ఎమ్మెల్యే లవ్ స్టోరీ...
మహబూబ్నగర్ జిల్లా: ప్రేమలో గెలిచి..జీవితంలో నిలిచి అన్యోన్యదాంపత్యం గడుపుతున్నారు అలంపూర్ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ దంపతులు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంపత్‌కుమార్..వారి ప్రేమ ఎలా చిగురించింది..ఎలా ఫలించిందో వివరించారు.
'మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజులు అవి. సంపత్‌కుమార్ (ప్రస్తుత అలంపూర్ ఎమ్మెల్యే)కు మహాలక్ష్మి జూనియర్. కళాశాల వార్షిక ఉత్సవాలు జరగుతుండగా అనుకోకుండా ఇరువురికి పరిచయమైంది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. మొదట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఇబ్బందులు పడ్డాం. అయితే చివరకు పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాం. కులాంతర వివాహమైనా పెద్దలు మా ప్రేమపై ఉన్న గౌరవంతో ఒప్పుకున్నారు. పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి ఇన్నేళ్ల మా దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలూ రాలేదు. ఒకరంటే ఒకరికి అభిమానం. ఒకరి అభిప్రాయాలు మరొకరం గౌరవించకుంటాం. అందుకే నా వ్యక్తిగత జీవితానికి ఎంత వరకు తన అవసరం ఉంటుందో అంత వరకు మహలక్ష్మి నాకు పూర్తి సహకారం అందిస్తుంది. నేను ప్రజా సేవ చేసే మార్గం ఎంచుకుంటే తను గృహిణిగా స్థిరపడింది. నా కుమారుడు దీపక్‌ప్రజ్ఞా, కూతురు ప్రణయ దీపికలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఉన్నత భవిష్యత్‌కు మార్గ దర్శకురాలిగా నిలుస్తోంది. ఆమె అందిస్తున్న సహకారంతో ప్రజాసేవలో నేను ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి దోహదపడింది' అని అంటున్నారు సంపత్‌కుమార్.