ఒంగోలు నగరంలోని ఓ టీడీపీ నాయకుని ఇంటిలో విందుకు హాజరైన సుజనాచౌదరి, కరణం బలరాం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు ఝలక్ ఇచ్చారు. ఇసుకపై ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు కనీస స్పందన కరువైంది. జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా ఏ ఒక్కరూ నిరసన దీక్షలో పాల్గొనకుండా ముఖం చాటేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు సైతం నిరసన దీక్షలు చేపట్టలేదు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సైతం గైర్హాజరు కావడంపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు జిల్లాలోనే ఉన్నప్పటికీ నిరసన దీక్షలు చేపట్టి దాఖలాలు లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. టీడీపీ ఓటమిపాలైన తరువాత పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాలకు అనేక మంది ముఖ్య నేతలు డుమ్మా కొడుతుండటంతో టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల్లో అంతర్మథనం నెలకొంది.
జిల్లాలో శుక్రవారం టీడీపీ నేతల నిరసన దీక్షలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇసుక విధానంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షల్లో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో టీడీపీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పిలుపును పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. ఇసుక విషయంలో ప్రభుత్వం నిజంగా విఫలం చెంది ఉంటే టీడీపీ నేతలతోపాటు భవన నిర్మాణ కారి్మకులు సైతం వీరి నిరసన దీక్షలకు మద్దతు తెలిపేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి కోట్ల రూపాయలు దోచేసిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని నివారించేందుకు
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న విషయం టీడీపీ నేతలకూ తెలుసు. అందుకే చంద్రబాబునాయుడు ఎంత గొంతు చించుకున్నా సొంత పార్టీ నేతలే స్పందించని దయనీయ పరిస్థితి. ప్రకాశం జిల్లాలో జిల్లా కేంద్రంతోపాటు రెండు రెవెన్యూ డివిజన్‌లు ఉన్నప్పటికీ ఏ ఒక్కచోట నిరసన దీక్షా శిబిరాలు ఏర్పాటు చేయలేదు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో సైతం టీడీపీ ఛోటా నేతలు 20 మంది కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చి నిరసన కార్యక్రమాన్ని ముగించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని నియోజకవర్గాలకు పార్టీ బాధ్యులుగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జి శిద్దా రాఘవరావు, అద్దంకి, పర్చూరు, చీరాల, కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, కరణం బలరాం, డోలా బాల వీరాంజనేయస్వామిలు సైతం ముఖం చాటేశారు.
కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక్క కనిగిరి నియోజకవర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపి వెళ్లిపోయారు. అక్కడ మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కనీసం వినతిపత్రం ఇచ్చిన దాఖలాలు కూడా లేవంటే టీడీపీ నేతలకు చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని నియోజకవర్గాలకు టీడీపీ బాధ్యులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, పిడతల సాయికల్పనా రెడ్డిలు మాత్రం మార్కాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.
టీడీపీ నేతలు జిల్లాలోని మూడు చోట్ల చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కారి్మకులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా జరగకుండా తీసుకుంటున్న చర్యలను అర్థం చేసుకున్నారు కాబట్టే వారి నుంచి టీడీపీ నేతలకు ఎటువంటి మద్దతు లభించలేదనేది రుజువైంది. టీడీపీ నేతలు తూతూమంత్రంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు సొంతపార్టీ నేతలే డుమ్మా కొట్టడం చూస్తుంటే ఇసుక పాలసీపై వారిలో ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పనవసరం లేదు. మొత్తానికి నిరసన కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యనేతలంతా గైర్హాజరు కావడంతో ఉన్న పరువు కాస్తా పోయిందని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ నేత సుజనా చౌదరితో కరణం విందు రాజకీయం
బీజేపీ నేత సుజనా చౌదరితో టీడీపీ ఎమ్మెల్యే సాగించిన విందు రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇసుక సరఫరాపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు కరణం బలరాం పట్టించుకోలేదు. ఒంగోలు నగరంలోనే ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనని ఆయన బీజేపీ నేత సుజనా చౌదరితో కలిసి ఒంగోలు నగరంలోని ఓ టీడీపీ నాయకుని ఇంటిలో విందు ఆరగించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి లేని తీరిక బీజేపీ నేతతో భోజనం చేయడానికి ఎలా వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. భోజనం అనంతరం సుజనా చౌదరితో బలరాం రహస్య మంతనాలు సాగించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment