mla krishnayya
-
ప్రభుత్వం వాటిని ఊరించకుండా ప్రారంభించాలి
ముషీరాబాద్: రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ గురుకులాలపై ఊరిస్తున్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని ప్రారంభిస్తామనడం తగదన్నారు. ముఖ్యమంత్రికి బీసీల అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే వెంటనే గురుకులాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 250, మైనార్టీలకు 71 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసిన పాలకులు బీసీలకు ఒక్క రెసిడెన్షియల్ పాఠశాల కూడా మంజూరు చేయకుండా హామీలతో మభ్యపెడుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని, హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు రూ.1500 పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ్‌బాబు, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, రాజేందర్, శ్రీనివాస్, రాధాకృష్ణ, సతీష్, రాంబాబు, చందర్ తదితరులు పాల్గొన్నారు. -
బాగు పడింది కేసీఆర్ కుటుంబం ఒక్కటే
కవాడిగూడ : ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలతోనే పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడితే మొదటి సీఎం దళితుడే అనే వాగ్దానం నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామనే వరకూ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. శుక్రవారం ఇందిరాపార్కులో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వేర్వేరన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చేసిన వాగ్దానాలన్నీ గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలకు ఏమీ ఒరగలేదనీ, కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ కాకుండా విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. కృష్ణయ్య మాట్లాడుతూ 770 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆ పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కి అప్పగించడం సరైంది కాదన్నారు. పదేళ్లు పాఠాలు చెప్పడానికి పనికి వచ్చిన వారు ఉద్యోగం పర్మినెంట్ చేయడానికి పనికిరారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నాడన్నారు. తక్షణమే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు స్వరూప, ఉమా, గాయత్రీ, నవీన, విక్టోరియా, అనీషా, రజనీ, కె.యాదయ్య, నరేందర్ పాల్గొన్నారు.