కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు భద్రతను ఉపసంహరించామని హైకోర్టుకు పోలీసులు నివేదించారు. వారి సభ్యత్వాన్ని స్పీకర్ కార్యాలయం పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన మరుక్షణమే నిబంధనల ప్రకారం భద్రత కల్పిస్తామని వివరించారు. భద్రత ఉపసంహరణ విషయంలో తమకు కోమటిరెడ్డి, సంపత్‌లపై ఎటువంటి దురభిప్రాయం, విద్వేషభావం లేదని తెలిపారు. ఎమ్మెల్యేలకు భద్రత విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల మేరకే వారికి భద్రతను ఉపసంహరించినట్లు వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తమపై కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోర్టును కోరారు.
తమ శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినా తమ భద్రతను పునరుద్ధరించలేదని, గతంలో ఉన్న భద్రతను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. వారికి భద్రతను కొనసాగించే విషయంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
దీంతో నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్, జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. అసెంబ్లీ సచివాలయం నోటిఫికేషన్‌ను జిల్లాస్థాయి సెక్యూరిటీ సమీక్ష కమిటీ పరిశీలించాకే పిటిషనర్ల భద్రతను ఉపసంహరించామన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు భద్రత కల్పిస్తామని, ఆ హోదా లేనప్పుడు భద్రత కూడా ఉండదన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావుండదని వివరించారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 23న హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment