mla sanjeeva rao
-
ఎమ్మెల్యేకు చేదు అనుభవం
బంట్వారం, వికారాబాద్ : మండలంలోని తొర్మామిడిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మంçగళవారం వచ్చిన ఎమ్మెల్యే సంజీవరావుకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే కారు దిగగానే గ్రామస్తులు అడ్డుకున్నారు. గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు రసాభసగా సాగింది. ధారూరు సీఐ ఉపేందర్ జోక్యంతో కాస్త సద్దుమణిగింది. గతేడాది తొర్మామిడిలో అన్నాచెల్లెలు అనుకోని ఘటనలో బావిలో పడి మృతి చెందారు. అప్పట్లో ఎమ్మెల్యే సంజీవరావు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. గ్రామస్తుల డిమాండ్ మేరకు మృతుల కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మాటిచ్చారు. కాని ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం అందలేదు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సంజీవరావును ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆయన ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విపిపించుకోలేదు. సభలోను అదే లొల్లి.. ఎట్టకేలకు పోలీసులు సభాస్థలికి ఎమ్మెల్యేను తీసుకువెళ్లారు. కాని అక్కడ మరింత గందరగోళం నెలకొంది. బాధిత కుటుంబానికి సహాయం చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రకటించేవరకు సభ జరుగనివ్వమంటూ రసాభస చేశారు. రూ.ఐదు లక్షలు ఇవ్వాలంటూ పట్టుబట్టారు. డీఎస్పీ శిరీష, ధారూరు, వికారాబాద్ సీఐలు ఉపేందర్, వెంకట్రామయ్య దగ్గరుండి పరిస్థితిని చక్కదిద్దారు. రూ.లక్ష సహాయం చేస్తా: ఎమ్మెల్యే తన వ్యక్తిగత సహాయం కింద బాధిత కుటుంబానికి రూ.లక్ష అందజేస్తానని ఎమ్మెల్యే సంజీవరావు ప్రకటించారు. అప్పట్లో మాట్టిచ్చినవన్నీ ప్రభుత్వపరంగా ఇప్పిస్తానని చెప్పారు. కలెక్టర్ సెలవులో ఉన్నారని రాగానే ఆయనతో వివరంగా మాట్లాడుతానని తెలిపారు. అనంతరం ఆయన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుజాత, ఎంపీడీఓ కృష్ణకుమారి, స్థానిక సర్పంచ్ మొగులయ్య, పీఏసీఎస్ చైర్మన్ కే.లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పంది వెంటకయ్య, నాయకులు మల్లారెడ్డి, డాక్టర్ నర్సింలు, సంజీవరెడ్డి, బస్వాపూర్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు శిలాఫలకం ధ్వంసం.. సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాన్ని కొందరు అధికార పార్టీ నాయకులే ధంసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి మహేందర్‌రెడ్డి తొర్మామిడి రావాల్సి ఉంది. కాని ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఎమ్మెల్యే సంజీవరావు హాజరైనప్పటికీ అనుకోని ఘటనతో ఆయన కొంత అసహనానికి గురయ్యారు. -
ఆస్పత్రిలో అవినీతి పట్టదా..?
♦ నువ్వు రావు.. వీళ్లు పని చేయరు.. ♦ సూపరిటెండెంట్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం ♦ ఇకపై ప్రజాప్రతినిధులను ప్రతి నెలా కలుస్తాం : ఆస్పత్రి సూపరింటెండెంట్ యాదగిరి వికారాబాద్ రూరల్ : ‘ఆస్పత్రిలో అవినీతి పేరుక పోయింది.. ఎన్ని సార్లు చెప్పినా ఇక్కడి వైద్యులు, సిబ్బందిలో మార్పు రావడం లేదన్నారు. ఇన్నాళ్లు చూసీ చూడనట్లు వ్యవహరించా.. ఇప్పటి నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు’ అని స్థానిక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ యాదగిరిపై ఎమ్మెల్యే సంజీవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆస్పత్రి సలహాసంఘం ఏర్పడి రెండేళ్ల తరువాత మొట్ట మొదటి సారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చి రోగులను హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నట్లు తన దృష్టి వచ్చిందని ఇది సరికాదని తెలిపారు. ఆస్పత్రికి రోగులు ఎప్పుడు వచ్చినా.. డాక్టర్, నర్సులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇక్కడి నుంచి డిప్యూటేషన్‌పై వెళ్లిన వారిని తిరిగి ఇక్కడికి పిలిపించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు వడ్డించిన రిజిస్టర్‌ను ఆయన పరిశీలించారు. అందులో సంతకాలు పెట్టకుండా ఉన్నవారిని నిలదీశారు. అయితే అది నిన్నటి మెనూ రిజిస్టర్‌గా గుర్తించి నిర్వాహకులుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు భోజనం వడ్డించే కాంట్రాక్టర్‌ను యాదయ్యతో మాట్లాడారు. రోజుకు ఎంత మందికి భోజనం వడ్డిస్తారు? ఒక్కొరికి ఎంత ఖర్చు చేస్తారని అడిగడంతో.. రోజు గుడ్డు, మటన్, చికెన్ పెడుతామని సమాధానం ఇచ్చాడు. రోజూ ఇవన్నీ పెడుతావా అని మళ్లీ ప్రశ్నించారు. దీంతో సూపరిటెండెంట్ కలుగచేసుకుని మామూలు రోగులకు రోజుకు రూ. 38, గర్భిణులకు రూ. 100 ఖర్చు చేసి భోజనం వడ్డించడం జరుగుతుందన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్వహణ సరిగా లేదని మండి పడ్డారు. సార్ ఇప్పటి నుంచి ప్రతినెలా ప్రజాప్రతినిధులను కలుస్తాం? ఇదిలా ఉంటే ప్రజా ప్రతినిధులు డాక్టర్లను ప్రతివిషయంలోనూ తప్పు పడుతుండగా ఒక్కసారిగా ఆస్పత్రి సూపరింటెండెంట్.. ‘సార్ ఇప్పటి నుంచి ప్రతి నెలా ప్రజాప్రతినిధులను కలుస్తామని’ చెప్పారు. అయితే ఈ మాటకు ఆంతర్యం ఏమిటన్న విషయం అంతపట్టలేదు. కార్యక్రమంలో సీఎస్‌హెచ్‌ఎస్ హన్మంత్‌రావు, ఎంపీపీ సామల భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి, జెడ్పీటీసీ ముత్తార్ షరీఫ్, సలహా సంఘం సభ్యులు విజేందర్‌గౌడ్, నారాయణగౌడ్, కౌన్సిలర్ శేషగిరి, ఆసుపత్రి సూపరింటెండెంట్ యాదగిరి, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే సంజీవరావుకు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: ఎమ్మెల్యే సంజీవరావుకు పెను ప్రమాదం తప్పింది. శనివార రాత్రి ఎమ్మెల్యే వెళ్తున్న కారు రంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుల పోలీస్ వాహనాన్ని ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డాడు. ఆయన వాహనం మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.