MLA Raj Ballabh Yadav
-
రేప్ కేసు.. ఎమ్మెల్యేపై ఛార్జ్ షీట్
పాట్నా: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ పై నలంద పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలుచేశారు. రెండు నెలల కిందట ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం నవాడా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన 53 ఏళ్ల రాజ్ బల్లబ్ పరారయ్యాడు. అనంతరం గత నెలలో స్థానిక కోర్టులో లొంగిపోయాడు. ఈ క్రమంలో బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు ప్రధాన నిందితులతో ఎమ్మెల్యే ఒకరని మహిళా పోలీస్ స్టేషన్లో 205 పేజీల ఛార్జ్ షీటు తయారుచేశారు. మరోవైపు నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూ యాదవ్ పార్టీకి చెందిన బల్లభ్ యాదవ్ తాను అమాయకుడినని, కక్షపూరితంగా తనను కొందరు ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ కు అమ్మాయిలను పంపించే ఇద్దరు మహిళల పేర్లను కూడా ఈ ఛార్జ్ షీటులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సహా మరో వ్యక్తిని జిల్లాకోర్టులో ప్రవేశపెట్టినట్లు ఓ అధికారి వివరించారు. అత్యాచారానికి గురైన పదో తరగతి విద్యార్థిని ప్రత్యేక భద్రత మధ్య గోప్యంగా ఉంచిన ఓ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్స్ రాసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈ ఫిబ్రవరిలో నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. -
రేప్ కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే
పట్నా: మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్ గురువారం కోర్టు ఎదుట లొంగిపోయారు. బాలికపై అత్యాచారం కేసులో తనకు వ్యతిరేకంగా అరెస్టు ఉత్తర్వు జారీకావడంతో దాదాపు నెల కిందట ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. బిహార్లోని నవాడా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన 53 ఏళ్ల రాజ్ బల్లబ్ ఫిబ్రవరి 6న పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూ యాదవ్ పార్టీకి చెందిన బల్లభ్ యాదవ్ తాను అమాయకుడినని, కక్షపూరితంగా తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉండటంతోనే తాను కోర్టు ఎదుట లొంగిపోయానని ఆయన గురువారం తెలిపారు. సీఎం నితీశ్ కుమార్ సొంత నియోజకవర్గమైన నలందాలో ఈ రేప్ ఘటన జరగడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కాగా, తనపై ఎమ్మెల్యే అమానుషంగా అత్యాచారం జరిపినప్పటికీ పదో తరగతి పరీక్షలు రాయాలని బాధిత బాలిక నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక భద్రత మధ్య గోప్యంగా ఉంచబడిన ఓ పరీక్ష కేంద్రంలో ఆ బాలిక పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాటుచేశారు.