మరోసారి ఇలా జరగొద్దు
చేవెళ్ల: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆరా తీశారు. ‘ఆపరేషన్ కష్టాలు’, బెడ్లు సరిపోక ఇబ్బందులకు గురైన మహిళలు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఈనెల 23న ప్రచురితమైన వార్తకు ఆయన స్పందించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఈవిషయంపై ఇంచార్జి వైద్యాధికారి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పలు మండలాలకు చెందిన మహిళలకు ఒకేసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం, బెడ్లు, వసతులు సరిపోకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన ఎమ్మెల్యే యాదయ్య దృష్టికి తీసుకొచ్చారు. మరోసారి అలా జరగొద్దని ఎమ్మెల్యే చెప్పారు.
ఆపరేషన్ల కోసం వచ్చే మహిళలకు సరైన వసతులు, వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఈ విషయంపై తాను జిల్లా వైద్యాధికారులతో మాట్లాడతానని తెలిపారు. బెడ్లు, వసతులు సరిపోని పక్షంలో ఒక్కో మండలవాసులకు ఒక్కోరోజు ఆపరేషన్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య వైద్యులకు సూచించారు.