ప్రత్యేక హోదాపై బంద్‌కు సన్నద్ధం కావాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి
గిద్దలూరు రూరల్ : ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29 వ తేదీన నిర్వహిచబోయే బంద్‌కు ఉద్యోగ, విద్యార్థి, కార్మిక సంఘాలతో పాటూ అన్ని రాజకీయ పార్టీల వారు సన్నద్ధం కావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. పట్టణంలోని తన నివాస గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తుందన్నారు. దీంతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోయి రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యువకులకు ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగానే ఉండిపోయే ప్రమాదం ఉందన్నారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పరిపాలనలో ఉండబట్టే సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విఫరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో ఉల్లిని కొనాలంటేనే ప్రజలకు కళ్లకు నీరు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఉల్లిని కేవలం జిల్లా, డివిజన్ కేంద్రాల్లో మాత్రమే సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నారన్నారు.
ఉల్లి ధరలను నియంత్రించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. గోదాముల్లోని పప్పు ధాన్యాలను పురుగులు తింటున్నాయని అవి మనుషులకు పెట్టడానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ రాష్ట్ర యువజన కార్యదర్శి దుగ్గా రామ్మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సూర స్వామిరంగారెడ్డి, పట్టణ కన్వీనర్ మోపూరి బ్రహ్మం యాదవ్, గిద్దలూరు మాజీ సర్పంచ్ దప్పిలి విజయభాస్కరరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు దమ్మాల జనార్దన్, షేక్ పెద్దభాష, కొమరోలు సర్పంచ్ అబ్దుల్ ఖాదర్, కొమ్మునూరు ఎంపీటీసి రాంసుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు చిన్నశ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, సీవీఎన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.