బి.కొత్తకోట: తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా కొత్తగా పార్టీలో చేరిన జయచంద్రారెడ్డిని ప్రకటించారు. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌కు టికెట్ ఇవ్వలేదు.ఇందుకు నిరసనగా శనివారం సాయంత్రం ఆ పార్టీ నియోజకవర్గ నేతలు రాజీనామాలు ప్రకటించి సంతకాలు చేసారు. బి.కొత్తకోటలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఆరు మండలాలకు చెందిన కన్వీనర్లు, జిల్లా, రాష్ట్ర పదవులు కలిగిన నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నాయకులు నిన్నటి వరకు టికెట్ శంకర్‌కే ఇస్తున్నామని నమ్మించి మోసం చేశారని అన్నారు. పార్టీకోసం శ్రమించిన శంకర్‌కు జరిగిన అవమానాన్ని సరిదిద్ది టికెట్ అయనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును కలిసి పరిస్థితులను వివరిస్తామని నాయకులు పేర్కొన్నారు.
తర్వాత పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి శంకర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. అక్కడినుంచి ప్రదర్శనగా పీటీఎం రోడ్డుపైకి చేరుకుని బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. శంకర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. శంకర్‌కు మద్దతుగా పార్టీకి, పదవులకు రాజీనామాలు చేశారు. వారిలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనాథరెడ్డి, పోల్‌మేనేజ్‌మెంట్ కన్వీనర్ కుడుం శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ ఈశ్వరప్ప, ఎస్సీసెల్ రాష్ట్రకార్యదర్శి తమక శ్రీనివాసులు, రాజంపేట పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు శ్రీనాఽథ్‌రెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జ్ హరిప్రసాద్, మండలాల కన్వీనర్లు అనంద్‌రెడ్డి, వైజి.సురేంద్ర, నారాయణస్వామిరెడ్డి, జిట్టా వెంకటరమణ, రెడ్డెప్పరెడ్డి, పట్టణ అధ్యక్షుడు బంగారు వెంకటరమణ, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, వివిధ విభాగాల్లో పదవులు కలిగిన నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. బి.కొత్తకోటలోని పార్టీ కార్యాలయం చేరుకున్న నాయకులు, కార్యకర్తలు కొందరు ఫ్లెక్సీలు తొలగిస్తూ కేకలు వేయడం, కార్యాలయంలోకి వెళ్లి పార్టీ జెండాలను విసిరేశారు.దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
పెద్దమండ్యం: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, తంబళ్లపల్లె టీడీపీ టికెట్ దక్కించుకున్న జయచంద్రారెడ్డిల దిష్టిబొమ్మలను పెద్దమండ్యం బస్టాండులో శనివారం మాజీ ఎమ్యెల్యే జి. శంకర్ వర్గీయులు దహనం చేశారు. టీడీపీ నాయకులు వి. రఫీ అనుచరులతో వచ్చి చంద్రబాబు, జయచంద్రారెడ్డిల దిష్టిబొమ్మలపై వారి చిత్రపటాలను ఉంది దహనం చేశారు. అలాగే బస్టాండు కూడలికి సమీపంలో ఉన్న మాజీ టిడిపి మండల అధ్యక్షుడు శిద్దవరం ప్రసాద్ కారు అద్దాన్ని పగలగొట్టారు. ఈ కారులో జయచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు తిరుగుతున్నారనే కారణంతో కారు అద్దాన్ని పగల గొట్టినట్లు తెలుస్తోంది. కాగా కారు అద్దం పగల గొట్టడంపై టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు స్థానిక పొలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలియడంతో జయచంద్రారెడ్డి అనుచరులు వారించారు. కారు అద్దం వేయిస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment