టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ | TRS MLAs Appeal Dismissed In High Court Over Congress MLas Issue | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ

Published Mon, Jun 4 2018 11:49 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

TRS MLAs Appeal Dismissed In High Court Over Congress MLas Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో అధికార పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వాలను యథాతథంగా కొనసాగించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సభ్యుల బహిష్కరణ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన శాసనసభకు సంబంధించినదని.. అది సభ మొత్తం కలసి తీసుకునే నిర్ణయమే తప్ప, ఏ సభ్యుడికీ వ్యక్తిగత హోదాలో అధికారంగానీ, హక్కుగానీ ఉండవని స్పష్టం చేసింది. అందువల్ల అప్పీలు దాఖలు చేయాల్సింది అసెంబ్లీ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం సోమవారం 58 పేజీల తీర్పు వెలువరించింది. 

సింగిల్‌ జడ్జి తీర్పుపై.. 
శాసనసభలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు హెడ్‌ఫోన్‌ విసిరి మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ను గాయపరిచారం టూ.. అసెంబ్లీ తీర్మానం ద్వారా వారిని బహిష్కరించారు. అనంతరం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్టుగా నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది. దీనిపై వెంకటరెడ్డి, సంపత్‌లు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ శివశంకరరావు.. బహిష్కరణ ప్రొసీడింగ్స్‌ను, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్‌ 17న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. హైకోర్టు ధర్మాసనానికి అప్పీలు దాఖలు చేశారు. అయితే సింగిల్‌ జడ్జి విచారణ జరిపిన వ్యాజ్యంలో ఈ ఎమ్మెల్యేలెవరూ ప్రతివాదులు కానందున.. నిబంధనల మేరకు అప్పీల్‌ దాఖలు కోసం తమకు అనుమతి ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. దీంతో వారి అప్పీలు దాఖలుకు అనుమతించాలా, వద్దా అన్న అంశంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ వాదనలు వినిపించగా.. కోమటిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు. గత నెల 2న వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది. 58 పేజీల ఈ తీర్పులో శాసనసభ అధికారాలు, హక్కులు, అసాధారణ అధికారాల గురించి సవివరంగా చర్చించింది. 

అసెంబ్లీకి మాత్రమే అధికారం ఉంటుంది.. 
సభ్యుడి బహిష్కరణ నిర్ణయం శాసనసభ ఉమ్మడి నిర్ణయమని, దానిని న్యాయస్థానాన్ని రద్దు చేస్తే అసెంబ్లీ మాత్రమే అప్పీల్‌ దాఖలు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. బహిష్కరణకు అనుకూలంగా తాము ఓటు వేశాం కాబట్టి.. సింగిల్‌ జడ్జి తీర్పు వల్ల తాము ప్రభావితమవుతున్నామని, అందువల్ల తమకు అప్పీల్‌ దాఖలు చేసే హక్కు ఉందన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వాదన సరికాదని పేర్కొంది. ‘‘ఓ సభ్యుడిని బహిష్కరించాలా? వద్దా? అన్నది పూర్తిగా సభ పరిధిలోని వ్యవహారం. శాసనసభకు ఉండే హక్కులు, అధికారాలకు, సభ్యులకు ఉండే హక్కులు, అధికారాలకు మధ్య తేడా ఉంది. ఓ సభ్యుడిని బహిష్కరించే విషయంలో ప్రత్యేకాధికారాలు, హక్కులు శాసనసభకు మాత్రమే ఉన్నాయా? లేక దాని సభ్యులకు కూడా ఉన్నాయా? అన్నది ప్రధాన ప్రశ్న. అయితే ఏ రకంగా చూసినా.. ఓ సభ్యుడి బహిష్కరణ అన్నది సభ ఉమ్మడి నిర్ణయమే అవుతుందే తప్ప.. సభ్యుల వ్యక్తిగత హక్కుకు సంబంధించింది కాదు..’’.. అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక రాజ్యాంగంలోని అధికరణ 194 (4) ప్రకారం సభలో మాట్లాడే, సభ ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే హక్కు ఉన్న వారందరూ శాసనసభ సభ్యులే అవుతారన్న వాదనను ప్రస్తావించింది. ఆ లెక్కన అధికరణ 177 ప్రకారం రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)కు సైతం (ఓటు హక్కు తప్ప) సభలో మాట్లాడే, ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే హక్కు ఉంటుందని.. కాబట్టి స్పీకర్‌ లేదా అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌ దాఖలు చేయనప్పుడు ఏజీకి అప్పీల్‌ చేసే అధికారం ఉంటుందని తెలిపింది. వాస్తవానికైతే ఏజీ ఇలా అప్పీల్‌ దాఖలు చేయడానికి కూడా వీల్లేదని పేర్కొంది. 

స్పీకర్‌గానీ, కార్యదర్శిగానీ అప్పీల్‌ చేయాలి 
ప్రస్తుత వ్యవహారంలో 12 మంది ఎమ్మెల్యేలు సభ ఉమ్మడి నిర్ణయానికి మద్దతు తెలిపారని.. అయితే ఇలా మద్దతు తెలిపినవారి అప్పీల్‌ను అనుమతిస్తే, సభ నిర్ణయానికి మద్దతు తెలపని వారి అప్పీల్‌ను సైతం అనుమతించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘బహిష్కరణ తీర్మానాన్ని సభ్యులందరూ కలిసి చేసినప్పుడు, దానిని కోర్టు రద్దు చేస్తే.. సభే ప్రభావిత వ్యక్తి అవుతుంది. అంతేతప్ప కొందరు సభ్యులో, సభ్యుల బృందమో ప్రభావిత వ్యక్తి కిందకు రాదు. ఇలా సభ మొత్తంగా పరిగణనలోకి వచ్చినప్పుడు స్పీకర్‌ లేదా అసెంబ్లీ కార్యదర్శి మాత్రమే అప్పీల్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది..’’అని పేర్కొంది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement