MLA suspension
-
ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్పీకర్‌దే తుది నిర్ణయమన్న హైకోర్టు
-
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాసనసభ సమావేశాలకు అనుమతించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రశ్నించే వారిని సభకు అనుమతించినప్పుడే ప్రజాస్వామ్యం పరిపూర్ణం అవుతుందని పేర్కొంది. శాసనసభకు స్పీకర్ గార్డియన్ లాంటి వారని, పార్టీలకు అతీతంగా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. తమను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేయడంపై.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులు దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది. శాసనసభ నియమావళికి విరుద్ధంగా, సహేతుకమైన కారణం లేకుండానే ఈ సెషన్ మొత్తం సభకు హాజరుకాకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని వారి తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రస్తావించారు. వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరించింది. తగిన నిర్ణయం తీసుకోండి శాసనసభ్యులను సహేతుకమైన కారణాలు లేకుండా సస్పెండ్ చేయడం వారి హక్కులను హరించడమేనని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు సహేతుకమైన కారణాలు లేవని భావిస్తున్నామంది. సస్పెండైన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ రోజే శాసనసభ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమావేశాలకు అనుమతించాల్సిందిగా కోరాలని సూచించింది. కార్యదర్శి వీరిని మంగళవారం సభకు ముందే స్పీకర్ దగ్గరికి తీసుకెళ్లాలని, వారి అభ్యర్థనను స్పీకర్ విని తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఉన్నత రాజ్యాంగ హోదా కల్గిన స్పీకర్ ఈ ఘర్షణ వాతావరణాన్ని సామరస్యంగా, న్యాయబద్ధంగా పరిష్కరిస్తారనే నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు, సాంప్రదాయాలకు అనుగుణంగా బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేసి సమావేశాలకు హాజరయ్యేలా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ‘‘స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోరాదన్న సింగిల్ జడ్జి తీర్పుసరికాదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ అధికారాల్లో స్పష్టమైన విభజన రేఖ ఉంది. అయినా చట్ట నిబంధనలను ఉల్లంఘించినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు..’అని పేర్కొంది. అప్పీల్ దాఖలు చేసినట్లు తాము నోటీసులు పంపినా శాసనసభ కార్యదర్శి, శాసనసభ సెక్రటేరియట్ కార్యదర్శి తరఫున ఎవరూ హాజరుకాలేదని వ్యాఖ్యానించింది. ఎట్టకేలకు నోటీసులు తీసుకున్న కార్యదర్శి సింగిల్ జడ్జి తీర్పుపై దాఖలు చేసిన అప్పీల్‌కు సంబంధించి ప్రతివాదిగా ఉన్న శాసనసభ కార్యదర్శి నోటీసులు తీసుకోవడం లేదంటూ ప్రకాశ్‌రెడ్డి ఉదయం విచారణ సందర్భంగా ధర్మా సనం దృష్టికి తెచ్చారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెళ్లి నోటీసులు అందజేయాలని, నగర పోలీసు కమిషనర్ ఇందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కార్యదర్శి నోటీసులు అందుకున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ సాయంత్రం 4 గంటల సమయంలో ధర్మాసనానికి నివేదించారు. ‘నేటి ఉదయం స్పీకర్‌ను కలుస్తాం’ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మంగళవారం ఉదయం 9 గంటలకు కలసి తమ సస్పెన్షన్‌పై హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందజేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ తెలిపారు. బడ్జెట్ సమావేశాలు మంగళవారమే ముగియనున్నందున ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ స్పీకర్ తమను సభలోకి అనుమతిస్తారనే విశ్వాసం ఉందన్నారు. సోమవారం రాత్రి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గౌర వించకపోతే మళ్లీ హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందుతామని చెప్పారు. తమ గొంతులు నొక్కుతామంటే ప్రజలు రాబోయే రోజుల్లో కేసీఆర్‌నే బహిష్కరిస్తారని ఈటల హెచ్చరించారు. అహంకారంతో వ్యవహరిస్తున్న రావణాసురుడిని (కేసీఆర్)ను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్ ఆర్’గా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నామని చెప్పారు. -
భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఆర్ భూపతిరెడ్డిపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ బుధవారం నిర్ణయం ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం విదితమే. దీనిపై టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసిన మండలి చైర్మన్ బుధవారం నిర్ణయం ప్రకటించారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 2015లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్షన్ వేటు పడింది. తీర్మానం.. భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏడాది క్రితం తీర్మానం చేశారు. 2017 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై చేసిన తీర్మానాన్ని పార్టీ జిల్లా ఇన్చార్జి తుల ఉమ ద్వారా సీఎం కేసీఆర్‌కు నివేదించారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న భూపతిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరి.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం విదితమే. తాజాగా ఆయన ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్షన్ వేటు పడటం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
చైర్మన్ బాగానే ఉన్నా.. ఆస్పత్రిలో ప్రత్యక్షం!
సాక్షి, హైదరాబాద్: అనర్హత వేటుపడ్డ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ల ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుపై పిటిషనర్ తరపు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల తన వాదనలు వినిపించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన చాలాసేపు వరకు మండలి చైర్మన్ బాగానే ఉన్నా.. అనంతరం ఆస్పత్రిలో ఎందుకు ప్రత్యక్షమయ్యారో అర్థం కావడం లేదన్నారు. ఈ నెల12న కేవలం గవర్నర్ నరసింహన్ ప్రసంగం మాత్రమే జరిగిందని, 13న శాసనసభ ప్రారంభమైందని తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజు సభలో ఎలాంటి దాడి జరగలేదని, ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయడం చట్ట విరుద్దమని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే నేతల సభ్యత్వం రద్దు చేశారని న్యాయవాది వివరించారు. తమకు ఎన్నో అనుమానాలున్నాయని, సీసీ ఫుటేజీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మండలి చైర్మన్ స్వామి గౌడ్ బాగానే ఉన్నారని, అనంతరం చాలా సేపటికి ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారని చెప్పారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆ వీడియోలోనే లేరని, అయినా అతనిపైనా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ తరపు అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి సోమవారం వరకు గడువు కోరారు. దీంతో కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. తమ సభ్యత్వాల రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, సంపత్‌లు గురువారం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రొసీడింగ్ సరిగా జరగలేదని, సభ్యుల వివరణ తీసుకోకుండానే తమపై చర్య తీసుకున్నారని న్యాయస్థానానికి నేతలు విన్నవించారు. -
అప్పుడలా... ఇప్పుడిలా...!
-
అప్పుడలా... ఇప్పుడిలా...!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేన్నయితే వ్యతిరేకించిందో... ఈనాడు అధికారంలో అదే చేసింది. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్ కె రోజాను ఏకంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండు చేశారు. అసెంబ్లీలో కాల్ మనీపై చర్చకు అంగీకరించకపోవడంతో నిరసనగా పోడియం వద్ద నిరసన తెలియజేస్తున్న సందర్భంగా రోజా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న నెపంతో అధికార పార్టీ ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండు చేయాలని తీర్మానం పెట్టడం, అది కూడా ప్రవేశపెట్టిన మరుక్షణమే ఎలాంటి చర్చకు తావివ్వకుండానే వెనువెంటనే సస్పెండు చేశారు. ఆరు నెలల పాటు కరణం సస్పెన్షన్ శాసనసభ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరిగిన సందర్భం లేదు. 2008లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న అంశంపై టీడీపీ సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తిని ఆరు నెలల పాటు సభ నుంచి సస్పెండు చేశారు. అయితే అప్పట్లో దీనికి ఒక పద్ధతిని పాటించారు. కరణం బలరాం చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు స్పీకర్ ముందు ఫిర్యాదు చేయగా, స్పీకర్ దాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. సీనియర్ సభ్యుడు గాదె వెంకట్‌రెడ్డి నేతృత్వంలో సభా హక్కుల కమిటీకి సిఫారసు చేయగా, ఆ కమిటీ పూర్వాపరాలు తెలుసుకుని అవసరమైన సాక్ష్యాధారాలను పరిశీలించింది. స్వయంగా కరణం బలరాం వాదనలను కూడా విన్నది. ఆ తర్వాత కరణం బలరాంను ఆరు నెలల పాటు సస్పెండు చేయాలని సిఫారసు చేసింది. విచిత్రమేమంటే... దానిపై శాసనసభలో కరణం బలరాంకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా లభించింది. నాడు చంద్రబాబు ఏమన్నారంటే... ఇంత జరిగిన తర్వాతే కరణం బలరాంను ఆరు నెలల పాటు సస్పెండు చేయగా, ఆరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇదొక దుర్దినం అనీ, కక్ష సాధింపు చర్య అంటూ దుయ్యబట్టారు. సభలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలను కూడగట్టి అసెంబ్లీ ఆవరణలోకి గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేశారు. కరణం బలరాంపై కక్ష సాధింపు చర్యకు దిగారంటూ ఆరోజు ఏకంగా స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. పార్లమెంటరీ చరిత్రలోనే... ఒక పార్టీ నుంచి ఎంపికైనా సభ్యుడు మరో పార్టీలోకి ఫిరాయించినట్టు బహిరంగంగా స్పష్టమైన సందర్భాల్లోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అనేక పద్ధతులు, సంప్రదాయాలను పాటిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా వారి వాదనలు వినిపించడానికి అవకాశం కల్పించారు. సభ్యుల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. రోజా విషయంలో... కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంలో సూత్రధారులను అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని ఆరోపిస్తూ రెండు రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీలో డిమాండ్ చేస్తోంది. దానిపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వడం, అది తిరస్కరించడంతో ముందు దానిపైనే చర్చ జరగాలని పట్టుబట్టింది. శుక్రవారం కూడా ఇదే అంశంపై పోడియం చుట్టుముట్టి నిరసనగా నినాదాలు చేశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలా నినాదాలు చేయడంపై ఆ తర్వాత ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పలువురు అధికార పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో దుయ్యబట్టిన తర్వాత ఉన్నట్టుండి రోజాను ఏడాది పాటు సస్పెండు చేయాలని టీడీపీ సభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర కోరడం, వెనువెంటనే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం... క్షణాల్లో రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏం తప్పు చేశారని... రోజా ఏం తప్పుచేశారని సస్పెండు చేశారని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి లేచి ప్రశ్నించినప్పటికీ మాట్లాడటానికి సభలో అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో సభలోనే ఉన్న రోజాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పైగా సస్పెండైన రోజా సభ నుంచి నిష్ర్కమిస్తే తప్ప మాట్లాడటానికి ప్రతిపక్షానికి అవకాశమివ్వబోమని స్పీకర్ తేల్చిచెప్పారు.