అసెంబ్లీ వద్ద టెన్షన్.. టెన్షన్
ఎమ్మెల్యే ఆర్కే రోజా సుదీర్ఘ కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే.. ఆమె రాక సందర్భంగా అసెంబ్లీలోకి ప్రవేశించే అన్ని మార్గాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు, మార్షల్స్‌ను మోహరించారు. దీంతో అక్కడ కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోజా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అసిస్టెంట్ కూడా రోజా వెంట అసెంబ్లీకి వచ్చారు. రోజాతో పాటు వైఎస్ఆర్‌సీపీకి చెందిన పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ఆమె సొంత జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తూ.. చట్టసభలో తనకు అన్యాయం జరిగిన తర్వాత కోర్టుకు వెళ్లానని, అక్కడ న్యాయం జరిగిందని అన్నారు. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఉత్తర్వులను ముందే అందజేశానని తెలిపార. సభలో ఉన్నవాళ్లంతా చదువుకున్నవాళ్లేనని, ఆర్డర్ చదివితే మంత్రి యనమల రామకృష్ణుడికి, స్పీకర్‌కి అన్ని విషయాలూ తెలుస్తాయని అన్నారు. ఇప్పుడు తనను ఆపి న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఏమీ చేయరని భావిస్తున్నానని, ఏం జరుగుతుందో చూడాలని ఆమె వ్యాఖ్యానించారు.
రోజా సస్పెన్షన్ తీర్మానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించింది. ఆ ఉత్తర్వుల కాపీని గురువారమే అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి కె. సత్యనారాయణని కలిసి కోర్టు ఉత్తర్వులను అందజేశారు. ఉత్తర్వులు తనకు అందినట్లు ఆయన ఒక కాపీ ఇచ్చారు. ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావచ్చని కూడా జస్టిస్ రామలింగేశ్వరరావు తన మధ్యంతర ఉత్తర్వులలో పేర్కొన్న విషయం తెలిసిందే.