర్వాత అధినేత చంద్రబాబుతో మంతనాలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ మేరకు తొలిదశ చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. సంపూర్ణంగా మరోమారు వారంలోపు చర్చించిన పిదప అధినేతతో అన్ని విషయాలు తెలియజేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే డీఎల్‌తో ముఖాముఖీ నిర్వహించినున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పుట్టా సుధాకర్‌యాదవ్ కినుక...
అధిష్టానం నుంచి సర్వే సంకేతాలు అందుకున్న పుట్టా సుధాకర్‌యాదవ్ డైలామాలో పడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్ లాంటి ప్రధాన నాయకుల పర్యటనలో మినహా తర్వాత రోజులల్లో మైదుకూరులో కన్పించడం లేదు. పక్షం రోజులకు ఓమారు అలా వచ్చి వెళ్తున్నారు. నారాలోకేష్ యువగళం పర్యటన, చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమాలల్లో మాత్రమే నియోజకవర్గంలో పుట్టా కన్పించడం విశేషం. మైదుకూరు టీడీపీ టికెట్‌పై స్పష్టత లేకపోవడం, అధిష్టానం ప్రత్యామ్నాయ చూపులను పసిగట్టిన పుట్టా సన్నిహితుల వద్ద టీడీపీపై మండిపడుతోన్నట్లు తెలుస్తోంది.
ప్రొద్దుటూరు, కమలాపురంలలో సైతం....
టీడీపీ అధిష్టానం ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే, విజయం కోసం కృషి చేయాలని, తర్వాత మీ భవిష్యత్ నాదేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాతే మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరులో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కమలాపురంలో టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డిది సైతం అదే పరిస్థితి. టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలనే దిశగా సూచనలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమారు కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరికలు పంపినట్లు సమాచారం. రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ మాజీ నేత పట్ల టీడీపీ అధినేత ఆకర్షితులవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment