సొంతగూటికి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు ఆదివారం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సమక్షంలో తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లయింది. వాస్తవానికి మున్సిపాలిటీలో 41 కౌన్సిలర్ల స్థానాలకు గడిచిన ఎన్నికల్లో 40 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని విభేదించి గత ఎన్నికల కంటే ముందే కొందరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీపై టీడీపీ దొడ్డిదారిన పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ రకాలుగా ప్రయత్నించి పది మందికిపైగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో ఎన్డీఏ కూటమి కౌన్సిలర్ల సంఖ్య దాదాపుగా 20కి చేరింది. ఇదిలా ఉంటే అక్కడ తమకు సముచిత స్థానం కల్పించడం లేదని, తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సొంత ఇంటికి వచ్చినట్లు సంతోషంగా ఉందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పార్టీ కండువా కప్పి వీరిని ఆహ్వానించారు. 8వ వార్డు కౌన్సిలర్ రాగుల శాంతి, 39వ వార్డు కౌన్సిలర్ చింపిరి అనిల్‌కుమార్, 40వ వార్డు కౌన్సిలర్ రావులకొల్లు అరుణ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన కౌన్సిలర్లు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు రాచమల్లు తెలిపారు. మరికొందరి కౌన్సిలర్లును పార్టీలోకి రావాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్ చైర్మన్లు ఆయిల్‌మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి, కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, బలిమిడి వెంకటలక్ష్మి, జయంతి, నూకా నాగేంద్రారెడ్డి, వంశీధర్‌రెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, లావణ్య, వైఎస్సార్‌సీపీ నియోజవర్గ యూత్ ఇన్‌చార్జి ద్వార్శల గురునాథ్‌రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మార్తల ఓబుళరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment