అప్పుడలా... ఇప్పుడిలా...!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేన్నయితే వ్యతిరేకించిందో... ఈనాడు అధికారంలో అదే చేసింది. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్ కె రోజాను ఏకంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండు చేశారు. అసెంబ్లీలో కాల్ మనీపై చర్చకు అంగీకరించకపోవడంతో నిరసనగా పోడియం వద్ద నిరసన తెలియజేస్తున్న సందర్భంగా రోజా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న నెపంతో అధికార పార్టీ ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండు చేయాలని తీర్మానం పెట్టడం, అది కూడా ప్రవేశపెట్టిన మరుక్షణమే ఎలాంటి చర్చకు తావివ్వకుండానే వెనువెంటనే సస్పెండు చేశారు.
ఆరు నెలల పాటు కరణం సస్పెన్షన్
శాసనసభ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరిగిన సందర్భం లేదు. 2008లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న అంశంపై టీడీపీ సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తిని ఆరు నెలల పాటు సభ నుంచి సస్పెండు చేశారు.
అయితే అప్పట్లో దీనికి ఒక పద్ధతిని పాటించారు. కరణం బలరాం చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు స్పీకర్ ముందు ఫిర్యాదు చేయగా, స్పీకర్ దాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. సీనియర్ సభ్యుడు గాదె వెంకట్‌రెడ్డి నేతృత్వంలో సభా హక్కుల కమిటీకి సిఫారసు చేయగా, ఆ కమిటీ పూర్వాపరాలు తెలుసుకుని అవసరమైన సాక్ష్యాధారాలను పరిశీలించింది. స్వయంగా కరణం బలరాం వాదనలను కూడా విన్నది. ఆ తర్వాత కరణం బలరాంను ఆరు నెలల పాటు సస్పెండు చేయాలని సిఫారసు చేసింది. విచిత్రమేమంటే... దానిపై శాసనసభలో కరణం బలరాంకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా లభించింది.
నాడు చంద్రబాబు ఏమన్నారంటే...
ఇంత జరిగిన తర్వాతే కరణం బలరాంను ఆరు నెలల పాటు సస్పెండు చేయగా, ఆరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇదొక దుర్దినం అనీ, కక్ష సాధింపు చర్య అంటూ దుయ్యబట్టారు. సభలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలను కూడగట్టి అసెంబ్లీ ఆవరణలోకి గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేశారు. కరణం బలరాంపై కక్ష సాధింపు చర్యకు దిగారంటూ ఆరోజు ఏకంగా స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.
పార్లమెంటరీ చరిత్రలోనే...
ఒక పార్టీ నుంచి ఎంపికైనా సభ్యుడు మరో పార్టీలోకి ఫిరాయించినట్టు బహిరంగంగా స్పష్టమైన సందర్భాల్లోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అనేక పద్ధతులు, సంప్రదాయాలను పాటిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా వారి వాదనలు వినిపించడానికి అవకాశం కల్పించారు. సభ్యుల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి.
రోజా విషయంలో...
కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంలో సూత్రధారులను అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని ఆరోపిస్తూ రెండు రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీలో డిమాండ్ చేస్తోంది. దానిపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వడం, అది తిరస్కరించడంతో ముందు దానిపైనే చర్చ జరగాలని పట్టుబట్టింది. శుక్రవారం కూడా ఇదే అంశంపై పోడియం చుట్టుముట్టి నిరసనగా నినాదాలు చేశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అలా నినాదాలు చేయడంపై ఆ తర్వాత ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పలువురు అధికార పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో దుయ్యబట్టిన తర్వాత ఉన్నట్టుండి రోజాను ఏడాది పాటు సస్పెండు చేయాలని టీడీపీ సభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర కోరడం, వెనువెంటనే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం... క్షణాల్లో రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఏం తప్పు చేశారని...
రోజా ఏం తప్పుచేశారని సస్పెండు చేశారని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేచి ప్రశ్నించినప్పటికీ మాట్లాడటానికి సభలో అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో సభలోనే ఉన్న రోజాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పైగా సస్పెండైన రోజా సభ నుంచి నిష్ర్కమిస్తే తప్ప మాట్లాడటానికి ప్రతిపక్షానికి అవకాశమివ్వబోమని స్పీకర్ తేల్చిచెప్పారు.