సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ అధికారిక పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అధినేత చంద్రబాబు యూజ్ అండ్ త్రో పాలసీ అమలు చేయడంలో దిట్టగా పేరు గడించారు. అవసరాలకు అనుగుణంగా నాయకులను వాడుకోవడంలో ఆయనకు మరెవ్వరు సాటిరారని విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటి పరిస్థితి తాజాగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డికి ఎదురైంది. రెడ్డెప్పగారి కుటుంబం రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన ఆయనకు అటు ఇంటి నుంచి ఇటు పార్టీ నుంచి సీటు పోటు తప్పలేదు. 25 ఏళ్లుగా పార్టీ విధేయునిగా ఉన్నా, అసెంబ్లీ సీటు దక్కకపోవడానికి సోదరుడి సారథ్యమే ప్రధాన కారణమని సమాచారం.
దివంగత మాజీ మంత్రి రెడ్డెప్పగారి రాజగోపాల్‌రెడ్డి రాజకీయ వారసుడిగా రమేష్‌కుమార్‌రెడ్డి అరంగ్రేటం చేశారు. 1999లో లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లె రద్దు అయింది. రాయచోటి నియోజవకర్గంలో లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు మూడు మండలాలు కలిసిపోయాయి. 2009 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి సాయిప్రతాప్ చేతిలో ఓడిపోయారు. 2014, 19లలో రాయచోటి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
రమేష్‌రెడ్డి 1999 నుంచి ఇప్పటివరకు టీడీపీ నాయకుడుగా చెలామణీ అవుతున్నారు. కాంట్రాక్టర్‌గా స్థిరపడిన సోదరుడు శ్రీనివాసులరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో తొలిసారి అరంగ్రేటం చేసిన వెంటనే కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. క్రమంగా టీడీపీ సారధ్య బాధ్యతలకు దగ్గరయ్యారు. అధినేత చంద్రబాబు మనుసెరిగి మసులుకోవడంలో దిట్టగా మారడంతో టీడీపీలో పొలిట్‌బ్యూరో సభ్యుడుగా ఎదిగారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీనికి తోడు శ్రీనివాసులరెడ్డి ధనవంతుడు కావడంతో అధినేత చంద్రబాబు మరింత ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.
కుటుంబానికి ఒక్కటే సీటు నిబంధన....
తెలుగుదేశం పార్టీలో ఇటీవల అనధికారికంగా కుటుంబానికి ఒక్కటే సీటు అనే నిబంధన పెట్టుకున్నారు. ఈక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న శ్రీనివాసులరెడ్డి ఆ ఒక్క సీటు మా సోదరుడు రమేష్‌కుమార్‌రెడ్డికి ఇవ్వాలని అభ్యర్థించి ఉంటే తప్పకుండా వచ్చేదని పలువురు వివరిస్తున్నారు. అలా కాకుండా తన సతీమణీ మాధవీరెడ్డికి కడపలో అవకాశం కల్పించాలని శ్రీనివాసులరెడ్డి కోరడంతోనే రమేష్‌రెడ్డి సీటు ప్రశ్నార్థమైనట్లు సమాచారం. 1999 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ బాధ్యతగా, విధేయుతతో పనిచేస్తున్న తనను కాదని, నిబంధనలు ముడిపెట్టి తనకు ఎగనామం పెడతారా? అన్న ఆక్రోశం రమేష్‌రెడ్డి వెళ్లగక్కుతున్నారు. ఆరు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇటు ఇంటిలోని వారు, అటు పార్టీకి చెందిన వారు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమేరకు అనుచరగణం తీవ్రస్థాయిలో రగిలిపోతున్నట్లు సమాచారం.
అవకాశవాద రాజకీయాలతోనే..
నిబద్ధతతో రాజకీయాలు చేసేవారు కొందరైతే, అందివచ్చిన అవకాశాలతో ఎదిగే నేతలు మరికొందరు. చేయి అందించిన వారినే తొక్కుకుంటూ ఎదిగే నేతలు మరికొందరు. చంద్రబాబు తెరపైకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి అవకాశవాదులు అధికమయ్యారు. తన..మన భేదం లేకుండా రాజకీయ ఉన్నతి కోసం సొంత మనుషులను, రక్త సంబంధీకులను తొక్కేయడంలో వీరు దిట్టలు. ఇలాంటి పరిస్థితితోనే రాయచోటి సీటు చేజార్చుకోవాల్సి వచ్చిందని రమేష్‌రెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తుదకు తనకు కాకపోయినా రాయచోటి సెగ్మెంట్‌లో మాధవీరెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేసినా ఇంతటి క్షోభ ఉండేది కాదని, సొంత నియోజకవర్గం రెడ్డెప్పగారి కుటుంబం నుంచి చేజార్చుకునే పరిస్థితి లేకుండా ఉండేదని పలువురితో వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాజకీయ భవిష్యత్ కోసం సన్నిహితులతో ప్రత్యేకంగా చర్చిస్తూ, రాయచోటి నుంచి పోటీ చేయాలనే దిశగా అడుగులు వేస్తూ, తదనుగుణంగా సమీకరణలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment