పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత నేతలదే
♦ టీడీపీ అధినేత చంద్రబాబు
♦ పార్టీ విస్తృతస్థాయి సమావేశం
♦ ఎర్రబెల్లి, రేవంత్ మాటల యుద్ధం!
సాక్షి, హైదరాబాద్: ఏపీతోపాటు తెలంగాణలో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు టీటీడీపీ నేతలకు చెప్పారు. టీటీడీపీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఏర్పాటైన తరువాత తొలి విస్తృతస్థాయి సమావేశం శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో బాబు మాట్లాడుతూ పార్టీ, ప్రభుత్వం వేర్వేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘ఏపీ సీఎంగా నేను తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సామరస్యంగా ఉంటాను. పార్టీ పరంగా తెలంగాణ ప్రజల తరపున మీరు టీఆర్‌ఎస్‌పై పోరాడండి. నేను జోక్యం చేసుకోను’ అని అన్నారు. వరంగల్ ఉపఎన్ని కలో బీజేపీ అభ్యర్థి దేవయ్య గెలుపు ఖాయమని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను మి త్రపక్షం గెలుపున కు వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు... వారానికోసారి తెలంగాణ పార్టీ కోసం సమ యం ఇవ్వాలని చంద్రబాబును కోరగా, అందుకు ఆయన ఒప్పుకున్నారు.
మళ్లీ అదే రచ్చ
పార్టీలో ఉప్పు నిప్పుగా ఉంటున్న టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సభా వేదిక పైనుంచే పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. ముందు గా ఎర్రబెల్లి మాట్లాడుతూ ‘పదవులు ఇచ్చేది పార్టీలో అధికారం చలాయించడానికి కాదు. కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి. తెలంగాణలో అనేక నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలు లేరు. ముందుగా ఇన్‌చార్జీలను నియమించాలి. నాకు పదవులు ఉన్నాయి. ఇక అన్నీ నేనే అని తలబిరుసుతో తిరిగితే నష్టం మనకే’ అంటూ పరోక్షంగా రేవంత్‌పై వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
అనంతరం మాట్లాడిన రేవంత్... ‘నేనేం చేసినా పార్టీ కోసమే. పనిచేసిన వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయి. నేను 2007లో పార్టీలోకి వచ్చా. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను’ అంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ సమావేశానికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షత వహించగా, ఎంపీ మల్లారెడ్డి, పార్టీ నేతలు గరికపాటి మోహన్‌రావు, జి.సాయన్న, ఇ.పెద్దిరెడ్డి, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.