Karanam Balaramakrishna murthy
-
సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలన భేష్
ఒంగోలు సబర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది పాలన బాగుందని, ప్రజలకు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుపోతున్నారని చీరాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్న తపనతో వైఎస్ జగన్ ముందుకుసాగుతున్నారని తెలిపారు. ఒంగోలులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ► తన ఏడాది పాలనలో సీఎం వైఎస్ జగన్ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయి. ► అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లక్షల సచివాలయ ఉద్యోగాలిచ్చిన ఏకైక సీఎంగా పేరుతెచ్చుకున్నారు. వలంటీర్ల వ్యవస్థ ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ► కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సంక్షేమ పథకాల అమలు అసాధ్యమని చెప్పినా.. వాటిని ప్రజలకు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. ► దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తున్నారు.. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నారు.. ప్రాజెక్టుల విషయంలో బాబు శ్రద్ధచూపలేదు ► వెలిగొండ ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబు నిర్ణయాలే కారణం. ప్రాజెక్టు విషయంలో ఆయన శ్రద్ధ చూపలేదు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కనీసం నాయకుల్లో కూడా నమ్మకం కలిగించలేకపోయారు. తప్పులు దిద్దుకోలేకపోయారు. ► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన నిర్ణయాలతో రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ► వైఎస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు కావాలనే విమర్శలు చేస్తున్నారు.. అయినా వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదు. ► టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు నేరుగా సీఎం జగన్‌కు, మరికొందరు మంత్రులకు టచ్‌లో ఉన్నారు. వారు వైఎస్సార్సీపీలో చేరే విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది.. అని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణం బలరాం చెప్పారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
-
టీడీపీకి షాక్: వైఎస్సార్సీపీలోకి కరణం వెంకటేశ్
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కరణం వెంకటేశ్‌తోపాటు మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. (చదవండి: ‘టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు’) ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వెంకటేశ్ ఈ సందర్భంగా వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ పాలనపై అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ చీరాల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. (చదవండి: వైఎస్సార్సీపీలోకి రామసుబ్బారెడ్డి కుటుంబం) ఇది శుభపరిణామం : మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ‘కరణం వెంకటేశ్, పాలేటి రామారావు వైఎస్సార్సీపీలో చేరడం శుభపరిణామం. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన చూసి వీరు పార్టీలో చేరారు. కరణం బలరాంకు టీడీపీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు. కొత్తగా వచ్చిన వారిని తీసుకుని సీనియర్లను పక్కన పెట్టారు. చంద్రబాబు విధానాలను బలరాం వ్యతిరేకిస్తున్నారు’అని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన కరణం బలరాం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. (చదవండి: బాబూ.. సైకిల్ తొక్కలేం!) -
చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు ఝలక్ ఇచ్చారు. ఇసుకపై ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు కనీస స్పందన కరువైంది. జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా ఏ ఒక్కరూ నిరసన దీక్షలో పాల్గొనకుండా ముఖం చాటేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు సైతం నిరసన దీక్షలు చేపట్టలేదు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సైతం గైర్హాజరు కావడంపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు జిల్లాలోనే ఉన్నప్పటికీ నిరసన దీక్షలు చేపట్టి దాఖలాలు లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. టీడీపీ ఓటమిపాలైన తరువాత పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాలకు అనేక మంది ముఖ్య నేతలు డుమ్మా కొడుతుండటంతో టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల్లో అంతర్మథనం నెలకొంది. జిల్లాలో శుక్రవారం టీడీపీ నేతల నిరసన దీక్షలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇసుక విధానంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షల్లో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో టీడీపీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పిలుపును పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. ఇసుక విషయంలో ప్రభుత్వం నిజంగా విఫలం చెంది ఉంటే టీడీపీ నేతలతోపాటు భవన నిర్మాణ కారి్మకులు సైతం వీరి నిరసన దీక్షలకు మద్దతు తెలిపేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి కోట్ల రూపాయలు దోచేసిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న విషయం టీడీపీ నేతలకూ తెలుసు. అందుకే చంద్రబాబునాయుడు ఎంత గొంతు చించుకున్నా సొంత పార్టీ నేతలే స్పందించని దయనీయ పరిస్థితి. ప్రకాశం జిల్లాలో జిల్లా కేంద్రంతోపాటు రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పటికీ ఏ ఒక్కచోట నిరసన దీక్షా శిబిరాలు ఏర్పాటు చేయలేదు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో సైతం టీడీపీ ఛోటా నేతలు 20 మంది కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చి నిరసన కార్యక్రమాన్ని ముగించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని నియోజకవర్గాలకు పార్టీ బాధ్యులుగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి శిద్దా రాఘవరావు, అద్దంకి, పర్చూరు, చీరాల, కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, కరణం బలరాం, డోలా బాల వీరాంజనేయస్వామిలు సైతం ముఖం చాటేశారు. కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక్క కనిగిరి నియోజకవర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపి వెళ్లిపోయారు. అక్కడ మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కనీసం వినతిపత్రం ఇచ్చిన దాఖలాలు కూడా లేవంటే టీడీపీ నేతలకు చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని నియోజకవర్గాలకు టీడీపీ బాధ్యులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, పిడతల సాయికల్పనా రెడ్డిలు మాత్రం మార్కాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ నేతలు జిల్లాలోని మూడు చోట్ల చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కారి్మకులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా జరగకుండా తీసుకుంటున్న చర్యలను అర్థం చేసుకున్నారు కాబట్టే వారి నుంచి టీడీపీ నేతలకు ఎటువంటి మద్దతు లభించలేదనేది రుజువైంది. టీడీపీ నేతలు తూతూమంత్రంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు సొంతపార్టీ నేతలే డుమ్మా కొట్టడం చూస్తుంటే ఇసుక పాలసీపై వారిలో ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పనవసరం లేదు. మొత్తానికి నిరసన కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యనేతలంతా గైర్హాజరు కావడంతో ఉన్న పరువు కాస్తా పోయిందని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత సుజనా చౌదరితో కరణం విందు రాజకీయం బీజేపీ నేత సుజనా చౌదరితో టీడీపీ ఎమ్మెల్యే సాగించిన విందు రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇసుక సరఫరాపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు కరణం బలరాం పట్టించుకోలేదు. ఒంగోలు నగరంలోనే ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనని ఆయన బీజేపీ నేత సుజనా చౌదరితో కలిసి ఒంగోలు నగరంలోని ఓ టీడీపీ నాయకుని ఇంటిలో విందు ఆరగించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి లేని తీరిక బీజేపీ నేతతో భోజనం చేయడానికి ఎలా వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. భోజనం అనంతరం సుజనా చౌదరితో బలరాం రహస్య మంతనాలు సాగించినట్లు సమాచారం. -
ఎంపీడీవో.. నీ అంతు చూస్తా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గ్రామ వలంటీర్ల ఎంపిక సందర్భంగా దౌర్జన్యానికి దిగారు. అధికారులు ఎంపిక చేసిన అర్హుల జాబితాను పక్కన పడేసి తమ కార్యకర్తల పేర్లు చేర్చాలంటూ నానాయాగీ చేశారు. చీరాల ఎంపీడీవో చాంబర్ తలుపులు మూసేసి కంప్యూటర్ను స్వాధీనం చేసుకుని అందులో 61 మంది టీడీపీ కార్యకర్తల పేర్లు చేర్చి ప్రత్యేక జాబితా తయారు చేశారు. ఆ జాబితాపై సంతకం చేయాలంటూ కరణం బలరాం ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా బలరాం బలవంతంగా ఎంపీడీవోతో రెండో జాబితాపై సంతకం చేయించారు. తాము ఇచ్చిన జాబితాను ప్రకటించకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు. ఇది జరుగుతున్న సమయంలో కరణం అనుచరులు ఎంపీడీవో కార్యాలయంలోకి విలేకర్లను రానివ్వకుండా అడ్డుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కరణం తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీవో సిద్ధమయ్యారు. అదే సమయంలో ఆయనకు బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో ఫిర్యాదు చేయకుండా వెళ్ళిపోయారు. గ్రామ వలంటీర్ల జాబితా విడుదల చేసిన ఎంపీడీవో 61 మందితో ఉన్న రెండు జాబితాలనూ ప్రకటించలేదు. జిల్లా ఉన్నతాధికారులకు రెండు జాబితాలు పంపినట్లు సమాచారం. గ్రామాల్లో తిరగనివ్వం: కరణం అనుచరులు.. ప్రకాశం జిల్లా చీరాల మండలంలో 446 గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అర్హత ఆధారంగా ఆదివారం తుది జాబితాను తయారు చేశారు. ఎంపీడీవో వెంకటేశ్వర్లు సోమవారం జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కరణం బలరాంతోపాటు ఆయన అనుచరులు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి దౌర్జన్యానికి దిగారు. తమ వారి పేర్లు లేకపోతే వలంటీర్లను గ్రామాల్లో తిరగనివ్వమంటూ హెచ్చరికలు కూడా చేశారు. బలవంతంగా జాబితాలో తమకు చెందిన 61 మందిని చేర్చించారు. గ్రామ వలంటీర్ల జాబితా సిద్ధమైన తరువాత ఎమ్మెల్యే కరణం బలరాం తన చాంబర్‌కు వచ్చి 61 మంది పేర్లు మార్చి తమ వారి పేర్లు చేర్చాలని ఒత్తిడి చేసినట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. -
అప్పుడలా... ఇప్పుడిలా...!
-
అప్పుడలా... ఇప్పుడిలా...!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేన్నయితే వ్యతిరేకించిందో... ఈనాడు అధికారంలో అదే చేసింది. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్ కె రోజాను ఏకంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండు చేశారు. అసెంబ్లీలో కాల్ మనీపై చర్చకు అంగీకరించకపోవడంతో నిరసనగా పోడియం వద్ద నిరసన తెలియజేస్తున్న సందర్భంగా రోజా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న నెపంతో అధికార పార్టీ ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండు చేయాలని తీర్మానం పెట్టడం, అది కూడా ప్రవేశపెట్టిన మరుక్షణమే ఎలాంటి చర్చకు తావివ్వకుండానే వెనువెంటనే సస్పెండు చేశారు. ఆరు నెలల పాటు కరణం సస్పెన్షన్ శాసనసభ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరిగిన సందర్భం లేదు. 2008లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న అంశంపై టీడీపీ సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తిని ఆరు నెలల పాటు సభ నుంచి సస్పెండు చేశారు. అయితే అప్పట్లో దీనికి ఒక పద్ధతిని పాటించారు. కరణం బలరాం చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు స్పీకర్ ముందు ఫిర్యాదు చేయగా, స్పీకర్ దాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. సీనియర్ సభ్యుడు గాదె వెంకట్‌రెడ్డి నేతృత్వంలో సభా హక్కుల కమిటీకి సిఫారసు చేయగా, ఆ కమిటీ పూర్వాపరాలు తెలుసుకుని అవసరమైన సాక్ష్యాధారాలను పరిశీలించింది. స్వయంగా కరణం బలరాం వాదనలను కూడా విన్నది. ఆ తర్వాత కరణం బలరాంను ఆరు నెలల పాటు సస్పెండు చేయాలని సిఫారసు చేసింది. విచిత్రమేమంటే... దానిపై శాసనసభలో కరణం బలరాంకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా లభించింది. నాడు చంద్రబాబు ఏమన్నారంటే... ఇంత జరిగిన తర్వాతే కరణం బలరాంను ఆరు నెలల పాటు సస్పెండు చేయగా, ఆరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇదొక దుర్దినం అనీ, కక్ష సాధింపు చర్య అంటూ దుయ్యబట్టారు. సభలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలను కూడగట్టి అసెంబ్లీ ఆవరణలోకి గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేశారు. కరణం బలరాంపై కక్ష సాధింపు చర్యకు దిగారంటూ ఆరోజు ఏకంగా స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. పార్లమెంటరీ చరిత్రలోనే... ఒక పార్టీ నుంచి ఎంపికైనా సభ్యుడు మరో పార్టీలోకి ఫిరాయించినట్టు బహిరంగంగా స్పష్టమైన సందర్భాల్లోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అనేక పద్ధతులు, సంప్రదాయాలను పాటిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా వారి వాదనలు వినిపించడానికి అవకాశం కల్పించారు. సభ్యుల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. రోజా విషయంలో... కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంలో సూత్రధారులను అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని ఆరోపిస్తూ రెండు రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీలో డిమాండ్ చేస్తోంది. దానిపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వడం, అది తిరస్కరించడంతో ముందు దానిపైనే చర్చ జరగాలని పట్టుబట్టింది. శుక్రవారం కూడా ఇదే అంశంపై పోడియం చుట్టుముట్టి నిరసనగా నినాదాలు చేశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలా నినాదాలు చేయడంపై ఆ తర్వాత ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పలువురు అధికార పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో దుయ్యబట్టిన తర్వాత ఉన్నట్టుండి రోజాను ఏడాది పాటు సస్పెండు చేయాలని టీడీపీ సభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర కోరడం, వెనువెంటనే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం... క్షణాల్లో రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏం తప్పు చేశారని... రోజా ఏం తప్పుచేశారని సస్పెండు చేశారని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి లేచి ప్రశ్నించినప్పటికీ మాట్లాడటానికి సభలో అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో సభలోనే ఉన్న రోజాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పైగా సస్పెండైన రోజా సభ నుంచి నిష్ర్కమిస్తే తప్ప మాట్లాడటానికి ప్రతిపక్షానికి అవకాశమివ్వబోమని స్పీకర్ తేల్చిచెప్పారు.