సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. ఒకరు సమ్మతిస్తే, ఇంకొకరు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యక్ష విరుద్ధభావాలతో వ్యవహరిస్తున్నారు. జోన్–5 టీడీపీ ప్రాంతీయ సదస్సు వేదిక ఏర్పాటు విషయంలో మరోమారు తెలుగుతమ్ముళ్లు మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ముందుగా అధికారులు ఎయిర్‌పోర్టు సమీపంలో అశోక్‌లైల్యాండ్ షోరూమ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసేందుకు సమ్మతించారు. హఠాత్తుగా బిల్టప్ పక్కన ఉన్న పుత్తా ఎస్టేట్‌లో నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా జిల్లా టీడీపీ నేతల సమ్మతి లేకపోయినా సరే ఇక్కడే ఏర్పాటు చేస్తామంటూ కమలాపురం టీడీపీ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి భీష్మించుకున్న వైనమిది.
♦ తెలుగుదేశం పార్టీ జోన్–5 ప్రాంతీయ సదస్సు నిర్వహణ ఇదివరకూ మూడు పర్యాయాలు వాయిదా పడింది. ఈనెల 18న నిర్వహించేందుకు అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. కడప, అనంతపురం, హిందూపురం, నంద్యాల, కర్నూల్ జిల్లాల పరిధిలో 35 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాంతీయ సదస్సును కడపలో నిర్వహించనున్నారు. ఈ సదస్సును ముందుగా ఎయిర్‌పోర్టు సమీపంలో నిర్వహించాలని తలిచారు. ఆమేరకు అధికారులు సైతం సూచన ప్రాయంగా అంగీకరించారు. ఎన్‌హెచ్ రహదారికి 500 మీటర్లు దూరంలో సభ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అక్కడ ఏర్పాటుకు అనుమతులు కోరే లోపే బిల్టప్ సమీపంలో సన్నాహాలు చేస్తున్నారు. ఆమేరకు కడప టీడీపీ నేతలు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్, వికాస్ హరికృష్ణ తదితరులు కొబ్బరి కాయలు కొట్టి ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారు.
లక్ష్మిరెడ్డి స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు...
కడప టీడీపీ టికెట్ కార్పోరేటర్ ఉమాదేవికి ఖరారయ్యింది. మా కోడల్ని ఆశీర్వదించాలని టీడీపీ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి గత కొంతకాలంగా ప్రచారం మొదలు పెట్టారు. లక్ష్మిరెడ్డి దూకుడు కట్టడి చేయాలని అంతే స్పీడుగా వైరిపక్షం పావులు కదుపుతోంది. ఇదివరకూ నారా లోకేష్ పర్యటన ఆలంఖాన్‌పల్లె మీదుగా కడపకు ఉండగా అనూహ్యంగా అడ్డగించి, రింగ్‌రోడ్డు వెంబడి దేవుని కడపలోకి ప్రవేశించేలా రూట్‌మ్యాప్ మార్చారు. ప్రాంతీయ సదస్సు ఎయిర్‌పోర్టు సమీపంలో ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు తలిచారు.
ఆ భూమి ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డిది కావడంతోనే అక్కడ నిర్వహంచరాదనే నిర్ణయానికి కొంతమంది టీడీపీ నేతలు తెరపైకి వచ్చారు. కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి నాయకత్వంలో బిల్టప్ సమీపంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులు బిల్టప్ కంటే ఎయిర్‌పోర్టు స్థలమే అనువైన ప్రదేశంగా చెబుతున్నా అవేమీ పట్టించుకోలేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్టప్ సమీపంలో ఏర్పాట్లు ప్రారంభించారు. ఈమొత్తం వ్యవహారం కేవలం లక్ష్మిరెడ్డి స్పీడ్‌కు బ్రేకులు వేసే ఎత్తుగడలేనని పలువురు ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment