రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. ఇండిపెండెంట్‌గా బత్యాల? | - | Sakshi
Sakshi News home page

రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. ఇండిపెండెంట్‌గా బత్యాల?

Published Sun, Mar 31 2024 1:40 AM | Last Updated on Sun, Mar 31 2024 1:15 PM

- - Sakshi

టీడీపీ టికెట్‌ సుగవాసికి ఇవ్వడంపై బత్యాల వర్గీయుల ఆగ్రహం

బత్యాలను ఇండిపెండెంట్‌గా పోటీ చేయించే యోచన

రేపు బలప్రదర్శనకు సిద్ధమవుతున్న వైనం

రాజంపేట: రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఐదేళ్లుగా కాపాడుకుంటూ, పార్టీ క్యాడర్‌కు వెన్నుదన్నుగా నిలిచిన టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్రాయుడుకు అధినేత చంద్రబాబునాయుడు టికెట్‌ విషయంలో మొండిచెయ్యి చూపారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బత్యాల వర్గీయులు, పార్టీ సీనియర్లు, కార్యకర్తలు, బలిజ సామాజికవర్గ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇప్పుడు తిరుగుబాటు చేయకపోతే రాజంపేట టీడీపీకి అభ్యర్థుల దిగుమతి సంస్కృతి కొనసాగుతూనే ఉంటుందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్‌ నిర్ణయంపై బత్యాల ఆధారపడి ఉన్నారు.

ఇండిపెండెంట్‌గా బత్యాల?
రాయచోటికి చెందిన మాజీ జెడ్పీటీసీ సుగవాసి బాలసుబ్రమణ్యంను రాజంపేటలో పోటీ చేయించాలనే చంద్రబాబు నిర్ణయంపై బత్యాల వర్గీయులు నిరసన స్వరం వినిపిస్తున్నారు. బత్యాలకు టికెట్‌ ఇచ్చే వరకు అధిష్టానాన్ని వదిలేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. అధిష్టానానికి తమ తడాఖా ఏమిటో చూపిస్తామంటూ టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా అయినా బత్యాల పోటీ చేయాల్సిందేనని శనివారం జరిగిన పార్టీ మీటింగ్‌లో ఇండిపెండెంట్‌ అంశాన్ని తమ్ముళ్లు లేవనెత్తారు. ఈ అవకాశం పోతే ఇక బత్యాలకు అవకాశమే రాదని బలంగా విశ్వసిస్తున్నారు. టీడీపీ టికెట్‌ను చంద్రబాబు రాయచోటి నేతలకు అమ్ముకున్నారని ఆ పార్టీ నేతలే బాహాటంగా విమర్శిస్తున్నారు.

బలప్రదర్శనకు సిద్ధమవుతున్న తమ్ముళ్లు..
రాయచోటి నేత సుగవాసి వద్దు.. బత్యాల ముద్దు అనే నినాదాన్ని పార్టీ క్యాడర్‌లో బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ వర్గీయులు సమాయత్తమవుతున్నారు. ఏప్రిల్‌ 1న ఉదయం 9గంటలకు నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో బత్యాలకు మద్దతుగా టీడీపీ క్యాడర్‌ ర్యాలీ చేపట్టనుంది. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకొని బత్యాల బల ప్రదర్శనకు సన్నాహాలు జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement