MLA sampathkumar
-
దొరల రాజ్యం అంతం చేయాలి
అలంపూర్ (మహబూబ్‌నగర్): రాష్ట్రంలో దొరల రాజ్యాన్ని అంతమొందించాలని ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. మండలంలోని లింగనవాయి, బైరన్‌పల్లి, గొందిమల్ల, కోనేరు, బుక్కాపురం, క్యాతూర్, భీమావరం గ్రామాల్లో శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్‌కుమార్ గ్రామాల్లో ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెండు పడకల ఇళ్లు, దళితులకు మూడెకరాల పొలం ఎంత మందికి అందాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారన్నారు. రాబోయేది ఇందరమ్మ రాజ్యమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సదానందమూర్తి, శ్రీధర్ రెడ్డి, రాము, నాయుడు, జనార్దన్‌రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
తుమ్మిళ్ల ఎత్తిపోతలపై సమీక్ష
శాంతినగర్ : వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల వద్ద ఏర్పాటుచేసే ఎత్తిపోతలపై సోమవారం ఆర్డీఎస్ అధికారులతో ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికి గతంలో రూ.850 కోట్లతో ప్రతిపాదనలు పంపగా నిధుల మంజూరుపై ప్రభుత్వం పునరాలోచిస్తోందన్నారు. తక్షణమే ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అధికారులతో ఆరా తీశారు. ఆర్డీఎస్కు నీరందాలంటే మొదట తనగల సమీపంలోని మల్లమ్మకుంట వద్ద ప్రతిపాదించిన .39 టీఎంసీలతో 475ఎకరాల భూమిని సేకరించాలన్నారు. అక్కడే రిజర్వాయర్ ఏర్పాటుచేసి లింక్ కెనాల్ ద్వారా ఆర్డీఎస్కు నీటిని కలిపితే బాగుంటుందని ఆర్డీఎస్ ఈఈ చిట్టిబాబు, డీఈ శ్రీనివాసులు, ఏఈ శివరాజ్ బదులిచ్చారు. రెండోదశలో జూలెకల్, వల్లూరు రిజర్వాయర్లు నిర్మిస్తే సరిపోతుందన్నారు. ఈ విషయమై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి వెంటనే నిధులు మంజురుచేసి పనులు మొదలు పెట్టేందుకు కషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. -
ఆర్డీఎస్‌పై సర్కారు రాజకీయం ఎమ్మెల్యే సంపత్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డీఎస్ పనులను పూర్తిచేయాలని కాకుండా కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు ఆర్డీఎస్ను పూర్తిచేయడానికి అవసరమైన చర్యలను తీసుకోకుండా ప్రతిపక్షాలపై అసత్యాలను ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ నేతల బలప్రయోగం వల్ల ఆర్డీఎస్ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నా ఆర్డీఎస్ నిర్మాణంలో ఒక్క అడుగూ పడలేదన్నారు. కర్నూలు జిల్లా అధికారులు కర్ణాటకకు రాసిన లేఖవల్ల ఆర్డీఎస్ ఆగిపోయిందన్నారు. కర్ణాటక, ఏపీలతో చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాస్తామని సంపత్ వెల్లడించారు. -
ఎమ్మెల్యే లవ్ స్టోరీ...
మహబూబ్‌నగర్ జిల్లా: ప్రేమలో గెలిచి..జీవితంలో నిలిచి అన్యోన్యదాంపత్యం గడుపుతున్నారు అలంపూర్ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ దంపతులు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంపత్‌కుమార్..వారి ప్రేమ ఎలా చిగురించింది..ఎలా ఫలించిందో వివరించారు. 'మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజులు అవి. సంపత్‌కుమార్ (ప్రస్తుత అలంపూర్ ఎమ్మెల్యే)కు మహాలక్ష్మి జూనియర్. కళాశాల వార్షిక ఉత్సవాలు జరగుతుండగా అనుకోకుండా ఇరువురికి పరిచయమైంది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. మొదట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఇబ్బందులు పడ్డాం. అయితే చివరకు పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాం. కులాంతర వివాహమైనా పెద్దలు మా ప్రేమపై ఉన్న గౌరవంతో ఒప్పుకున్నారు. పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి ఇన్నేళ్ల మా దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలూ రాలేదు. ఒకరంటే ఒకరికి అభిమానం. ఒకరి అభిప్రాయాలు మరొకరం గౌరవించకుంటాం. అందుకే నా వ్యక్తిగత జీవితానికి ఎంత వరకు తన అవసరం ఉంటుందో అంత వరకు మహలక్ష్మి నాకు పూర్తి సహకారం అందిస్తుంది. నేను ప్రజా సేవ చేసే మార్గం ఎంచుకుంటే తను గృహిణిగా స్థిరపడింది. నా కుమారుడు దీపక్ప్రజ్ఞా, కూతురు ప్రణయ దీపికలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఉన్నత భవిష్యత్‌కు మార్గ దర్శకురాలిగా నిలుస్తోంది. ఆమె అందిస్తున్న సహకారంతో ప్రజాసేవలో నేను ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి దోహదపడింది' అని అంటున్నారు సంపత్‌కుమార్. -
‘ఏడాదిలో కేసీఆర్ చేసింది శూన్యం’
మహబూబ్‌నగర్ అర్బన్: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా, రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని సీఎల్పీ కార్యదర్శి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విమర్శించారు. సోమవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యమకాలంలో చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయని సీఎం రూ.6వేల కోట్ల వాటర్‌గ్రిడ్ పనులు తన కొడుకుకు, మరో రూ.35వేల కోట్లతో అల్లుడికి కాకతీయ మిషన్ పనులు అప్పజెప్పారని ఎద్దేవా చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాల్సిన సీఎంనాలుగు రోజుల పాటు తన ఫాంహౌజ్‌లో ఉండి అల్లం సాగును పర్యవేక్షించడం బాధ్యతల నుంచి తప్పుకోవడమేన ని విమర్శించారు. జిల్లా మంత్రులు ఎక్కడ డబ్బులు దొరుకుతాయో, తమ అనుచరులకు పనులెట్లా ఇప్పించుకోవాలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబు జిల్లాను దత్తత తీసుకుని పట్టించుకోలేదని, తాను ప్రత్యేక శ్ర ద్ధ తీసుకొని అభివృద్ధి చేస్తానన్న ముఖ్యమంత్రి కనీసం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కూడా యత్నించడం లేదనన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కేసీఆర్ మానసపుత్రిక అని చెప్పుకోవడం సిగ్గుచేటని, ఆ పథకానికి నాంది పలికి నిధులు, డీపీఆర్ విడుదల చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. తన మాట వినని మీడియా గొంతును నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన చర్యలు టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందనన్నారు. సీఎం, జిల్లా మంత్రులు పర్యటనలకు వచ్చినప్పుడు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చి వారి భాగస్వామ్యంతో అభివృద్ధికి పాటుపడే ఆనవాయితీని ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో సాగు0నీటి సౌకర్యం కల్పించడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేయాలని లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, ఉపాధ్యక్షులు రంగారావు, మీడియాసెల్ కన్వీనర్ పటేల్ వెంకటేశ్, నేతలు అంజయ్య, గోపాల్‌రెడ్డి, అమరేందర్‌రాజు పాల్గొన్నారు.