మాజీ ఎమ్మెల్యే వరదపై మండిపడుతున్న మల్లెల లింగారెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్న సామెత చందంగా తయారైంది జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎన్నికలు రానేలేదు, అప్పుడే అధికారంలోకి వచ్చినట్లుగా తెలుగు తమ్ముళ్లు భ్రమిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో పైచేయి మాదంటే మాదే అన్పించుకునే చర్యలకు తెగబడ్డారు. మంగళవారం కడపలో జరిగిన జోన్–5 ప్రాంతీయ సదస్సు అందుకు వేదికగా నిలిచింది. ప్రజానీకం విస్తుపోయేలా గండికోట ప్రాజెక్టు తానే కట్టానని అధినేత చంద్రబాబు అబద్ధాలు వల్లిస్తే, మరోవైపు ఆధిపత్యం కోసం తెలుగు తమ్ముళ్లు తగవులాడుకోవడం గమనార్హం.
జోన్–5 ప్రాంతీయ సదస్సు నిర్వహణ ఏర్పాట్లు, పార్టీ వ్యవహారాల్లో పైచేయి సాధించాలనే ఆతృత జిల్లా నేతల్లో ఉండింది. అందుకు అనుగుణంగా తొలుత సమావేశాన్ని ఎయిర్‌పోర్టు సమీపంలో నిర్వహించాలని భావించారు. అయితే అక్కడొద్దు మా స్థలంలోనే ఏర్పాటు చేయాలని కమలాపురం ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి పట్టుబట్టారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేదికను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి రెండు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో లింగారెడ్డిపై పుత్తా నరసింహారెడ్డి నోరు పారేసుకున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఓ వైపు అధికారులు, మరోవైపు జిల్లా అధ్యక్షుడి సూచనలను పట్టించుకోకుండా తాను చెప్పిందే జరగాలనే దిశగా పట్టుబట్టి పుత్తా పైచేయి సాధించారు. మంగళవారం జరిగిన ప్రాంతీయ సదస్సు సందర్భంగా లింగారెడ్డి ప్రవర్తించిన తీరు సైతం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. (కాకినాడ సెజ్‌కు ప్రత్యేక రైల్వేలైన్.. దక్షిణ మధ్య రైల్వే గ్రీన్‌సిగ్నల్ )
మాజీ ఎమ్మెల్యే వరదపై మండిపాటు...
జోన్–5 ప్రాంతీయ సదస్సుకు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య ఇరువురు చేరుకున్నారు. స్టేజీ మీదున్న ఆ ఇరువురి చెంతకు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి వెళ్లారు. ఎన్నికల్లో పార్టీ లేదు, బొ...లేదన్నావు. పిలుపు లేకపోయినా సి..శ...లేకుండా ఎలా వచ్చావంటూ నిలదీశారు. మరింత పరుష పదజాలం ప్రయోగించి, అసలు స్టేజీ మీదకు రానిచ్చినవారెవ్వరంటూ నానా హంగామా చేశారని పరిశీలకులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజులరెడ్డి పార్టీ టికెట్ పోటీదారుడు అవుతారనే భయంతోనే ఆ స్థాయిలో మండిపడినట్లు తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు.
హవ్వా.. నవ్విపోదురుగాక..
‘నావల్లే రాయలసీమకు నీరు వస్తోంది. గండికోట ప్రాజెక్టు నేనే కట్టాను. నా హయాంలోనే హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు అధిక నిధులు వెచ్చించాను.’ ఈ మాటలన్నది ఎవ్వరో కాదు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. పచ్చి అబద్ధాన్ని సైతం నిజమని నమ్మించడంలో చంద్రబాబు దిట్ట అనే విషయాన్ని మరోసారి ఆయన నిరూపించుకున్నారు. వాస్తవాలను పరిశీలిస్తే గండికోట ప్రాజెక్టును 1999–2004లో చంద్రబాబు హయాంలో అప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలోకి చేర్చారు. రాష్ట్ర బడ్జెట్‌లో అతి స్వల్ప నిధులు కేటాయించారు. అలాంటి పరిస్థితిలో చంద్రబాబు హయాంలో గండికోట ప్రాజెక్టు మరుగున పడింది.
2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాలను పరుగులెత్తించారు. అందులో భాగంగా గండికోట ప్రాజెక్టును డాక్టర్ వైఎస్‌ఆర్ పూర్తి చేశారు. ఇది జగమెరిగిన సత్యం. కాగా తానే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికల సమయంలో హడావుడిగా మైలవరం సమీపంలో స్టీల్ ప్లాంట్‌కు పునాది వేశారు. వాస్తవాలు ఇలా ఉంటే తాను మాత్రమే, తాను కొనసాగి ఉంటే అన్న మాటలు బాబు మినహా మరెవ్వరూ చెప్పుకోలేరని పలువురు పెదవి విరుస్తున్నారు. (ప్రకాశానికి ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావో ప్రజలకు చెప్పు చంద్రన్న..!)
Comments
Please login to add a commentAdd a comment