
కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: అనర్హత వేటుపడ్డ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుపై పిటిషనర్ తరపు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల తన వాదనలు వినిపించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన చాలాసేపు వరకు మండలి చైర్మన్ బాగానే ఉన్నా.. అనంతరం ఆస్పత్రిలో ఎందుకు ప్రత్యక్షమయ్యారో అర్థం కావడం లేదన్నారు. ఈ నెల12న కేవలం గవర్నర్ నరసింహన్ ప్రసంగం మాత్రమే జరిగిందని, 13న శాసనసభ ప్రారంభమైందని తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజు సభలో ఎలాంటి దాడి జరగలేదని, ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయడం చట్ట విరుద్దమని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే నేతల సభ్యత్వం రద్దు చేశారని న్యాయవాది వివరించారు. తమకు ఎన్నో అనుమానాలున్నాయని, సీసీ ఫుటేజీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మండలి చైర్మన్ స్వామి గౌడ్ బాగానే ఉన్నారని, అనంతరం చాలా సేపటికి ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారని చెప్పారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆ వీడియోలోనే లేరని, అయినా అతనిపైనా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ తరపు అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి సోమవారం వరకు గడువు కోరారు. దీంతో కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. తమ సభ్యత్వాల రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, సంపత్‌లు గురువారం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రొసీడింగ్ సరిగా జరగలేదని, సభ్యుల వివరణ తీసుకోకుండానే తమపై చర్య తీసుకున్నారని న్యాయస్థానానికి నేతలు విన్నవించారు.