ఆర్డీఎస్‌పై సర్కారు రాజకీయం ఎమ్మెల్యే సంపత్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్డీఎస్ పనులను పూర్తిచేయాలని కాకుండా కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు ఆర్డీఎస్‌ను పూర్తిచేయడానికి అవసరమైన చర్యలను తీసుకోకుండా ప్రతిపక్షాలపై అసత్యాలను ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ నేతల బలప్రయోగం వల్ల ఆర్డీఎస్ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నా ఆర్డీఎస్ నిర్మాణంలో ఒక్క అడుగూ పడలేదన్నారు. కర్నూలు జిల్లా అధికారులు కర్ణాటకకు రాసిన లేఖవల్ల ఆర్డీఎస్ ఆగిపోయిందన్నారు. కర్ణాటక, ఏపీలతో చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాస్తామని సంపత్ వెల్లడించారు.