సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిబంధనలు, సూత్రాల పేరిట పూటకో మాట చెప్పి.. చివరికి అయినవారి కోసం దానిని తప్పుతోంది. మూడో జాబితా విడుదల తర్వాత టీడీపీ శ్రేణుల్లో ఈ విషయమై తీవ్ర అసంతృప్తి నెలకొంది.
వాసు.. శల్యసారథ్యం
బాధ్యతలను నిర్వర్తించాల్సిన వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా చెడగొట్టడాన్ని శల్య సారథ్యం అంటారు. అచ్చం అలాంటి పరిస్థితి వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డికి ఎదురైందని తెలుగుతమ్ముళ్లు విశ్వసిస్తున్నారు. మరోమారు ఎన్నికల్లో తలపడి ఎమ్మెల్యే అనే జీవితాశయం నెరవేర్చుకోవాలనే పట్టుదలతో కమలాపురం టీడీపీ ఇన్‌చార్జి పుత్తా ఉండేవారు.
అంతలోనే ‘ఇంట్లో వాడే కంట్లో పుల్ల’ అన్నట్లుగా జిల్లాలో టీడీపీ బాధ్యతలు నిర్వహిస్తున్న వాసు(రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి) కారణంగానే పుత్తాకు టికెట్ దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. అధిష్టానానికి తనపై పితూరీలు వల్లించిన కారణంగానే ఈమారు టికెట్ తాను కోల్పోయినట్లు సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. వరుసగా మూడుసార్లు ఓడిపోయినోళ్లకు ఈమారు ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. యువగళం పాదయాత్ర, రా కదలిరా... కార్యక్రమాలు ఇన్‌చార్జిగా పుత్తా నరసింహారెడ్డి నాయకత్వంలో కమలాపురం నియోజకవర్గంలో చేపట్టారు.
అధిష్టానం స్వయంగా చేపట్టిన పార్టీ కార్యక్రమాలు బాగా నిర్వహించడంతో టికెట్ దక్కుతుందని పుత్తా నమ్మకంగా ఉండేవారు. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా పుత్తాను పక్కనబెట్టి ఆయన కుమారుడు చైతన్యరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అదేమంటే వరుసగా మూడు పర్యాయాలు ఓడిపోయినోళ్లకు టికెట్ ఇవ్వలేదని టీడీపీ శ్రేణుల్లో ప్రచారం ఆరంభించారు. అయితే ఇది నిజం కాదని శుక్రవారం రుజువైంది. టీడీపీ మూ డో జాబితాలో నెల్లూ రు జిల్లా సర్వే పల్లె నియోజకవర్గ అభ్యర్థిగా సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రకటించడంతో ఆ విషయం తేటతెల్లమైంది.
ప్రవీణ్‌ను ఊరించి, ఆశలు రేకిత్తించి...
ప్రొద్దుటూరు టికెట్ నీదే, ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు చేయాలంటూ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని యువగళం పాదయాత్ర నుంచి అటు అధిష్టానం, ఇటు జిల్లా కీలకనేత ఊరించి, ఆశలు రేకెత్తించారు. అయితే చివరికి అభ్యర్థుల ప్రకటన నాటికి ఆ జాబితాలో చోటు దక్కలేదు. ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి అవకాశం లభించింది. ఐదేళ్లుగా కష్టపడి పార్టీ కోసం శ్రమించి, కేసులు ఎదుర్కొన్న తనను అటు అధిష్టానం, ఇటు జిల్లా నాయకత్వం మోసగించిందనే ఆవేదన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నుంచి వ్యక్తమౌతోంది. అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రవీణ్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. ఈక్రమంలో శుక్రవారం వరద దూతగా ఆయన సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి వెళ్లి ఇన్‌చార్జి ప్రవీణ్‌ను కలిసినా సానుకూలంగా స్పందించలేదని తెలిసింది.
కుటుంబానికి ఒక్కటే టికెట్ ఉత్తిమాటే
కుటుంబానికి ఒక్కటే టికెట్ అని.. టీడీపీ అధిష్టానం చెప్పుకొచ్చింది. ఇప్పుడామాట ఉత్తిదేనని రుజువైంది. మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్‌ను ప్రకటించారు. ఆయన కూమారుడు మహేష్‌యాదవ్‌ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి ఎత్తి చూపుతున్నారు. రాయ చో టి ఇన్‌చార్జిగా పార్టీ ఉన్నతికి ఐదేళ్లు పనిచేసిన తనకు టికెట్ నిరాకరించడాన్ని తప్పు పడుతున్నా రు. ఆయన సోదరుడు శ్రీనివాసులరెడ్డి భార్య మాధవీరెడ్డికి కడప టికెట్ ఇచ్చారనే కారణంతో రమేష్‌రెడ్డికి నిరాకరించారు. ఇదే నిబంధన పుట్టా కుటుంబానికి వర్తించాలి కదా అని ఆయన నిలదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment