
30న ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ పరామర్శ యాత్ర
హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలని నిర్ణయించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30న ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. గిట్టుబాటు ధరలేక బలవన్మరణాలకు పాల్పడ్డ పొగాకు రైతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు ఆపార్టీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. అనంతరం టంగుటూరులో రైతు సమస్యలపై వైఎస్ జగన్ ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పొగాకు రైతుల వరుస ఆత్మహత్యలు రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అశోక్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.