ఇష్టారాజ్యం
ప్రజాస్వామ్య చరిత్రలో మరో దుర్దినమిది. ప్రజాసమస్యలపై చర్చకు వేదిక కావల్సిన శాసనసభ.. అధికారపార్టీ దుర్నీతికి సాక్షిగా మిగిలింది. మందబలంతో ప్రతిపక్షం గొంతు నులిమేసిన తీరు చూసి యావత్‌రాష్ర్టం నివ్వెరపోయింది. మొత్తం ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి వెలివేసిన అధికారపక్షం తాము అనుకున్నది సాధించింది. మహిళల ధన, మాన, ప్రాణాలతో ఆటలాడుకుంటున్న కాల్‌మనీ- సెక్స్‌రాకెట్‌పై చర్చను పక్కదారి పట్టించడంలో అధికారపక్షం సఫలమయ్యింది. ఆ బురదను అన్ని పార్టీలకూ అంటించేందుకు సభానాయకుడైన ముఖ్యమంత్రి శాయశక్తులా శ్రమించారు.. మహిళా ఎమ్మెల్యేపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేశారు.
కాల్ మనీ-సెక్స్ రాకెట్‌పై ముందుగా చర్చ జరగాలి.. తర్వాత సీఎం సమాధానమివ్వాలి.. అదే సంప్రదాయం.
- ఇదీ విపక్షం ప్రధాన డిమాండ్
ముందు సీఎం ప్రకటన చేస్తారు.. తర్వాతే చర్చకు అనుమతిస్తాం... సంప్రదాయాలు జాన్తానై...
- ఇదీ అధికారపక్షం పట్టు
- ప్రకటన చేసిన తర్వాత లోతైన చర్చకు అవకాశం ఉండదు. కొన్ని క్లారిఫికేషన్లు ఇచ్చి చాప చుట్టేస్తారు. వాస్తవ విషయాలు బయటకు రావు. అందుకే ముందు చర్చ జరగాలని విపక్షం పట్టు
- అనుకున్న విధంగా సభ సాగించడానికి అధికారపక్షం వ్యూహం.. కాల్‌మనీ - సెక్స్ రాకెట్‌పై చర్చ జరగనీయకుండా అంబేడ్కర్‌ను అడ్డుపెట్టుకున్నారు.
- అడ్డుకున్నారన్న నెపంతో మొత్తం ప్రతిపక్షాన్ని సభనుంచి సస్పెండ్ చేశారు. మార్షల్స్‌తో బైటకు గెంటించారు.
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బజారు రౌడీల్లా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి.
- అన్ని పార్టీలలో కాల్‌మనీ సభ్యులు ఉన్నారంటూ చంద్రబాబు సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
- కామ (కాల్‌మనీ) ముఖ్యమంత్రి అని నినదించినందుకు కనీవినీ ఎరుగని రీతిలో ఏడాది పాటు రోజా సస్పెన్షన్. ఆమె బయటకు వెళితే తప్ప విపక్షం గొంతు విప్పడానికి లేదన్న స్పీకర్
- రోజా వెళ్లాకే ప్రతిపక్ష నేతకు మైక్.
సెక్స్ రాకెట్‌లో బాధితులంతా పేదవాళ్లే. అధిక వడ్డీకి రుణాలిచ్చి, తీసుకున్నవారు తిరిగి చెల్లించలేకపోతే లైంగికంగా వారిని లోబర్చుకుని అశ్లీల వీడియోలు తీశారు. ఈ బాధితులంతా పేదవాళ్లు కారా? వారంతా దళితులు కాదా? వారంతా అంబేడ్కర్ బిడ్డలు కాదా?..’
- ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్
‘ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది? రాజశేఖరరెడ్డితో సమఉజ్జీని నేను. ఒక దశలో ఆయనే (వైఎస్ రాజశేఖరరెడ్డి) నాతో పెట్టుకుని ఒకడుగు వెనక్కు వేశారు.. మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చిన వీరికేమి తెలుసు. వాళ్లేం చేస్తారో చూద్దాం...మనం చేసేది చేద్దాం..
- ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ గొంతు నొక్కడానికి అధికార పక్షం పలు వ్యూహాలు అనుసరించింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఏపీ శాసనసభ- అనేక మలుపులు, మరకలతో ముగిసింది. హేయమైన కాల్‌మనీ-సెక్స్ రాకెట్ అంశం మీద చర్చ జరగకుండా చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ వ్యవహరిం చింది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా సభను సాగించింది. విపక్షంపై వేటు వేయాలన్న ముందస్తు వ్యూహంతో వ్యవహరించినట్లు ప్రస్ఫుటమయింది.
విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన భారీ వడ్డీలు-లైంగిక దోపిడీ (కాల్‌మనీ - సెక్స్‌రాకెట్) అంశం మీద చర్చ జరగకుండా చేయాలనే తాపత్రయం అడుగడుగునా అధికార పక్షం చర్యల్లో వ్యక్తమయింది. కాల్ మనీ మీద ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాతే చర్చ జరుగుతుందని అధికార పక్షం చెప్పింది. ప్రకటన చేసిన తర్వాత చర్చకు అవకాశం ఉండదని, ముందుగా చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షం గట్టిగా పట్టుబట్టింది. ముందుగా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తే, తర్వాత విస్తృత చర్చకు అవకాశం ఇవ్వరని, కొన్ని క్లారిఫికేషన్లు ఇచ్చి చర్చను ముగించేస్తారని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో చర్చ చేశామంటూ మమ అనిపించేస్తారని, లోతుగా చర్చించడానికి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా అధికారపక్షం పారిపోతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
అయినా సెక్స్ రాకెట్ మీద చర్చకు స్పీకర్ అవకాశం ఇవ్వకుండా.. అంబేడ్కర్ అంశంపై తొలుత చర్చ చేపట్టారు. అవసరమైతే రెండు రోజులు అంబేడ్కర్ మీద చర్చిద్దామని, అత్యంత ముఖ్యమైన కాల్‌మనీ-సెక్స్ రాకెట్ మీద చర్చకు తొలుత అనుమతించాలంటూ విపక్ష సభ్యు లు ఆందోళనకు దిగారు. దాంతో ప్రతిపక్ష సభ్యులందరినీ అంబేడ్కర్ మీద చర్చ ముగిసే వరకు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌తో కలిసి సస్పెం డయిన విపక్ష ఎమ్మెల్యేలు శాసనసభ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి ప్రయత్నించగా.. అనుమతి లేదంటూ సిబ్బంది అనుమతి నిరాకరిం చారు. కొంత మంది ఎమ్మెల్యేలు ఎత్తయిన గేటు ఎక్కి వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేశారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత.. కాల్‌మనీ అంశం మీద ముఖ్యమంత్రి ప్రకటన చేయడానికి ఉపక్రమిం చారు. ముందు చర్చ జరిపాలని, తర్వాత ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వడం సంప్రదాయం అంటూ విపక్ష నేత చేసిన వాదననూ అధికారపక్షం పట్టించుకోలేదు. ప్రకటన చేసిన తర్వాత సుదీర్ఘ చర్చకు అవకాశం ఉండదని, అన్ని అంశాలను ప్రస్తావించడానికి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా పరిమితులు విధిస్తారని విపక్ష నేత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా.. స్పీకర్ పట్టించుకోలేదు. సీఎం ప్రకటన తర్వాతే పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు సమాధానం ఇస్తానని స్పీకర్ చెప్పారు.
అందుకు నిరసనగా పోడియం ముందు నిలబడి సభ్యులు నినాదాలు చేశారు. తన ముందే నినాదాలు చేస్తారా? నన్నే బెదిరిస్తారా? అంటూ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బజారు రౌడీలు అంటూ విపక్ష సభ్యులను దూషించారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన దూషణల పర్వాన్ని టీడీపీ సభ్యులు తారా స్థాయికి తీసుకెళ్లారు. విపక్ష నేతపై వ్యక్తిగత దూషణలకు దిగారు. పలు అన్‌పార్లమెంటరీ పదాలు వాడారు. అయినా విపక్ష సభ్యులు నిరసన బాట వీడకపోవడంతో.. గందరగోళ పరిస్థితుల మధ్య సభ వాయిదా పడింది.
తిరిగి ప్రారంభమైన తర్వాతా.. ముఖ్యమంత్రి ప్రకటన పూర్తి చేయనివ్వాలని స్పీకర్ సూచించారు. నిరసనలు, నినాదాల మధ్య చంద్రబాబు ప్రకటన చదవడం ముగించారు. సాయంత్రం ముఖ్యమంత్రి ప్రకటన ముగించే వరకు.. విపక్ష నేత జగన్‌కు మైక్ ఇచ్చినట్లే ఇచ్చి అడుగడుగునా కట్ చేయడం సాధారణమయింది. ఒక్కసారి కూడా కనీసం ఒకటి రెండు నిమిషాల పాటు మాట్లాడే అవకాశం ఆయనకు ఇవ్వలేదు. సీఎం ప్రకటన తర్వాత విపక్ష నేత చర్చకు ఉపక్రమించే సందర్భంలో.. చర్చ జరగకుండా ఉండాలనే లక్ష్యంతో.. రోజా సస్పెన్షన్‌ను తెరమీదకు తెచ్చారు.
కామ (కాల్‌మనీ) చంద్రబాబు అంటూ ముఖ్యమంత్రిని దూషించారనే ఆరోపణతో ఆమెను సస్పెండ్ చేయాలంటూ.. శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించగా, కనీవినీ ఎరుగని రీతిలో ఆమెను సంవత్సరం పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. కనీసం ఆమెకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆమె సభ నుంచి వెళ్లే వరకు విపక్ష నేతతో సహ ప్రతిపక్షంలో ఎవరూ మాట్లాడానికి కూడా స్పీకర్ అంగీకరించలేదు. ఈ దశలో మైక్ ఇవ్వమని జగన్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. స్పీకర్ పట్టువీడలేదు. సస్పెండ్ అయిన సభ్యురాలు సభను వీడితేనే మైక్ అంటూ స్పష్టం చేశారు.
తమకు ఎదురు చెబితే.. తాము ఏమైనా చేయగలమనే సందేశం ఇవ్వడమే లక్ష్యంగా అధికార పక్షం, స్పీకర్ వ్యవహరించారు. ఆ తర్వాతే విపక్ష నేతకు కొద్దిసేపు మాట్లాడే అవకాశం దక్కింది. అది కూడా చర్చ పూర్తిగా ముగియకుండానే.. ప్రతిపక్షం ముందునుంచీ చెబుతున్నట్లుగానే చర్చను చుట్టేసి.. సభను శనివారానికి వాయిదా వేశారు.