సాక్షి ప్రతినిధి, కడప: జమ్మలమడుగు నియోజకవర్గంలోని చదిపిరాళ్ల కుటుంబంలో మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఏకాకి అయ్యారు. సోదరులు మూకుమ్మడిగా ఏకతాటిపైకి వచ్చారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి భూపేష్ రెడ్డి మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వీరంతా పాల్గొన్నారు. బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి జిత్తులకు ఇంటి నుంచే బ్రేకులు పడ్డాయి. నాన్నలా సీటు వదులుకునే ప్రసక్తే లేదని భూపేష్ సైతం తేల్చి చెప్పారు. ఆరోజు పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరంటూనే ఎన్నికల్లో పోటీలో ఉంటానని బహిరంగంగా ప్రకటించారు.
టీడీపీ, బీజేపీ ఎన్నికల పొత్తులో భాగంగా జమ్మలమడుగు సీటు బీజేపీకి కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీకి సైతం వెళ్లి అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరిపి, విజయవాడలో తిష్ట వేశారు. ఎలాగైనా సరే జమ్మలమడుగు సీటును బీజేపీ కోటాలో దక్కించుకోవాలని అనేక యుక్తులు ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పొత్తులో భాగంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనన్న భావన టీడీపీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి మదిలో పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం జమ్మలమడుగు కేంద్రంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులను, అనుచరులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి దేవగుడి సోదరులు హాజరవుతారా.. లేదా అన్న సందేహం రాజకీయ పరిశీలకుల్లో ఉండింది. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆదినారాయణరెడ్డి మినహా మిగిలిన సోదరులంతా సమావేశానికి హాజరై ఆశ్చర్యపరిచారు.
ఆది స్పీడ్‌కు బ్రేకులు..
బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి స్పీడ్‌కు ఇంటి నుంచే బ్రేకులు పడుతున్నాయి. సోదరులు మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, శివనాథరెడ్డిలతోపాటు రామాంజనేయరెడ్డి, జయరామిరెడ్డి, శివనారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి సైతం భూపేష్‌రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు బరిలో ఉంటానని ఆత్మీయ సమావేశంలో భూపేష్ స్పష్టం చేశారు. నాన్నలా పోటీ నుంచి విరమించే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ఆరోజు పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరని చెప్పుకొచ్చారు. టీడీపీ ఓటు బీజేపీకి బదలాయింపు కాదని ప్రకటించారు. మీరంతా నా వెన్నంటే నడుస్తారని ఆశిస్తున్నా అంటూ.. బీజేపీకి సీటు కేటాయించినా సరే, ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని నర్మగర్భంగా తేల్చి చెప్పడం విశేషం.
తిరగబడ్డ భూపేష్...
దేవగుడి కుటుంబంలో ఆదినారాయణరెడ్డిని నియంతగా పరిశీలకులు అభివర్ణిస్తారు. ఆయన చెప్పిన మాటనే మిగిలిన సోదరులంతా ఆచరించాల్సిన పరిస్థితి ఉండేది. 2009 ఎన్నికల నుంచి తన రాజకీయ వారసుడు భూపేష్ అంటూ ప్రకటిస్తూ వచ్చిన ఆయన ఇటీవల టీడీపీకి కేటాయిస్తే భూపేష్, బీజేపీకి కేటాయిస్తే తాను పోటీలో ఉంటానని సన్నిహితులతో చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో మరోమారు అవకాశం కోల్పోకూడదనే భావన భూపేష్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అవకాశవాదిగా ముద్రపడిన ఆది ఎత్తుగడలను పసిగట్టి ఆ మేరకే భూపేష్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది. ఏదిఏమైనా భూపేష్ తన కుటుంబంలో పట్టు సాధించి ఆదికి రాజకీయ సవాల్ విసిరినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment