ప్రభుత్వం వాటిని ఊరించకుండా ప్రారంభించాలి
ముషీరాబాద్: రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ గురుకులాలపై ఊరిస్తున్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని ప్రారంభిస్తామనడం తగదన్నారు.
ముఖ్యమంత్రికి బీసీల అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే వెంటనే గురుకులాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 250, మైనార్టీలకు 71 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసిన పాలకులు బీసీలకు ఒక్క రెసిడెన్షియల్ పాఠశాల కూడా మంజూరు చేయకుండా హామీలతో మభ్యపెడుతున్నారన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని, హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు రూ.1500 పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అరుణ్‌బాబు, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, రాజేందర్, శ్రీనివాస్, రాధాకృష్ణ, సతీష్, రాంబాబు, చందర్ తదితరులు పాల్గొన్నారు.