సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు ముసుగుకు తెలుగుతమ్ముళ్ల స్వప్రయోజనాలు ముడిపడ్డాయి. ఒకే నియోజకవర్గంలో వేర్వేరుగా మూడు చోట్ల నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న మమకారంతో చేస్తున్నారా అంటే తప్పులో కాలేసినట్టే. వారి లక్ష్యం ఒక్కటే. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిత్వం సాధించడం. రేసులో వెనుకంజ వేయరాదనే సంకల్పంతో ఎవరికి వారు దీక్షలు ఆరంభించారు. ఒక నేత ఏకంగా తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. నవ్విపోదురుగాక..నాకేటి సిగ్గు అన్నట్లుగా ఎవరికి వారు ఛీప్ పాలి‘ట్రిక్స్’తెరపైకి తెస్తున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత అరెస్టును నిరసిస్తూ ప్రొద్దుటూరులో తెలుగుతమ్ముళ్లు మూడు చోట్ల నిరసన దీక్షలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నేతృత్వంలో శివాలయం సెంటర్‌లో దీక్షా శిబిరం ఉండగా, ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తన కార్యాలయం సమీపంలో దీక్షా శిబిరం, అలాగే రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్‌నాయుడు పాతబస్టాండ్ సమీపంలో మరో దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఎవరికీ వారు మమ అనిపిస్తూ దీక్షలు చేయడం వెనుక ఆయా నేతలకు టీడీపీ ప్రొద్దుటూరు టికెట్ దక్కించుకోడమే లక్ష్యంగా కన్పిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అధినేత చంద్రబాబు మీద ప్రేమ కంటే టికెట్ పోటీలో తాము వెనుకపడి పోరాదనే భావనే మెండుగా కన్పిస్తోంది. ఈక్రమంలోనే 78 ఏళ్ల వయస్సులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి దగ్గరుండీ దీక్షలు చేయించడం విశేషంగా పలువురు వెల్లడిస్తున్నారు.
ఆ మాజీలు ఎవరికీవారే...
ప్రొద్దుటూరులో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్సీ టీడీపీలో కొనసాగుతున్నారు. ఈస్థాయి నేతలున్నా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందా అంటే అదీ లేదు. కాలం కలిసిరాదా? మరో చాన్స్ దక్కకపోదా? అన్న రీతిలో ఎవరికి వారు టీడీపీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. ‘కొత్త బిక్షగాడు పొద్దు ఎరుగడు’అన్నట్లు కొత్తగా మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. వీరిలో ఒకరు చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ఏకంగా తిరుమలకు పాదయాత్ర చేశారు. ఇలా ఎవరికివారు వేర్వరు కుంపట్లు పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజానీకానికి నవ్వులు తెప్పిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేష్ నాయుడు ముగ్గురు మూడు చోట్ల దీక్షలను కొనసాగిస్తుంటే, పార్లమెంటు అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ కలరింగ్ ఇస్తున్నారు. పాలిట్రిక్స్ ప్రదర్శించడంలో ప్రొద్దుటూరు టీడీపీ నేతల తర్వాతే మరెవ్వరైనా అన్నట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment