ఎంపీడీవోతో కలిసి వలంటీర్ల జాబితాలను దగ్గరుండి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయిస్తున్న టీడీపీ నాయకులు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గ్రామ వలంటీర్ల ఎంపిక సందర్భంగా దౌర్జన్యానికి దిగారు. అధికారులు ఎంపిక చేసిన అర్హుల జాబితాను పక్కన పడేసి తమ కార్యకర్తల పేర్లు చేర్చాలంటూ నానాయాగీ చేశారు. చీరాల ఎంపీడీవో చాంబర్ తలుపులు మూసేసి కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకుని అందులో 61 మంది టీడీపీ కార్యకర్తల పేర్లు చేర్చి ప్రత్యేక జాబితా తయారు చేశారు. ఆ జాబితాపై సంతకం చేయాలంటూ కరణం బలరాం ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా బలరాం బలవంతంగా ఎంపీడీవోతో రెండో జాబితాపై సంతకం చేయించారు. తాము ఇచ్చిన జాబితాను ప్రకటించకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు. ఇది జరుగుతున్న సమయంలో కరణం అనుచరులు ఎంపీడీవో కార్యాలయంలోకి విలేకర్లను రానివ్వకుండా అడ్డుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కరణం తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీవో సిద్ధమయ్యారు. అదే సమయంలో ఆయనకు బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో ఫిర్యాదు చేయకుండా వెళ్ళిపోయారు. గ్రామ వలంటీర్ల జాబితా విడుదల చేసిన ఎంపీడీవో 61 మందితో ఉన్న రెండు జాబితాలనూ ప్రకటించలేదు. జిల్లా ఉన్నతాధికారులకు రెండు జాబితాలు పంపినట్లు సమాచారం.
గ్రామాల్లో తిరగనివ్వం: కరణం అనుచరులు..
ప్రకాశం జిల్లా చీరాల మండలంలో 446 గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అర్హత ఆధారంగా ఆదివారం తుది జాబితాను తయారు చేశారు. ఎంపీడీవో వెంకటేశ్వర్లు సోమవారం జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కరణం బలరాంతోపాటు ఆయన అనుచరులు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి దౌర్జన్యానికి దిగారు. తమ వారి పేర్లు లేకపోతే వలంటీర్లను గ్రామాల్లో తిరగనివ్వమంటూ హెచ్చరికలు కూడా చేశారు. బలవంతంగా జాబితాలో తమకు చెందిన 61 మందిని చేర్చించారు. గ్రామ వలంటీర్ల జాబితా సిద్ధమైన తరువాత ఎమ్మెల్యే కరణం బలరాం తన చాంబర్‌కు వచ్చి 61 మంది పేర్లు మార్చి తమ వారి పేర్లు చేర్చాలని ఒత్తిడి చేసినట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment