సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
కడప కల్చరల్ : సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మిల్లెట్ల బుల్లెట్‌గా పేరుగాంచిన ప్రముఖ ఆహార ఆరోగ్య శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఖాదర్‌వలీ తెలిపారు. ఆదివారం కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఇంటాక్, ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్యల సంయుక్తాధ్వర్యంలో ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ ఖాదర్‌వలీ మాట్లాడారు. ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం వల్ల ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆహార విషయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. దేశంలోనే మన రాయలసీమ ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, ఇందుకు కారణం...ఆది నుంచి ఇక్కడ రాగి, సజ్జ, జొన్న, కొర్రలు లాంటి ఆహారమేనని తెలిపారు. ముందుతరంలో సీమలో 170 రకాల తృణ ధాన్యాలు పండేవని, ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారని, ఇప్పుడు పది శాతానికి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయమన్నారు. సిరిధాన్యాలు వాడితే రక్తం పలచబడుతుందని, గుండె సంబంధిత వ్యాదులు రావని తెలిపారు. పురాణాల్లో కూడా చిరుధాన్యాల ప్రాధాన్యత పేర్కొన్నారని వివరించారు. కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు లయన్ కె.చిన్నపరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి, క్యాంపు చైర్మన్, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీర సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య అధ్యక్షులు ఎ.వెంకటసుబ్బయ్య, కోటిరెడ్డి మహిళా కళాశాల ప్రొఫెసర్ ఎం.గురుమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య భారతావనిగా తీర్చిదిద్దాలి
పులివెందుల టౌన్ : సిరి ధాన్యాలను ప్రోత్సహించి ఆరోగ్య భారతావనిగా తీర్చిదిద్దాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత స్వతంత్ర ఆహార ఆరోగ్య శాస్త్రవేత్త, ది మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, కృషిరత్న డాక్టర్ ఖాదర్‌వలి తెలిపారు. స్థానిక రాణితోపు పార్కు ఈట్ స్ట్రీట్‌లోని సిరి సంజీవని ది మిల్లెట్ కేఫ్ అధినేత వరద ప్రకాష్‌రెడ్డి, ప్రమీల ఆధ్వర్యంలో ఆరోగ్య సిరి అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఖాదర్‌వలి మాట్లాడారు. సిరి ధాన్యాలు వాడటం వల్ల బీపీ, షుగర్, నరాల బలహీనత, తదితర రుగ్మతలు నయమవుతాయన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన వారికి సిరి ధాన్యాలు ఎలా వాడాలో, వాటి ఉపయోగం, ఏ సమయంలో ఎలా తీసుకోవాలి తదితర వాటి గురించి క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ హాలు గంగాధరరెడ్డి, కౌన్సిలర్ కోడి రమణ, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment