ఎవరికీ వారే ఏకరువు...భరోసా ఇచ్చే నేత ఏడీ!? | - | Sakshi
Sakshi News home page

ఎవరికీ వారే ఏకరువు...భరోసా ఇచ్చే నేత ఏడీ!?

Published Sat, Oct 14 2023 1:08 AM | Last Updated on Sat, Oct 14 2023 11:00 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: పూర్వపు వైభవాన్ని గణనీయంగా కోల్పోయిన టీడీపీ ఉమ్మడి కడప జిల్లాలో బతికి బట్ట కట్టే పరిస్థితి కన్పించలేదు. తిరిగి పునఃప్రతిష్ట పొందాలనే వ్యూహంతో ఉన్నా, అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్టు పరిణామం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీని ఏకతాటిపై నడిపించే నాయకత్వం లేకపోవడం స్పష్టంగా కన్పిస్తోంది. ఉనికి చాటుకునే చర్యలు మినహా ప్రత్యక్ష పోరాటం చేసే పరిస్థితి కన్పించడంలేదు. అపార ప్రజా మద్దతున్న వైఎస్సార్‌సీపీని ధీటుగా ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ డీలా పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. అన్ని నియోజక వర్గాల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొంత జిల్లాపై సీఎం సైతం ప్రత్యేక దృష్టి సారిస్తుండడం, అపార పారిశ్రామికవృద్ధి కోసం విశేష చొరవ చూపడంతో ప్రజా మద్దతు బలంగా ఉంది. ముందే అత్తెసరు పోరాటంతో వ్యవహరించే టీడీపీకి అధినేత చంద్రబాబు అరెస్టుతో స్థబ్దత ఆవహించింది. కలిసికట్టుగా పార్టీని నడిపిస్తారని భావిస్తే ఎవరికీ వారే పెద్దగా వ్యవహరిస్తూ ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించేందుకే నిమగ్నమైనట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

స్పష్టంగా కన్పిస్తోన్న నాయకత్వపు లోటు...
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో పార్టీని నడిపించే నాయకత్వం కరవైంది. నేతలదరి సమన్వయంతో ఒక్కతాటిపై నడిపించే సామర్ధ్యం కలిగిన బలమైన నాయకుడు ఆ పార్టీకి కరవయ్యారనే చెప్పాలి. గతంలో దివంగత నేతలు బిజివేముల వీరారెడ్డి, గుండ్లకుంట శివారెడ్డి లాంటి వారు జిల్లాలో ఏ సమస్య ఎదురైనా ముందుండి పోరాడేవారు.

పార్టీలో నేతల మధ్య విభేదాలు ఏర్పడినా.. అధిష్టానం వరకూ వెళ్లకుండానే వీలైనంత వరకు ఇక్కడే పరిష్కరించేవారు. ఇప్పుడు టీడీపీలో ఆ పరిస్థితి లేదు. నాయకులు ఎవరికి వారుగా ఉంటున్నారు. జిల్లాలో స్థాయి కల్గిన నాయకుడు లేకపోవడమే అతిపెద్ద లోటుగా రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వెరశి మెజార్టీ నియోజకవర్గాలు అంతర్గత కుమ్ములాటలకు వేదికగా నిలుస్తున్నాయి.

ఉనికి కోసం ఆరాటం....
ఉమ్మడి జిల్లాలో రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు ఎవరికీ వారే ఉనికి కోసం పోటీ పడుతున్నారు. ప్రొద్దుటూరులో ఇన్‌ఛార్జి ప్రవీణ్‌తోపాటు ఇరువురు మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, లింగారెడ్డిలతోపాటు పోట్లదుర్తి సురేష్‌నాయుడు నాయకత్వం కోసం ఆరాటపడుతున్నారు. మైదుకూరులో పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకొని ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ వేరు కుంపట్లు పెట్టుకున్నారు.

కడపలో సీనియర్‌ నేతలు ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, అమీర్‌బాబు, దుర్గాప్రసాద్‌లు పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి ఆధిపత్యాన్ని సహించలేకున్నారు. వెరశి వేరు వేరుగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసీ ప్రసాద్‌బాబు ఎవరికీ వారుగా ఉంటున్నారు. రైల్వే కోడూరులో ఇన్‌ఛార్జి విశ్వనాథనాయుడు, నరసింహాప్రసాద్‌లదీ ఆదే పరిస్థితి. రాజంపేటలో బత్యాల చెంగల్‌రాయుడు, నరసింహారాజు, మేడా విజయ్‌శేఖర్‌రెడ్డిలు ఉనికి కోసం ఆరాటపడుతున్నారు.

ఇది చాలదన్నట్లు గంటా నరహరి సైతం తెరపైకి వస్తున్నారు. ఆయా నియోజక వర్గాల్లో ఒకరు చేపట్టే కార్యక్రమాలను మరొకరు సమర్థించకపోగా, వ్యతిరేకిస్తూ అభాసుపాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య అపార ప్రజామద్దతున్న వైఎస్సార్‌సీపీకి ఎదుర్కొవడం అసాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement